కొచ్చిలో జరిగిన ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత కార్యకారిణి మండలి సమావేశాలు

సమావేశాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ఆర్.ఎస్.ఎస్. సరసంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్

ప్రతి సంవత్సరం దసరా తరువాత జరిగే ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత కార్యకారిణి మండలి సమావేశాలు ఈ సంవత్సరం 2013 అక్టోబర్ 25, 26, 27  తేదీలలో కేరళలోని కొచ్చిలో జరిగాయి. ఈ సమావేశాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ యొక్క పని వికాసం మరియు అనేక సామాజిక జీవన రంగాలలో నిర్వహించబడుతున్న రాష్ట్రీయ పునర్నిర్మాణ కార్యక్రమాల యొక్క సమీక్ష నిర్వహించబడింది.

దేశం మొత్తం మీద సంఘశాఖల సంఖ్య పెరిగింది. 25,950 స్థలాలలో 39,962 శాఖలు నిర్వహించబడుతున్నాయి. 9,703 సాప్తాహిక్ లు, 6,904 సంఘ మండలిలు, మొత్తం 56,569 స్థలాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సంవత్సరం స్వామి వివేకానంద సార్థ శతజయంతి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 2012 డిశంబర్ 25 నాడు దేశం మొత్తంలో 7,00,000 మంది కార్యకర్తలు సంకల్పం చేశారు. సూర్య నమస్కారాల కార్యక్రమాలలో 2 కోట్ల మంది బాలబాలికలు పాల్గొన్నారు. దేశంలోని అన్ని గ్రామాలలో ప్రతి కుటుంబానికి వివేకానందుడి చిత్రపటం మరియు సాహిత్యం అందచేసే కార్యక్రమం కూడా ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించబడుతున్నది. సెప్టెంబర్ 11 'వివేకానందుడు చికాగోలో ఉపన్యసించిన రోజు'. ఆ సందర్భంగా జరిగిన పరుగు (రన్ ఫర్ ది నేషన్) లో 3,553 స్థలాలలో 22,50,000 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్ లో జరిగిన భీషణ వరదలలో ప్రారంభం నుండి సేవా కర్యక్రమాలు నిర్వహించారు. వందలాది మందిని రక్షించారు. ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేలాదిమంది ప్రజలకు సేవలనందించారు. 25 కోట్ల రూపాయల ఖర్చుతో 5 బహుళ సేవా కేంద్రాలను నిర్మాణం చేస్తున్నారు. వీటిలో అనాథ పిల్లలకు హాస్టళ్లు, ఉపాధి కల్పన కేంద్రం, వైద్య కేంద్రం, యాత్రికులకు సౌకర్యాలు మొదలైన అన్ని వసతులు కల్పించబడతాయి.

సోమనాథ మందిరాన్ని ప్రభుత్వమే నిర్మించింది. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టాలి, మరియు అయోధ్యలో వేరే నిర్మాణం జరగకూడదనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేయటానికి అక్టోబర్ 18న జరిగిన సంకల్ప దివస్ కార్యక్రమంలో దేశం మొత్తంలో 20 వేల స్థలాల్లో 11,50,000 మంది సంకల్పం చేశారు. వేలాదిమంది సాధుసంతులు పరిక్రమ చేశారు. అనేకమంది పరిక్రమ చేస్తూ అరెస్టు చేయబడ్డారు.

ఈ సమావేశాలలో రెండు తీర్మానాలు ఆమోదించబడినాయి. ఆ తీర్మానాల పూర్తిపాఠం ఈ క్రింద ఇవ్వబడింది.

తీర్మానం - 1
దక్షిణ భారతంలో విస్తరిస్తున్న జిహాదీ కార్యకలాపాలు
 
దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జిహాదీ కార్యకలాపాలు విస్తరిస్తుండటం పట్ల అఖిల భారత కార్యకారిణి మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా వేర్పాటువాద, విచ్ఛిన్నకర సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో ముస్లిం యువకుల్లో ఉగ్రవాద సంస్థలు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ, వారికి ఉగ్రవాద శిక్షణనిస్తూ హిందూ సంస్థల నాయకులు, కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తున్నాయి. విద్రోహులైన మావోయిస్టులు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల సహకారంతో జిహాదీ సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాలు దేశభద్రతకు పెనుముప్పుగా తయారయ్యాయి. ఇటువంటి విచ్ఛిన్నకర సంస్థలపట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉదాశీన వైఖరి దేశభక్తుల హృదయాలలో ఆందోళనను కలిగిస్తున్నది.

'పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' (పి.ఎఫ్.ఐ.)

