పుష్పగిరి స్వామి శివైక్యం

జగద్గురు శంకరాచార్యలు మహా సంస్థానం శ్రీ పుష్పగిరి పీఠాధిపతి (కడప జిల్లా వలురు మండలం పుష్పగిరి గ్రామంలో ఉన్న పీఠం) శ్రీ మదభినవోద్దండ విద్యానృసింహ భారతీస్వామి ఆదివారం శివైక్యం (బ్రహ్మీభూతులు) చెందారు. 76 ఏళ్ల వయస్సు ఉన్న భారతీస్వామి దాదాపు 60ఏళ్లపాటు పుష్పగిరి పీఠాధిపతిగా కొనసాగారు. రాష్ట్రంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతి భక్తులు కలిసి 2015 జనవరి 25 59 పీఠాధిరోహణ మహోత్సవం  జరిపారు. 1957 ఫిబ్రవరి 4 స్వామి 16 ఏట పుష్పగిరి పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమైన ఒక పీఠానికి ఆరు దశాబ్దాలపాటు అధిపతిగా ఉండటం అరుదైన విషయం. ప్రధాన పీఠమైన కడప జిల్లా పుష్పగిరితోపాటు హైదరాబాద్ పీఠంలోనూ స్వామి ఎక్కువ కాలం గడిపేవారు. గత రెండు నెలలుగా చాతుర్మాస్యదీక్షలో ఉన్న విద్యానృసింహ భారతి హైదరాబాద్ పీఠంలోనే ఉంటున్నారు. గత పదిరోజులుగా జలుబు, దగ్గులాంటి స్వల్ప అనారోగ్య సమస్యలతో స్వామి సతమతం అవుతున్నారు. విద్యానృసింహ భారతి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల భక్తులు ఆయనను ఆదివారం ఉదయమే హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలోనే మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురై భారతీస్వామి శివైక్యం చెందారు. స్వామి పార్థివదేహాన్ని బేగంపేటలోని పుష్పగిరి పీఠానికి తరలించారు. సోమవారం ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుండి కడప జిల్లా వలూరు మండంలోని పుష్పగిరి గ్రామానికి పార్థివదేహాన్ని తీసుకెళ్ళారు. భక్తుల సందర్శనార్థం ఒకరోజు పీఠంలోనే పార్థివ దేహాన్ని ఉంచారు. మంగళవారం ఉదయం 11గంటలకు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ పుష్పగిరి పీఠం ఆవరణలోనే అంతిమ సంస్కారం జరిగింది. విద్యానృసింహభారతీ స్వామి శివైక్యం చెందారని తెలియగానే వేలాది భక్తులు హైదరాబాద్ (బేగంపేట)లోని పుష్పగిరి పీఠానికి చేరుకొని అంతిమ దర్శనం చేసుకున్నారు.