చెడపకురా.. చెడేవు...!

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితిష్ కుమార్
 
No army can stop an idea, when its time comes - అని ఆంగ్లంలో ఒక నానుడి ఉన్నది. నరేంద్రమోది గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుపరిపాలన, అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలన, మచ్చుకు కూడా కనపడని అవినీతి, తానేమిటో మాటల ద్వారా కాకుండా చేతల్లో చూపించిన దేశభక్త నాయకుడు.  "నేను హిందువును, ఆ మాటను నేను సగర్వంగా ప్రకటిస్తాను" అని ఒక విదేశి విలేకరికి కుండబ్రద్దలు కొట్టినట్లుగా చెప్పిన భారతమాత ప్రియపుత్రుడు మన "నమో".  
 
అటువంటి మోదీని దుర్భాషలాడుతూ, మతోన్మాది, నరహంతకుడు అని దూషిస్తూ పూర్తిగా మోదీని వ్యతిరేకించాడు శ్రీ నితిష్ కుమార్. మోదీని భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఎన్.డి.ఎ. నుండి వైదొలిగాడు కూడా.  తానే భారత భావి ప్రధాని అని పగటి కలలు కంటూ, మోదీ నాయకత్వంలోని భాజపా/ఎన్.డి.ఏ.ల గెలుపు అసాధ్యం అని ప్రకటించడమే కాక, 'నరేంద్రమోది ఎలా గెలుస్తాడో చూస్తాను' అని బీరాలు పలికిన నితిష్ బీహార్ ముఖ్యమంత్రి వర్గం నుండి భాజపా మంత్రులను డిస్మిస్ చేశాడు. భాజపా మంత్రులకు రాజీనామా చేసే అవకాశం కూడా ఇవ్వకుండా నితిష్ తీసుకున్న దుందుడుకు చర్య ఇది. 
 
అయితే నరేంద్రమోది ఒక ప్రాంతీయ నాయకుడు, ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు, వందకోట్లకు పైగా ఉన్న భారత ప్రజానీకం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జాతీయ నాయకుడు నరేంద్రమోది. ధూం..ధాం.. అంటూ ఉత్తరకుమారుడి ప్రతిజ్ఞలు చేసిన నితిష్ కుమార్ కు ఏ గతి పట్టిందో చూశారుగా! మొన్న జరిగిన ఎన్నికలలో ఎవరినో చిత్తు చేస్తాను అని వాగిన నితిష్ కుమార్ తానే చిత్తయిపోయాడు. ప్రధానమంత్రి పదవి సంగతి దేవుడెరుగు, ఉన్న ముఖ్యమంత్రి పదవి సైతం ఊడిపోయింది. దీనినే విధి విచిత్రం అంటారు. ఎవరి ఖర్మకు వారే బాధ్యులు అని కూడా అంటారు. ఎదుటివారి కోసం గోతులు త్రవ్వేవారు చివరకు ఆ గోతిలో తామే పడతారు అనేది కూడా సత్యం. 
 
బీహార్ రాష్ట్రానికి 40 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికలలో నితిష్ నాయకత్వంలోని జెడి(యు) కి దక్కినవి రెండంటే రెండే స్థానాలు (2009 లో 20 స్థానాలు జెడి(యు) గెలుచుకుంది). గతంలో 12 స్థానాలు మాత్రమే ఉన్న భాపా ఇప్పుడు 25 స్థానాలు గెలుచుకుంది. ఇది ఇలా ఉండగా బీహారు శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో కూడా నితిష్ కు చుక్కలు కనబడ్డాయి. అయిదు (5) స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా నితిష్ పార్టీ గెలుచుకున్నది కేవలం ఒకే ఒక్క స్థానం.  
 
తానేదో జాతీయ నాయకుడినని విఱ్ఱవీగుతున్న నితిష్ కుమార్ కు బీహార్ శాసనసభలో ఉన్న స్థానాలు 116 మాత్రమే. (కనీస ఆధిక్యతకు ఆరు స్థానాలు తక్కువ). ఈ 116 స్థానాలు కూడా గతంలో ఉన్న భాజపా కూటమి దయతో వచ్చినవే కాని స్వంత బలం కాదు. కాబట్టి ఈ ఎన్నికలు ఒక్క నితిష్ కుమార్ కే కాదు, అతడి లాంటి ఎంతోమంది అంగుష్ఠమాత్రులకు ఒక గుణపాఠం. ఏది ఏమైనా భారతదేశానికి శుక్రమహర్దశ మొదలైంది. సంతోషం.  
 
మాటలో మాట.... భారతదేశ ప్రధానమంత్రిగా పూర్తి మెజారిటీతో ప్రమాణస్వీకారం చేసిన శ్రీ నరేంద్రమోదీ గారికి శుభాభినందనలు.
 
- ధర్మపాలుడు