'సిమి' సంస్థలను నిషేధించిన తరువాత కేరళలో 'పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' (పి.ఎఫ్.ఐ.) ప్రారంభమైంది. ఆ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఇతర సంస్థలు ఇందుకు తాజా ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ సంస్థ కర్నాటకలోని 'కర్నాటక ఫర్ డిగ్నిటీ' (కె.ఎఫ్.డి.), తమిళనాడుకు చెందిన 'మనితానీతిపనరై' (ఎం.ఎన్.పి.), కేరళలోని 'నేషనల్ డెవలప్ మెంట్ ఫ్రంట్ (ఎన్.డి.ఎఫ్.) తదితర సంస్థలతో సమన్వయంగా పనిచేస్తూ 'ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం' కోసం పోరాటం చేస్తున్నామని ప్రకటించుకోవడం కరడుగట్టిన మతతత్వ వాదాన్ని విస్తరించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగానే పరిగణించాల్సి ఉంటుంది.  ముస్లిం యువకుల మనస్సుల్లో విషబీజాలు (బ్రెయిన్ వాష్) నాటడం, వారికి సాయుధ శిక్షణ ఇవ్వడం, శిక్షణ పొందినవారిలో ఎంపిక చేసిన యువకులను దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపడం వంటి కార్యకలాపాలను ఈ ఉగ్రవాద సంస్థలు చేపడుతున్నట్లు 'కాశ్మీరీ రిక్రూట్ మెంట్ కేసు'లో ఎన్.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు ఇటీవల తన తీర్పులో వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉగ్రవాద భావాలు గల యువకులు పోలీసు వ్యవస్థలో, ప్రభుత్వ యంత్రాంగంలో చొచ్చుకు పోయినట్లు కేరళ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ఎదుట అంగీకరించింది. హిజ్ బుల్ ముజాహిద్దీన్, లష్కర్-ఎ-తోయిబా, అల్-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ముస్లిం యువకులు కొనసాగిస్తున్న సంబంధాలను కేరళ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ఈ అంశాలను పరిశీలిస్తే పై సంస్థల లక్ష్యం ఏమిటో స్పష్టమవుతున్నది. రాజకీయంగా తమకు మద్దతునిచ్చే సంస్థలను తయారుచేసుకోవడంలో పై ఉగ్రవాద సంస్థలు నిమగ్నమైనట్లు స్పష్టమవుతున్నది.

అబ్దుల్ నాసర్ మదాని

ఈ ఉగ్రవాద సంస్థల కారణంగా కేరళ రాష్ట్రం సంఘ వ్యతిరేక శక్తుల, జాతి విద్రోహకర కార్యకలాపాలకు కేంద్రంగా తయారైంది. ఉగ్రవాద సంస్థలు కేరళలో శిక్షణ కేంద్రాలు నడుపుతూ, తమ కార్యకర్తలు తలదాచుకోవడానికి, రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. కేరళ తీరంలో పెద్ద మొత్తాలు చెల్లించి భూములను కొనుగోలు చేయడం, నకిలీ కరెన్సీని చలామణి చేయడం, స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ముస్లిం యువకులు, యువతులను ఆకర్షించడం, విద్వేష సాహిత్యం పంపిణీ చేసి జిహాద్ గురించి తెలియచెప్పడం వీటిపని. కేరళ ఉత్తర ప్రాంతంలో కొన్ని మీడియా సంస్థల తోడ్పాటుతో కొనసాగిస్తున్న ఈ ప్రచారం మరియు పెరిగిపోతున్న ముస్లిం జనాభా కారణంగా ఆ ప్రాంతం ఎప్పుడైనా పేలిపోయే టైంబాంబులా తయారైంది. 1998లో జరిగిన కోయంబత్తూరు పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ నాసర్ మదాని కుటుంబంలో జరిగిన ఒక కార్యక్రమానికి మంత్రులతో సహా అనేకమంది రాజకీయ నేతలు హాజరు కావడం, మదాని కేసును సిబిఐ కి అప్పగించడానికి కేరళ ప్రభుత్వం విముఖత, తదితర అంశాలను పరిశీలిస్తే ఉగ్రవాద సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో అర్థమవుతుంది. కేరళలో హిందూ సంస్థల నేతలను హతమార్చడానికి కుట్ర జరుగుతోంది. దేశద్రోహ సంస్థల కార్యకలాపాలను రాష్ట్రంలోని యుడిఎఫ్ ప్రభుత్వం మౌనంగా వీక్షిస్తూ చేష్టలుడిగి అచేతనంగా మిగిలిపోయింది.

