కోటి దివ్వెల కార్తీక దీపం


శ్రావణమాసం లాగానే కార్తీక మాసం కూడా మహిళకు ఎంతో ఇష్టమైన మాసం. నెలరోజులు కూడా పూజలు ఉపవాసాలతో ఇల్లంత సందడిగా ఉంటుంది. శివ కేశవులకుబేధం లేదని చెప్పడమే మాస ప్రాముఖ్యత. అందుకే మాసం అంతా కూడా శివుడిని ఎంతగా ఆరాధిస్తారో విష్ణువుని కూడా అంతే ఆరాధిస్తారు. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి ‘‘కార్తీకమాసం అని పేరు వచ్చింది.
కార్తీక నమో మాస్ణ

దేవం కేశవాత్పరం!

నచవేద సమం శాస్త్రం

తీర్థం గంగాయాస్థమమ్’’
అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే ‘‘కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.’’ అని అర్ధం. దీపావళి తెల్లారి నుంచి నెలరోజుల పాటు నియమనిష్టతో చాలా మంది మగువలు కార్తీక వ్రతాన్ని నిర్వహిస్తారు.
  నెలలో  చెప్పుకోదగిన అంశం నియమిత భోజన నియమాలు. అసలే శరదృతువు. చలికాలం కావడం వల్ల ఎది పడితే దాన్ని తింటే జబ్బుకు గురికాక తప్పదు. అందుకే నెలలో తినవలిసిన, తినకూడని పదార్థాలను  చెప్పారు మన పెద్దలు
మాసంలో చెప్పుకోదగ్గ మరో ప్రధానమైన అంశం దీపారాధన. మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి కుదిరితే నదీ స్నానం లేకుంటే ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి శుచిగా, పొడిబట్టలు ధరించి దీపారాధన చేస్తారు. దీనివల్ల మనసు, శరీరం రెండూ ఉత్తేజంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.  మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటిముంగిట మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలో దీపాలు వదులుతారు. దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగచేస్తాయి. మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి. మాసంలో మగువలంతా తమ ఇళ్ళలో దీపారాధన చేస్తారు.  తాను కాలిపోతున్నా కూడా చుట్టూ ఉన్న చీకట్లను నశింపచేసి, తమ శక్తిమేరకు ప్రాంతాన్నంతటినీ వెలిగిస్తుంది దీపం. అలాగే ఇంటి ఇల్లాలు కూడా నిత్యం తాను అనేక ఒత్తిడితో ఉన్నా, తను ఇబ్బందిపడుతున్నా  కూడా తమ కుటుంబము సమాజము బాగుండాలని  కోరుకుంటూ ఆనందంగా తమ వంతు సహాయాన్ని అందిస్తారు. వారు బాగుపడుతుంటే చూసి ఆనందిస్తారు. ఇల్లాలిని దీపంతో పోల్చడంలో అంతరార్థం ఇదే. ఇంటికి దీపం ఇల్లాలు అన్న నానుడి అందుకే వచ్చింది.