విజయవంతమైన ప్రపంచ యోగా దినోత్సవం 
యోగా...  యోగా...!  ఎగురుతున్న విమానంలో యోగా...! నడి సంద్రంలో... ఓడపై యోగా....! నీళ్లలో యోగా...! గాల్లో యోగా..! సియాచిన్ మంచు పర్వతాల్లో యోగా..! రోడ్డుపై యోగా..! పార్కులో యోగా..! స్కూళ్లల్లో యోగా..! ఆఫీసుల్లో యోగా...! అవును... జూన్ 21 మొత్తం ప్రపంచమే యోగా ముద్రలోకి వెళ్లిపోయింది...! శరీరం... బుద్ధి, మనస్సు... మూడింటిపైనే మానవుడి ఆరోగ్యం ఆధారపడివుంటుంది. మానవుడు శక్తి ఆరాధకుడు. దేహంలో శక్తి కోసం వ్యాయామం చేస్తాడు. అదే సమయంలో మానసిక చైతన్యం కోసం ఆధ్యాత్మిక సాధన కూడా అవసరం. విశ్వమానవ శ్రేయస్సు కోసం మన రుషులు.. ఆదర్శప్రాయమైన జీవన సూత్రాలను యోగ విద్యలో పొందుపర్చారు..! అభ్యాస వైరాగ్యాతో శారీరక, చిత్తవృత్తుల్ని అదుపులో ఉంచడం యోగసాధనలో ప్రధాన భూమిక. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత యోగా విద్యకు దాసోహమంటున్నది...!
యోగ విద్య... ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుత కానుక...! సకల ప్రాణులకు హితం చేయడమనే ఉత్కృష్ట స్థితికి యోగ విద్య దారి చూపుతుంది. మనిషి వ్యక్తిగత జీవనం నుంచి సమష్టి జీవన తత్వాన్ని దర్శింప జేస్తుంది. విశ్వ శ్రేయస్సును ఆకాంక్షిస్తుంది. ప్రపంచం  అంతా...  ఒకటే..! వసుధైక కుటుంబమనే భావనను వ్యక్త పరుస్తుంది..! ప్రపంచమంతా మొట్టమొదటి వరల్డ్ యోగా డేను ఘనంగా జరుపుకుంది.
దేశ రాజధానిలో రాజపథ్లో జరిగిన యోగా కార్యక్రమం ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించింది. దాదాపు 40 వేలమంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా యోగాసనాలు వేశారు. యోగా గురు రాందేవ్ బాబాతోపాటు మత పెద్దలు, త్రివిధ దళాధిపతులు, వివిధ దేశా దౌత్యాధికారులు పాల్గొన్నారు. అటు ఢల్లీలో నిర్వహించిన యోగా సదస్సులో రూ. 5 విలువ చేసే తపాలా బిళ్లను రూ. 5, రూ. 10 నాణేలను ప్రధాని మోడీ విడుద చేశారు. దేశ వ్యాప్తంగా జరిగిన యోగా కార్యక్రమంలో కేంద్రమంత్రులు భాగస్వాములయ్యారు. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్లో కూడా భారత సైనికులు యోగా సాధన చేశారు.
అటు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన యోగాడేలో సమితి ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా 191  దేశాల్లో   యోగా   దినోత్సవాన్ని నిర్వహించాయి.  అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 251 పెద్ద నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అందరూ సామూహికంగా యోగాసనాలు వేశారు. అమెరికాలోని ప్రసిద్ధ టైమ్ స్క్వేర్ యోగా స్క్వేర్గా మారిపోయింది. ఇక్కడ వేలాది మంది యోగాసనాలు సాధన  చేశారు.  అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్లీ కూడా యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 150 కోట్ల మంది ఉత్సవాల్లో పాల్గొన్నారని అంచనా..! ప్రపంచంలోని 42 ముస్లిం దేశాలోను, పాకిస్థాన్లో భారత్ అంబాసిడర్లో కూడా యోగా కార్యక్రమం జరిగింది.
మొత్తానికి యోగా గురు రాందేవ్ బాబా సంకల్పం..., ప్రధాని నరేంద్రమోడీ కార్యదక్షతతో భారతీయ యోగా విశ్వవ్యాప్తమైంది. యోగా దినోత్సవం విజయవంతం కావడంతో...భారత్ విశ్వగురు ఫీఠాన్ని అధిష్ఠించే  రోజు దగ్గరల్లోనే ఉన్నాయని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.