ఈ ఉగ్రవాద సంస్థల నెట్ వర్క్ పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడుకు కూడా విస్తరిస్తోంది. తమిళనాడులో హిందూ నేతలు, హిందూ సంస్థల కార్యాలయాలపై దాడులు చేయడం, హిందూ ఉత్సవాలలో అల్లర్లు సృష్టించడం, అమెరికా రాయబార కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శన, ఇటీవల హిందూ మున్నని, బిజెపి రాష్ట్ర స్థాయి కార్యకర్తల హత్య, ఆంధ్రప్రదేశ్ లోని పుత్తూరులో పోలీసులపై ఆయుధాలతో దాడి చేయటం వంటివి ఉగ్రవాదుల నెట్ వర్క్ విస్తరిస్తోందనడానికి నిదర్శనం. కర్నాటక కోస్తా తీరంలోని భత్కల్ పట్టణం పెద్ద ఎత్తున ఎగుమతికి కేంద్రంగా మారిపోయింది. తిరుపతి, మధురై, శబరిమలై వంటి పుణ్యక్షేత్రాలపై బాంబు దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు పథకం రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఈ ఉగ్రవాద సంస్థలపై ఒక కన్ను వేసి, వాటి కార్యకలాపాలపై నిఘా సంస్థలు విచారణ జరిపించాలని అఖిల భారతీయ కార్యకారిణి మండలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది. ఈ సంస్థలకు అందుతున్న నిధులు, ఇతరత్రా సహకారంపై విచారణ జరిపించాలని, పి.ఎఫ్.ఐ. వంటి సంస్థలను నిషేధించాలని కార్యకారిణి మండలి కోరుతున్నది. ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల పట్ల మీడియాతో సహా జాతీయవాద సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని కార్యకారిణి మండలి విజ్ఞప్తి చేస్తోంది. జాతి విద్రోహ సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని కార్యకారిణి మండలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది.

తీర్మానం - 2
సరిహద్దుల రక్షణకు పటిష్ట చర్యలు అవశ్యం

భారత సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు రక్షణ కొరవడటం పట్ల అఖిల భారత కార్యకారిణి మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. భారత్ కు ఎనిమిది (8) పొరుగు దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఈ పొరుగు దేశాలన్నిటితో మనకు సరిహద్దు వివాదాలు నెలకొనడం విచారకరం. 


సరిహద్దుల రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కార్యకారిణి మండలి భావిస్తున్నది. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న మన సరిహద్దుల రక్షణ వ్యవస్థ ఆశించిన రీతిలో లేదన్న వాస్తవం తాజా అధ్యయనం మరియు ఇటీవల జరుగుతున్న సంఘటనల వల్ల స్పష్టం అవుతున్నది.

4057 కి.మీ. పొడవు గల భారత్ - టిబెట్ సరిహద్దును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. అనేక సెక్టార్లలో నిర్మించిన రహదారులు కేవలం 50-60 కి.మీ. మాత్రమే ఉన్నాయి. ఫలితంగా సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. కొన్ని గ్రామాలకైతే వారానికి ఒక్కరోజు మాత్రమే బస్సు వెళ్తుంది. పాఠశాలలకు తగిన భవనాలు లేవు. ఆసుపత్రులు లేవు. విద్యుత్ సరఫరా తరచు నిలిచిపోవడం లేదా అసలు లేకపోవడం జరుగుతోంది. అనేక గ్రామాలకు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో లేదు. మార్కెట్ లు చాలా దూరంగా ఉండటంతో అనేక సందర్భాలలో నిత్యావసర సరకుల కోసం గ్రామస్తులు సరిహద్దు దాటాల్సిన పరిస్థితి వస్తోంది.

సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు మన సైనికుల వలెనే దేశ సరిహద్దులను పరిరక్షిస్తారని అఖిల భారత కార్యకారిణి మండలి భావిస్తున్నది. ఈ గ్రామాలను నిర్లక్ష్యం చేయడం వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నది. సరిహద్దు గ్రామాల్లో తగిన మౌలిక వసతులు కల్పించకపోవడం వలన ఉపాధి లభించక ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫలితంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఖాళీ అయిన ప్రాంతాలను చైనా ఆక్రమించుకుంటోంది. ఈ కారణంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులు నిరంతరం జరుపుతున్న కాల్పుల కారణంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. పాక్ సైనికుల కాల్పుల కారణంగా ఆస్తుల విధ్వంసం, పశుసంపద నష్టం, కొన్ని సందర్భాలలో ప్రాణాలకు సైతం హాని కలుగుతోంది. ఆస్తులు, ప్రాణ నష్టానికి చాలా తక్కువగ నష్టపరిహారం అందుతోంది. అనేక సందర్భాలలో అసలు నష్టపరిహారమే చెల్లించడం లేదు. అనేక ప్రాంతాల్లో ప్రజలు సంవత్సరాలపాటు పునరావాస శిబిరాల్లో తలదాచుకోవలసి వస్తున్నది. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా అనేక కష్టాలు పడుతున్నారు. సరిహద్దు కంచె, మందుపాతరల కారణంగా ప్రజలు తమ పొలాలకు వెళ్లడానికి అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారు.

