అంబేడ్కర్ కు ఉన్నత ఉద్యోగం లభించి ఉండేది..!

 
బాబాసాహెబ్ భీమ్ రావు అంబేడ్కర్ మన రాజ్యాంగ నిర్మాత. వారి జీవితమంతా దేశ సమగ్రత, షెడ్యూల్డు కులాల సంక్షేమం కోసమే సాగింది.

ఆయనకు రాజనీతి తెలుసు. స్వతంత్రంగా షెడ్యూల్డు కాస్ట్ ఫెడరేషన్ వంటి సంస్థలు నెలకొల్పాడు. హిందూ సమాజంలో అంటరానితనం వంటి దురాచారాలను ఆయన నిరసించాడు. మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్న అప్పటి హిందూ సమాజానికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు బౌద్ధమతం స్వీకరించాడు. కాని ఇస్లాం, క్రైస్తవ మతాల జోలికి పోలేదు. ఆయన్ను ఆయా మతాధిపతులు ఎంతో ప్రలోభపెట్టారు. అయినప్పటికీ హిందూ ధర్మంలో భాగమైన బౌద్ధాన్ని స్వీకరించారు. ఆయన కర్మభూమి మహారాష్ట్ర ప్రాంతం. 1935 వరకు హిందువుల వేదాంతాన్ని వారికే వివరించే ప్రయత్నం చేశారు. రాజకీయంగా, సామాజికంగా అవహేళనకు గురియైనారు.
అజ్ఞానంతో, దు:ఖంతో పీడింపబడుతున్న, అవమానింప బడుతున్న సమాజంలోని పీడిత తాడిత వర్గం ఆత్మగౌరవంతో జీవించేందుకు ఉద్యమించారు.

ఆయన ధార్మిక కుటుంబంలో జన్మించారు. తాత మాలోజీరావు రామనంద భక్తిమార్గంలో దీక్ష తీసుకున్నాడు. అంబేడ్కర్ తండ్రి రామ్ జీ కబీర్ భక్తిమార్గంలో దీక్ష తీసుకున్నాడు. పెదనాన్న సన్యాసమార్గం స్వీకరించాడు.

అంబేడ్కర్ చిన్నతనంలోనే తల్లి గతించింది. తండ్రి పిల్లవాని చదువు విషయంలో అత్యంత శ్రద్ధ వహించాడు. అంబేడ్కర్ సతారాలో పాఠశాల విద్యనభ్యసించాడు. బాల్యంలోనే అస్పృశ్యుడని చెప్పి తరగతి గదిలో వేరుగా కూర్చుండబెట్టేవారు. నీటి కుళాయి వద్దకు వెళ్లి నీళ్ళు త్రాగనిచ్చేవారు కాదు. ఇన్ని కష్టాలతో పాఠశాల విద్యను పూర్తి చేశాడు అంబేడ్కర్. అనంతరం ముంబైలో బి.ఎ. చదివాడు. బరోడా సంస్థానంలో చేరి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి విద్యాభ్యాసానికి వెళ్ళాడు. తరువాత ఎమ్.ఎ., పి.హెచ్.డి. పూర్తి చేశాడు. ఆపై లండన్ వెళ్లి ఎమ్.ఎస్.సి., బారిస్టర్ పట్టాలను సాధించాడు. అంబేడ్కర్ పట్టుదలతో, పరిశ్రమతో వాటిని సాధించారు.
చదువుకున్న తరువాత ఆయన తన జ్ఞానశక్తిని తమ కుటుంబానికి, కులానికి ఉపయోగించదలచలేదు. సంపూర్ణ అస్పృశ్య సమాజం కొరకు వెచ్చించాడు. వారిని చైతన్యవంతుల్ని చేశారు. ఆయన ఆర్థిక, రాజనీతి, సామాజిక, న్యాయశాస్త్రాలలో దిట్ట. అనేక పుస్తకాలు రాశారు. 'కుల నిర్మూలన', 'థాట్స్ ఆఫ్ పాకిస్తాన్', 'శూద్రులెవరు' వంటి పుస్తకాలు రాశారు. ముంబైలోని వారి స్వగృహం 'రాజగృహ'లో గల పుస్తకాలయం ఆయనకున్న గొప్ప ఆస్తి. తన భావ ప్రచారం కొరకు 'మూకనాయక', 'బహిష్కృత భారత్', 'విద్యా విలాస్' వంటి పత్రికలు నిర్వహించారు. అంబేడ్కర్ మంచి వక్త కూడా.

అమెరికాలోని 'సమానత్వం' ఆయన్ను ప్రభావితుణ్ణి చేసింది. 1924లో బహిష్కృత హితకారిణీ సభను ప్రారంభించారు. హిందూ ధర్మం మీద ఆయనకు కోపం లేదు. హిందూ సమాజం మారాలని ఆయన కోరుకున్నారు. అందుకే క్రైస్తవం లేదా ఇస్లాం సిద్ధాంతాల కన్నా హిందూ ధర్మ సిద్ధాంతాలు ఎన్నో రెట్లు సమానత్వానికి పోషకంగా ఉన్నాయని ఆయన చాటిచెప్పారు. పెద్ద చిన్న భేదాలను కల్పించడం దీనిలో అసంభవం, అన్నీ ఈశ్వర రూపాలే అన్నారు.

1928లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక అంబేడ్కర్ వ్రాసిన ఓ వ్యాసం ప్రచురించింది. అందులో జాతీయ భాష 'సంస్కృతం' కావాలి అన్నారాయన. ఆ రోజుల్లో అంబేడ్కర్ కోరుకుని ఉంటే బ్రిటిష్ పాలకులు ఆయనకు ఉన్నత పదవులే ఇచ్చేవారు. కాని పెద్ద ఉద్యోగం కోసం ఆశించలేదు. నిమ్నవర్గాల ఉన్నతికై ఉద్యమించారు.

 
 
1949 నవంబర్ 25వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగపు ప్రతిని ఆమోదిస్తూ జరిగిన చర్చలో 'దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే స్వాతంత్ర్యం నిలబడుతుందని' హెచ్చరించారు. ఆయన నిర్వహించిన మహాద్ సత్యాగ్రహం, కాలారామ్ మందిర ప్రవేశ సత్యాగ్రహం, పార్వతీ మందిర సత్యాగ్రహం వంటివి ఆ రోజుల్లో మహా సాహసాలు.  అస్పృశ్యతా నివారణలో మైలురాళ్లు. భారత రాజ్యాంగ నిర్మాణంలో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. చట్టసభల్లో జనసంఖ్య నిష్పత్తిలో అస్పృశ్య వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలని, కాలాంతరంలో ఇది క్రమంగా తొలగిపోవాలని, రాజకీయాలు ఈ విషయంతో ప్రభావితం కాకూడదని ఆయన అభిలషించారు.

చట్టం దృష్టిలో అందరూ సమానమని ఆయన వాదించారు. ఆయన్ను సరిగా అర్థం చేసుకోవడంలోనే 'సామాజిక సమరసత' నిర్మాణం సుసాధ్యమవుతుంది.
 
- హనుమత్ ప్రసాద్