మతం మారితే రిజర్వేషన్ ఉండదు

మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు 


ఒక మతంలో వెనుకబడిన లేదా అత్యంత వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి మతం మారితే అతనికి పాత మతంలోని కులం వర్తించదని మద్రాసు ఉన్న న్యాయస్థానం స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతికి చెందిన మహిళ మతం మారి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొని 'ఇస్లాం' స్వీకరించింది. తరువాత తనకు వెనుకబడిన కులం ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలని మద్రాసు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ దావాపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణ్యన్ పై విధంగా సంచలన తీర్పునిచ్చారు. 

"ఒక వ్యక్తికి వెనుకబడిన కులం అనేది పుట్టుకతో వస్తుందే తప్ప, అది సామాజిక హోదా కాదు, మతం మారడం ద్వారా అంతకుముందున్న కులముద్ర నుండి సదరు వ్యక్తి విముక్తుడౌతాడు' అని న్యాయమూర్తి తెలిపారు. అలాగే ఒక మతంలో అగ్రకులంలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ఇస్లాంలోకి మారి, తనకూ వెనుకబడిన తరగతుల జాబితాలో అవకాశాలు ఇవ్వాలంటే కుదరదని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. "దీనికి అనుమతిస్తే 'వెనుకబడిన తరగతులు' అన్న విధానానికే అర్థం ఉండదు" అని తెలిపారు. "ఒక హిందువు కులభావన లేని క్రైస్తవంలోకో, మరొక మతంలోనికో మారి తనకు పాత మతంలోని 'కులం' కొనసాగాలని కోరలేడు" అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా ఉటంకించారు. అలాగే మతం మారిన వారికి కులం లేదని 1952లోనే మద్రాసు హైకోర్టు ధర్మాసనం పేర్కొన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.  

- సేకరణ - పతికి