ప్రపంచ మానవాళికి రాముడు, రామాయణం ఏనాటికైనా ఆదర్శం

శ్రీరామనవమి ప్రత్యేక వ్యాసం 


స్వాతంత్ర్య పోరాట కాలంలో సామాన్య ప్రజలను సంసిద్ధం చేసేందుకు మహాత్మాగాంధీజీ రామరాజ్యం నిర్మాణం చేసేందుకు మనందరం ఉద్యమిద్దాం అని పిలుపునిచ్చారు. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యమంటే ధర్మరాజ్యం. అంటే ధర్మం ఆధారంగా పాలించబడే రాజ్యం. రాముడు సాక్షాత్తూ ధర్మదేవత ప్రతిస్వరూపం. రామరాజ్యంలో ప్రతివ్యక్తి తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించేవాడట. ఎవరికీ అన్యాయం జరిగేది కాదట. రాజు ఒక్కడే కర్తవ్యనిష్ఠాపరుడైనంత మత్రాన పాలన సరిగా సాగదు. రాజు, ప్రజలు ఇరువులు ఒకరిపట్ల ఒకరు అవగాహనతో తమ కర్తవ్యాలను సరిగ్గా నిర్వహించాలి. ఒకరి కష్ట సుఖాలు, ఉన్నతి, ఔన్నత్యం ఇంకొకరిమీద ఆధారపడి ఉంటుంది. పరాయి దేశస్తుల సంస్కృతీ ప్రభావం మన ప్రజలపై పడితే నెమ్మది నెమ్మదిగా మన ఉనికి సమాప్తమవుతుంది. మన సంస్కృతి, సంస్కారాల పట్ల గౌరవాభిమానాలు పోతే దేశం తీవ్రంగా నష్టపోతుందనే విషయం కూడా రాముడికి బాగా తెలుసు. కాబట్టి రామరాజ్యంలో రాజు, ప్రజలు అందరూ తమ కర్తవ్యాలను నిర్వర్తించడంతో పాటు మన సంస్కృతి, ధర్మ పరిరక్షణకు కటిబద్ధులుగా ఉన్నారు కాబట్టే అది రామరాజ్యమైంది. ఈ రోజున మనదేశంలో పరిస్థితులు చూస్తుంటే విదేశీ సంస్కృతీ ప్రభావం, వ్యామోహం ఈ దేశ ప్రజలలో ఎంతగా వ్యాపించిందీ, అది ఈ దేశానికి ఎంత నష్టం కలిగిస్తున్నదనే విషయాన్ని గ్రహించలేక పోతున్నారు. ఆ నష్టాన్ని ఈ రోజున దేశం అనుభవిస్తున్నది. పాలకులే ధర్మనిష్ఠను వదిలిపెడితే ప్రజలు విశృంఖలంగా వ్యవహరిస్తారనేది మన చరిత్ర చెబుతున్న తిరుగులేని సాక్ష్యం. ఈ రోజున దేశంలో ఉన్న రాజకీయ, సామాజిక, ధార్మిక పరిస్థితులన్నీ కూడా ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. అందుకే రామాయణము, రాముడి జీవితాన్ని పదేపదే మననం చేసినప్పుడు మనం మన కర్తవ్యము, మన సంస్కృతి, మన సామాజిక జీవనములోని ఆదర్శాలు మనకు అర్థమవుతాయి. అందుకే రాముడితో పాటు అయోధ్య వచ్చిన విభీషణుడు, సుగ్రీవుడు, అంగదుడు మొదలైన పరివారము అయోధ్యలోనే ఉండిపోతామని అంటే రాముడు లక్ష్మణునితో ''లక్ష్మణా! నీకు రాజనీతి తెలిసినట్లు లేదు. వారి జీవన విధానం, మన జీవన విధానం, సంస్కృతి కూడా ఒకటి కాదు. వారితోసహవాసం చేయటం వలన అయోధ్యవాసులు వారి సంస్కృతి పట్ల ఆకర్షితులవడం మనకు, వారికి మంచిది కాదు. కాబట్టి వారిని సకల లాంఛనాలతో, మర్యాదలతో తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయి'' అని ఆదేశించాడు. అదీ రాముడి విజ్ఞత. అందుకు రాముడు అడుగడుగునా మన జీవితాలకు ఆదర్శ పురుషుడయ్యాడు, రామరాజ్యం ఆదర్శ రాజ్యమైంది.

- మల్లిక్