భారత్-నేపాల్, భారత్-మయన్మార్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులు అక్రమ వ్యపారాలకు, నకిలీ కరెన్సీ చలామణికి, ఆయుధాల స్మగ్లింగ్ కు, మాదక ద్రవ్యాలు, మనుష్యుల అక్రమ రవాణాకు స్వర్గధామాలుగా ఉన్నాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు ఈ సరిహద్దుల ద్వారా పొరుగు దేశాలకు పారిపోతున్నారు. భారత బంగ్లా సరిహద్దుల ద్వారా అక్రమ చొరబాట్లు, పశుసంపద తరలింపు నిరాఘాటంగా జరిగిపోతోంది. బంగ్లాదేశ్ నుంచి పౌరులు అక్రమంగా మనదేశంలో ప్రవేశించటం, ఇటువైపు నుంచి గోవులతో సహా పశసంపదను అటువైపునకు తరలించడం జరుగుతోంది. భారత్-నేపాల్ సరిహద్దులకు రెండువైపులా మదర్సాలు, మసీదులు ఏర్పాటు కావడంతో రెండు దేశాల రక్షణకు ముప్పు ఏర్పడుతోంది.

సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత అఖిల భారత కార్యకారిణి మండలి కేంద్రప్రభుత్వానికి ఈ క్రింది సూచనలు చేస్తున్నది :
  1. సరిహద్దు గ్రామాల్లో రోడ్లు, రైల్వే, నెట్ వర్క్, విద్యుత్, మంచినీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతులను కల్పించాలి.
  2. సరిహద్దు ప్రాంతాల్లో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేయాలి. సరిహద్దుల రక్షణకు అవసరమైన శిక్షణ స్థానిక యువకులకు అందచేయాలి.
  3. భారత్ కు నలువైపుల ఉన్న సరిహద్దులను రక్షించడానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలి.
  4. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మొత్తం పొడవునా కంచె నిర్మాణం జరగాలి. ఈ సరిహద్దులో నిరంతరం పహరా ఉండాలి.
  5. సరిహద్దు కంచె నిర్మాణం కారణంగా భూమిని కోల్పోయే స్థానికులకు తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించాలి.
  6. సరిహద్దు ప్రాంతాల్లో ప్రాచీన కాలం నుంచి ఉన్న పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసి వాటిని సందర్శించడానికి టూరిస్టులను ప్రోత్సహించాలి. సరిహద్దు ప్రాంతాలకు పర్యాటకులను ప్రోత్సహించడం వల్ల స్థానికులకు ఉపాధి లభిస్తుంది. పైగా దేశ ప్రజలకు సరిహద్దులతో భావాత్మక బంధం ఏర్పడుతుంది.
  7. సరిహద్దుల్లో పనిచేస్తున్న పారామిలిటరీ, మిలిటరీ సైనికులకు మధ్య సమన్వయం, సహకారం కొనసాగే వ్యవస్థను పటిష్టం చేయాలి. సరిహద్దుల రక్షణకు ఉద్దేశించిన అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి.
  8. సైనిక వ్యవస్థ - సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య సంప్రదింపులు, చర్చలు జరగడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం.
దృఢసంకల్పం లేని ప్రభుత్వం

దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు భారత ప్రభుత్వంలో దృఢసంకల్పం లేకపోవడమేనని అఖిల భారత కార్యకారిణి మండలి భావిస్తోంది. మన సరిహద్దు భూభాగంలోని ప్రతి అంగుళం పరిరక్షిస్తామనే సంకల్పం మన నాయకుల్లో లేకపోవడం విచారకరం. మన సరిహద్దులను గుర్తించడంలో స్పష్టమైన విభజన రేఖ లేదని వాదిస్తున్న అధికార, ప్రభుత్వ యంత్రాంగాలు చేస్తున్న వాదనలను, ప్రచారాన్ని నిలిపివేయాలని కార్యకారిణి మండలి డిమాండ్ చేస్తున్నది. మన సరిహద్దులను స్పష్టంగా నిర్వచించడం, విభజించడం జరిగింది. ఈ చారిత్రాత్మక వాస్తవాన్ని అంగీకరించే దృఢసంకల్పం మన దేశ నాయకుల్లో లోపిస్తోంది. సరిహద్దులను రక్షించి మన భూభాగాలపై సార్వభౌమత్వాన్ని కాపాడే పని కేంద్రప్రభుత్వానిదేనన్న వాస్తవాన్ని అఖిల భారత కార్యకారిణి మండలి దేశ ప్రజలకు గుర్తు చేస్తున్నది. సరిహద్దులోని తాజా పరిస్థితులపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైనప్పుడు సరిహద్దుల రక్షణకు నడుం బిగించడానికి సిద్ధంగా ఉండాలని కార్యకారిణి మండలి పిలుపునిస్తోంది.