త్రిగుణాత్మక స్వరూపమే`స్త్రీమూర్తియువతీ మేలుకో...

యాదేవీ సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:
ప్రతీప్రాణికోటి యందు శక్తి స్వరూపిణిగా వెలుగొందే జగన్మాతకు నేను నమస్కరించు చున్నాననిపై శ్లోకభావము. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రాణికోటి సమస్తం ఉండాలంటే ఒక మాతృమూర్తి ఉండాలి. మాతే జగజ్జనని, ఆదిపరాశక్తి, మాతృశబ్దం ఎంత గొప్పదో అంత బాధ్యతాయుతమైనది. తల్లి పిల్లలను కనడమే కాకుండా పోషణ కూడా చేస్తుంది. అందుకే మాతృదేవోభవ అని వేదాలు మాతృస్థానానికి పెద్దపీట వేశాయి.
ప్రపంచానికి మూలమైన పరమాత్మను తెలియ జేసే శబ్దం ప్రణవం. దీనిలోని అకార, ఉకార, మకార అక్షరాలే అమ్మగా మారాయి. అకార శబ్దం ద్వారా నోరు తెరుచుకుంటుంది, మకార శబ్దం ద్వారా నోరు మూసుకుంటుంది. రెండిటి నడుమ ఉన్న సంపూర్ణమైన స్థితే అమ్మ. అందుకే అమ్మ శబ్దం సంపూర్ణ శబ్దం. ఓంకారమంత విలువైన మంత్రం అమ్మ. దేవీ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు. ప్రకృతీ స్త్రీ స్వరూపం. ప్ర అంటే సత్యగుణం, కృ అంటే రజోగుణం, తి అంటే తమోగుణం మూడు గుణాలు కలిసి త్రిగుణాత్మకమైనదే ఆదిశక్తి. మూడు గుణాలు, ప్రతీ మహిళలో ఉన్నందువలనే స్త్రీని శక్తి స్వరూపిణిగా పూజిస్తున్నాం.
దేవీ నవరాత్రులో శక్తి పూజ ప్రధానమైనది. తొమ్మిది రోజులను, సాత్వికం, రాజసం, తామసం అనే మూడు భావనులుగా స్త్రీని ఆరాధించే పద్ధతిని ప్రాచీన హిందూ సంప్రదాయం కల్పించింది. సాత్విక గుణం జ్ఞానానికి ప్రతీక. నేడు ప్రతీ మహిళ జ్ఞానమూర్తిలా వెలుగొందుతోంది. దుష్ఠసంహారం కోసం జగన్మాత కాళీరూపాన్ని దాల్చింది అది తామస గుణానికి ప్రతీక. అలాగే తదకేదైనా కీడు జరుగుతుందని తెలిసనప్పుడు తామస ప్రవృత్తిని చూపించడంలో సైతం వెనుకాడదు మహిళ. అందంలోనూ అణకువలోనూ, ఓర్పులోనూ ఔదార్యంలోనూ తన ఇంటికి తాను మహారాజ్ఝలా వెలుగొందుతోంది. ఇది రాజస గుణానికి ప్రతీక. విధంగా త్రిశక్తి సంహిత మన స్త్రీ మూర్తి. అందుకే అమ్మవారికి ప్రతిరూపమైన స్త్రీని గౌరవించి పూజిద్దాం.

- లతా కమలం