చేవ చచ్చిన కూతలు

కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు. సోనియాగాంధీకి నమ్మినబంటు. ఇండియన్ ఫారెన్ సర్వీసు చదివిన ప్రభుద్ధుడు భారత ప్రభుత్వంలో సహ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు.  1989లో ఈయన రాజకీయాల్లో ప్రవేశించారు. తమిళనాడులో మయిలదురై నుంచి 1991,1999,2004లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 1996,1998,2009, 2014 ఎన్నికల్లో ఓడారు. 1978-1982 కాలంలో ఇరాక్‌లో భారత దౌత్యాధికారిగా పనిచేశారు. స్వతహాగా వామపక్షభావాలున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే. పండితుడైన అయ్యర్ నోటి నుంచి వచ్చేవన్నీ పచ్చి బూతులు, అబద్ధాలు మాత్రమే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. మనిషి మాటలోకాని, బాడీ లాంగ్వేజీలోకాని ఎపుడూ వ్యంగం, అవహేళన ధ్వనిస్తుంటుంది. 2009లో అండమాన్ వెళ్ళినపుడు అక్కడ స్యొర్ జైలులో శిక్షననుభవించిన దేశభక్తుడు స్వాతంత్య్రవీర సావర్కర్‌ను ఆయన వేర్పాటువాద నాయకుడు జిన్నాతో పోల్చాడు. అక్కడ సావర్కర్‌ను స్మరిస్తూ పద్యం రాసివున్న ఫలకాన్ని తొలగించి మహాత్మాగాంధీ మాటలున్న ఫలకాన్నుంచమని ఆయన ఆదేశించారు. దీనిపై పార్లమెంటులో రభస జరిగింది. మహారాష్ట్రలో శివసేన ఘర్షణకు దిగింది. తన వ్యాఖ్య ద్వార ఒక అయోమయం, ఒక రభస సృష్టించడమంటే మణిశంకర్ అయ్యర్‌కు భలేసరదా! ఇంకో సందర్భంలో గోమాంసం తింటే తప్పేమిటి? అని కూడా ఆయన  వ్యాఖ్యానించాడు. తాజాగా ఆయన పాకిస్తాన్లో విలేఖరులతో మాట్లాడుతూ పాకిస్తాన్‌తో చర్చల పునరుద్ధరణపై మోడీ సర్కార్‌ను దుయ్యబట్టారు. గత సంవత్సరం దేశంలో చాయ్‌వాలా ఎప్పటికీ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన అయ్యర్ 2014లో నరేంద్రమోదీ ప్రధాని కావడంతో బిక్కచచ్చిపోయారు. ఆయనలో అసహనం పరాకాష్టకు చేరింది. తాజాగా చర్చలు ప్రారంభించాలంటే  ఏం చేయాలి అని అడిగిన పాకిస్తాన్ విలేఖరి ప్రశ్నకుమోడీ సర్కారును దించమని తమను(కాంగ్రెస్) అధికారంలోకి తెమ్మని ఆయన సూచన చేశారు. భారత ప్రధానిని సైతం పరాయిగడ్డపై అవమానించగల్గిన కుసంస్కారం ఆయనసొత్తు. 10ఏళ్ళ పాటు భారతప్రధానిగా వున్న మన్మోహన్సింగ్ ఎందుకు ఏనాడూ పాకిస్తాన్ సందర్శించలేదో అయ్యర్ చెప్పగలరా? 10 ఏళ్ళపాటు ఎన్నో వేదిక మీద పాకిస్తాన్ నేతలతో చర్చలు జరిపిన మన్మోహన్సింగ్ పాకిస్తాన్‌కు ఏనాడు వెళ్ళే సాహసం చేయలేదు. యుద్ధాల్లో గెలిచిన ప్రతిసారీ చర్చల్లో ఓడిపోతున్న భారత్ విదేశాంగ విధానాన్ని ఒక సమగ్ర దృక్పథంతో సమీక్షించే ప్రయత్నంలో మోడీ సర్కార్ తీవ్రవాద, వేర్పాటువాద వర్గాలతో చర్చలు జరపవద్దని, కేవలం భారత ప్రభుత్వంతోనే చర్చలుండాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి సూచించింది. దశాబ్దాలుగా ఆషామాషీగా భారత్‌కు వచ్చి, వేర్పాటువాదులతో మంతనాలు సాగించి, భారత దౌత్యాధికారులతో తూతూ మంత్రంగా చర్చించి తాజ్‌మహల్, అజ్మీర్ దర్గాదగ్గర ఫోటోలకు పోజులిచ్చి వెళ్ళిపోయే పాకిస్తాన్ నాయకులు భారత్ చేసిన నిర్దేశానికి ఖంగుతిన్నారు. ఆగస్టులో రావడమే మానుకున్నారు. చేష్టలుడిగిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ లాంటివారు చేవచచ్చిన కూతలు కూసినంతకాం అది శత్రువుకు మద్దతివ్వడమే అవుతుంది. ఎంతపార్టీ వేరైనా, తామూ ప్రస్తుతం అధికారం కోల్పోయినా, మోడీని ఎంత వొప్పుకోకున్నా దేశానికి, దేశ సార్వభౌత్యానికి భంగం కల్గించే రీతిలో వ్యవహరించడం అయ్యర్‌లాంటి వారికే చెల్లింది.