ఆత్మీయత పంచుదాం..

సంక్రాంతి పిలుపు - ప్రత్యేక వ్యాసం


దేశంలో ఎన్నో సంస్థలు ఉండవచ్చు. ప్రజలను సమీకరించే పనిని చాలామంది చేస్తూ ఉండవచ్చు. కాని ఈ పనిలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్వహిస్తున్నది ఒక విశిష్ట పాత్ర. 1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రారంభించబడింది. కొన్ని సంవత్సరాల వరకు సంఘ్ కార్యకలాపాలు నాగపూర్ కే పరిమితమై ఉండేవి. క్రమంగా పుణే నగరానికి, నాగపూర్ సమీప పట్టణాలకు విస్తరించి, ఆ తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించడానికి 15-16 సంవత్సరాలకు పైగానే సమయం అవసరమైంది.

సంఘం నాగపూర్ కే పరిమితమై ఉన్న రోజుల్లో కాని, దేశమంతటికి విస్తరించిన తర్వాత కాని సంఘ కార్యకర్తలందరిలో ఒక విషయంలో మాత్రం స్పష్టత ఉంది. తాము సంఘటితం చేస్తున్నదీ, చేయ యత్నిస్తున్నదీ యావత్తు సమాజాన్ని. సమాజంలో ఒక సంఘటననో, సంస్థనో నిర్మించే పని తాము చేయటం లేదు. ఈ కారణం చేతనే సమాజంలోని వివిధ వర్గాలవారందరూ (వృత్తులు, కులాలు, ఆరాధనా విధానాలు, వయస్సులు, భాషలు - ఇలా ఎన్ని రకాల వైవిధ్యం కలిగిన వారైనా) తమవారేనన్న స్పృహ చాలా స్పష్టంగా ఉంది.

అసలు సమాజం అంటే ఏమిటి? అన్న కల్పనలోనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విశిష్టమైన రీతిలో స్పష్టతను కలిగి ఉంది. పాశ్చాత్యుల దృష్టిలో సమాజం క్లబ్బు అయి ఉండవచ్చు. జీవన పరిణామ శాస్త్రవేత్తల దృష్టిలో సమాజం మొదట్లో ఒక గుంపు మాత్రమేనని, అందులో బలవంతులు పైచేయి సాధించి, మిగిలినవారిని తమ అదుపులోకి తెచ్చుకొని, వారు తమ ఆదేశాలను పాటించేటట్లుగా చేసుకున్నారనీ వివరించవచ్చు. తమ తమ స్వార్థపూర్తి కోసమో, పరస్పర సహకారం అనివార్యమని గ్రహించిన కారణంగానో వారు కలసి జీవిస్తూ ఉన్నారని మరికొందరు చెప్పవచ్చు. కాని మన హిందూదేశంలో సమాజం ఒక విరాట్ పురుషుని సాకార రూపం. సమాజంలోని వివిధ వ్యక్తులు ఆ విరాట్పురుషుని దేహంలోని వివిధ అవయవాలు, జీవకణాలు.

శరీరంలోని జీవకణాలు, అవయవాలూ శరీరంతో కలసి ఉన్నంతవరకే పని చేయగల్గుతాయి. తమ ప్రజ్ఞను ప్రదర్శించగల్గుతాయి. శరీరం నుండి విడిపోతే, అతి స్వల్ప వ్యవధిలోనే అవి పనికిమాలినవి అవుతాయి. విడిగా ఉంటే ఏ అవయవానికైనా సరే మనుగడ ఉండదు. శరీరంతో కలసి ఉండాలి. అన్ని అవయవాలలోనూ, జీవకణాలలోనూ ప్రాణశక్తి సంచరిస్తూ ఉండాలి. ప్రాణశక్తి సక్రమంగా సంచరించేట్లుగా చూసుకొనే ప్రయత్నాన్నే 'సంఘటన' (సమ్యక్ ఘటన - సముచితమైన కూర్పు) అంటున్నాము.

సంఘ కార్యకర్తల మన:స్థితి, ఏవైనా సందేహాలు పొడసూపినప్పుడు వారికి లభించే మార్గదర్శనమూ ఎలా ఉంటాయో - ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవటం ద్వారా మనం స్పష్టంగా గ్రహించవచ్చు. 1985 వ సంవత్సరం మే నెలలో నాగపూర్ లో సంఘ శిక్షావర్గ జరుగుతూ ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలవారు వచ్చి శిక్షణ పొందుతున్నారు. జ్యేష్ఠ ప్రచారకులైన దత్తోపంత్ ఠెంగ్డీ స్వయంసేవకుల సందేహాలను నివృత్తి చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గుజరాత్ లోను, మరికొన్ని ప్రాంతాలలోను రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగుతూ ఉంది. ఒక శిక్షార్థి స్వయంసేవక్ తన సందేహాన్ని ఇలా వ్యక్తపరిచాడు. "ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఉద్యోగాలు లభించటం లేదు. కొందరు షెడ్యూల్డు కులాలలోనో, షెడ్యూల్డ్ తెగలలోనో జన్మించినందున తక్కువ మార్కులు వచ్చినా, వారికి ఉద్యోగాలు లభిస్తున్నవి. ఈ విధానం వల్ల సామర్థ్యం లేనివారు లాభపడుతూండగా, ఎంతో శ్రమించి, ధనాన్ని ఖర్చు చేసి చదువుకున్న వారు నష్టపోవటం లేదా? కాబట్టి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని మనం సమర్థించటం అవసరం కాదా? ఈ ప్రశ్న అడిగే సమయంలో అతడు ఎంతో ఆవేశాన్ని వ్యక్తపరిచాడు.

