తెలంగాణ తొలి ప్రభుత్వ పయనమెటు?

 
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వంలోని ప్రతినిధుల వ్యవహార శైలి గందరగోళంగా తయారైంది. ఎన్నో ఆశలతో ఏర్పాటైన కొత్త రాష్ట్రంలో ఆదిలోనే చోటు చేసుకుంటున్న పరిణామాలు మేధావులను, సామాన్య ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి.

తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ పార్టీగా తనదైన ముద్రను వేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమీక్షలు, నిర్ణయాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ వివాదాలను తట్టి లేపుతున్నట్లు కనిపిస్తోంది.

ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పలు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. పనిలో పనిగా క్రిస్టియన్లకూ 3 శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పించేలా కృషి చేస్తామని కొత్త హామీ ఇచ్చారు. 
 
 
కొంతకాలంగా అధికారంలోకి వస్తున్న నేతలు మెజార్టీ వర్గీయుల సంక్షేమం కంటే మైనార్టీలను ఆకట్టుకునే చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మైనార్టీల ప్రగతికి పాటుపడటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ అదేపనిగా సాధ్యం కాని ప్రయత్నాలు చేయడమే అభ్యంతరాలకు కారణమవుతున్నాయి. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తానంటూ మాటిచ్చేశారు. దానిమీద కసరత్తు కూడా చేశారు. అయితే, న్యాయస్థానం ఆ ప్రతిపాదనపై మొట్టికాయ వేసి, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సరికాదని తేల్చి చెప్పింది. అయినా మరోసారి కె.సి.ఆర్. ముస్లింలకు,క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పిస్తానంటూ హామీలిస్తున్నారు.  మైనార్టీల మెప్పు పొందేందుకు రిజర్వేషన్లు మినహా మరో అవకాశం లేదా అన్న పశ్న ఉదయిస్తోంది. అసలు ప్రభుత్వం ఆలోచిస్తున్న ఈ తీరు సరైంది కాదు.

మైనార్టీలకు మేలు చేయాలంటే రిజర్వేషన్లు ఒక్కటే వాహకం కాదు. వారి సంక్షేమం కోసం మిగతా ఎన్నో రకాలుగా పాటుపడే అవకాశం ఉంది. మనసుంటే మార్గం ఉంటుందన్నట్లు వేరే మార్గాల్లో మైనార్టీ వర్గాల ఉన్నతికి, వారిలో జీవన ప్రమాణాల పెంపునకు శ్రమించవచ్చు. ఇక తెలంగాణ చరిత్రను తిరగేస్తే ఎవరి కారణంగా ఇక్కడి ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారో, ఇబ్బందులు పడ్డారో తెలుస్తుంది. వాటిని నెమరేసుకుంటే రిజర్వేషన్ల నిర్ణయం సమీక్షించుకునే పరిస్థితి వస్తుంది. 
 
తెరాస నేత, నిజామాబాద్ ఎం.పి., కె.సి.ఆర్. కుమార్తె కవిత
 
ఇక ఈ టి.ఆర్.ఎస్. నేతల ప్రసంగాలు ప్రజలను భయపెట్టేలా, ఆలోచింపచేసేలా ఉంటున్నాయి. అసలు మనం భారత పౌరులమే కాదని సాక్షాత్తూ తెలంగాన ప్రభుత్వంలో కొనసాగుతున్న ఓ మంత్రి అన్న వ్యాఖ్యలు బాధపెట్టక మానవు. అలాగే తెలంగాణ అనేది రాష్ట్రం కాదు - ఇదొక ప్రత్యేక దేశం అని కె.సి.ఆర్. కుమార్తె, టి.ఆర్.ఎస్. ఎంపి కవిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలను గమనిస్తే అవి యాదృచ్ఛికమా, ముందస్తు వ్యూహమా లేక ప్రజలను గందరగోళంలో పడేయడమే లక్ష్యమా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో తమకోసం పోరాడిన ఉద్యమపార్టీ అధికారంలోకి రావాలని మన:స్ఫూర్తిగా టీ.ఆర్.ఎస్.కు పట్టం కట్టారు. కాని ప్రజల అభీష్టాల మేరకు నడుచుకుంటున్నామా? ఏదైనా సిద్ధాంతాల ప్రభావం ఉన్నదా? మెజార్టీ ప్రజల మెప్పుకోరే కార్యకలాపాలే నిర్వహిస్తున్నామా? అన్న అంశాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.

- హంసినీ సహస్ర