హిందూ
మతమంటే ఏమిటో పాశ్చాత్యులకు, పాశ్చాత్య
విద్యా ప్రభావం ఉన్న ఈనాటి మేధావులకు
అర్థం కాని కొన్ని విషయాలు
ఉన్నాయి. వాటి గురించి 1949 సం॥లో
అరవింద మహర్షి విశ్లేషించారు. వారు చెప్పిన విషయాలను
గమనిద్దాం.
‘అందరూ నమ్మవలసిన సిద్ధాంతంగా
గాని, అట్లా నమ్మకపోతే అధోగతి
తప్పదన్న భావంగాని, ఇతర మతాలనుండి భిన్నమైన
ఏ నియమిత విశ్వాసాలుగాని లేనిది మతమెట్లా అవుతుంది? ఒక మతాధిపతిగాని, మతాన్ని
అమలు జరిపే ధార్మిక యంత్రాంగంగాని,
దేవాలయాలుగాని, సామూహిక ప్రార్థనలుగాని, అందరు ఆచరించవలసిన నిబంధనలుగా
లేనిది మతమెట్లా అవుతుంది? హిందూ పూజారులు కేవలం క్రతువును
నిర్వహించేవారేగాని వారికేవిధమైన అధికారాలు లేవు. పండితులు శాస్త్రానికి
అర్థం చెప్పగలిగే వారేకాని మతానికి సంబంధించిన శాసకులుగా గాని, అధినేతలుగా గాని
కానేకారు. అన్ని విశ్వాసాలనూ చివరకు
నిరీశ్వరవాదాన్ని, అనాత్మవా దాన్ని కూడా అనుమతించి విభిన్నమైన
ఆధ్యాత్మికానుభూతులను ఆమోదించి వివిధ ధార్మికప్రయోగాలను వహించే
హిందూ ధర్మాన్ని మతమెట్లా అనగలం. హిందుత్వం సనాతన ధర్మం.
అరవింద
మహర్షి