వాతావరణం చాలా గంభీరంగా ఉంది. కొందరు ప్రక్కవారితో గుసగుసలాడుతూ - దత్తోపంత్ జీ క్లిష్టమైన ఈ ప్రశ్నకు ఏమని చెపుతారో అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. "సంఘం యావత్తు హిందూ సమాజాన్ని ఒకే కుటుంబంగా భావిస్తుంది. కుటుంబంలో వికలాంగులు గాని, పనిలో సామర్థ్యం తక్కువ ఉన్నవారు గానీ, వయోవృద్ధులు గాని ఉంటే వారి మానాన వారిని వదలివేయము. వారిపట్ల మరింత శ్రద్ధ వహించి, వారి అవసరాలు పూర్తయ్యేటట్లుగా చూస్తాం గదా! ఈ విషయంలోనూ ఇదే దృష్టితో చూడాలి". చీమ చిటుక్కుమన్నా, స్పష్టంగా వినిపించేటంతగా నిశ్శబ్దంగా ఉంది. దత్తోపంత్ జీ తన మాటను కొనసాగించారు - "రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన బాబాసాహెబ్ అంబేడ్కరే వాటిని ఊతకఱ్ఱలుగా వర్ణించి చెప్పారు. నడవలేని వారు నడవడానికి ఊతకఱ్ఱలు ఉపయోగపడగలవు. పరుగెత్తే సమయంలో ఊతకఱ్ఱలు అవరోధాలవుతాయి. కాబట్టి పరుగెత్తే సమయంలో వాటిని దూరంగా విసరివేయవలసిందే. కాబట్టి రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండిపోతాయనే భయం అవసరం లేదు". యావత్తు హిందూ సమాజం ఒకే కుటుంబం అనే భావన ఒక ప్రాతిపదికగా అందరి మనస్సులలోనూ స్పష్టంగా ఉన్నందున, తాత్కాలిక పరిణామాలతో విచలితమై ఆందోళనకు గురియైన వారందరికీ సమాధానం లభించింది. ఆ పైన మళ్ళీ మళ్ళీ ఉప ప్రశ్నలు వేయవలసిన అవసరం లేకపోయింది.

ఏటేటా సంఘం నిర్వహించే ఉత్సవాలలో మకర సంక్రాంతి ఒకటి. సూర్యగమనంలో మార్పులననుసరించి ప్రకృతిలో క్రాంతి సంభవిస్తుంది. చీకటి ఎక్కువగా ఉండే రోజులు వెనుకబడతాయి. పగలు ఎక్కువగా ఉండే దిశగా ప్రకృతి పరోగమిస్తుంది. చలి, బద్ధకమూ తొలగిపోయి చురుకుదనం వైపుగా మానవజీవితం సాగిపోవాలని సంకేతమిస్తుంది. ఇదే సమయంలో సంకుచితంగా ముడుచుకుపోయే గుణాన్ని వదిలించుకొని, చేతులు చాచి, మన సోదర ప్రజానీకాన్ని పరిష్వంగంలోకి తీసుకోవాలని, ఆత్మీయ భావనలు, స్నేహవారధులూ పెంచుకోవాలని సూచిస్తూ - బెల్లము, నువ్వులూ కలసి తయారుచేసే ప్రసాదాన్ని సంక్రాంతి సందర్భంగా పంచుకొని తింటాం.

సమాజంలో సామరస్యాన్ని పెంచే ఈ పండుగను హృదయపూర్వకంగా స్వాగతిద్దాం. ఆ పండుగ ఇచ్చే సందేశాన్ని మన హృదయంలో ఆవిష్కరించుకుందాం. హృదయంలోని భావన మన జీవితాలలో అడుగడుగునా వ్యక్తమయ్యే విధంగా శ్రద్ధ వహిద్దాం.

సంగచ్ఛధ్వం - సంవోమనాంసి జానతామ్

కలసి ఉంటు, కలసి తింటు, కలసి మెలసి అడుగులేస్తు
పౌరుషమును పెంచుకొంటు ప్రగతిని సాధించుదాం
అవినీతి, కులతత్వం, అంటరానితనం త్రుంచి
అన్నదమ్ములందరికీ ఆత్మీయత పంచుదాం..
 

- డా.వడ్డి విజయసారథి
జాగృతి వారపత్రిక సంపాదకులు