మన రాజ్యాంగాన్ని సమీక్ష చేయడం అవసరమా?


కలియుగాబ్ది 5115 , శ్రీ విజయ నామ సంవత్సరం, 
  పుష్య మాసం
 

వచ్చే జనవరి 26కి మనదైన రాజ్యాంగము తయారు చేసుకొని అమలు చేయడం ప్రాంభించి 64సంవత్సరాలు నిండి 65వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ 64 సంవత్సరాలలో ఒకప్రక్క దేశం ఎంతో ప్రగతి సాధించింది. మరోప్రక్క ఎన్నో క్లిష్ట సమస్యల గుండా ప్రయాణించింది. మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కాపాడుకోవడం కోసం 1200 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన జాతి మనది. మన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు భంగం కలిగించిన మన ప్రధాని ఇందిరాగాంధీని, కాంగ్రెసు పార్టీని 1977 ఎన్నికలలో చిత్తుగా ఓడించారు మన దేశ ప్రజలు. అటువంటి విచక్షణా జ్ఞానం ఉన్నవారు.

స్వాతంత్ర్యం సంపాదించుకొన్న రెండున్నర సంవత్సరాలకే మన రాజ్యాంగం మనం తయారుచేసుకుని అమలు చేసుకోవడం ప్రారంభించాం. 64 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ సమయంలో ఉన్న దేశ పరిస్థితులలో, ప్రపంచ పరిస్థితులలో ఎంతో మార్పు వచ్చింది. దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో ఎంతో మార్పు వచ్చింది. కాని ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ మనం అనే భావన ఏ మేరకు వికసించింది ఆలోచించాలి. ఇప్పటికి ప్రాంతీయ భావాలే బలంగా ఉన్నాయి. జాతీయ జీవనంలో వందల సంవత్సరాలు వివక్షకు గురియైన వారిని మిగతా సమాజంతోపాటు ఎదిగేలా చేయటానికి ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఇప్పుడు ఎలా హైజాక్ చేయబడుతున్నాయి గమనిస్తే బాధ కలుగుతుంది. రిజర్వేషన్ సౌకర్యాలు మాకూ కావాలనే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం, మతం మారిన వారుకూడా మాకూ రిజర్వేషన్ సౌకర్యాలు కావాలనేవారు విశేషంగా కనబడుతున్నారు. ఈ కాలంలో సైద్ధాంతిక హింసా ఉగ్రవాదాలు పెరిగిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు సాధారణ నేర చట్టాలనే పరిగణనలోకి తీసుకోవటంతో హింస చేస్తూనే చట్టం నుండి రక్షణ కూడా పొందటం ఎంతో శోచనీయం. దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి కోసమా? పాలన కోసమా? రాష్ట్ర ప్రభుత్వాలు-కేంద్రం మధ్య సరియైన సయోధ్య లేకపోవడంతో కొన్ని సమస్యలు జటిలంగా మారుతున్నాయి. అంతర్జాతీయ సంబంధాలు ఎట్లా ఉన్నాయి. వేల సంవత్సరాల నుండి సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగా సంబంధం ఉన్న కొన్ని ప్రదేశాలు ఇప్పుడు స్వతంత్ర దేశాలయినాయి. ఆ దేశాలతో మన సంబంధాలు సరిగా ఉండటం లేదు. Look East అనే విధానాన్ని స్వీకరించినా మన పాలకుల దృష్టి అమెరికా పైనే ఉన్నది. ఇట్లా చెప్పుకొంటూ పోతే అనేక విషయాలలో 64  ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశకాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ సమీక్ష చేయడం ఎంతో అవసరం. ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగేందుకు దేశంలోని అన్ని జాతీయ శక్తులను సమన్వయపరచడం నేటి అవసరం.