మూడుసార్లు ఆత్మాహుతి దాడి విఫలంఅతడు ఇంజినీరింగ్ చదివిన భారతీయుడు. ఐఎస్ఐఎస్లో శిక్షణ పూర్తిచేసుకున్న తొలి భారతీయ ఆత్మాహుతి బాంబర్. ఇరాక్లో ఆత్మాహుతి దాడులకు పలుమార్లు యత్నించి విఫలమయ్యాడు. చివరికి భారత్ తిరిగొచ్చి భద్రతా సంస్థలకు చిక్కాడు.  అతను మహారాష్ట్ర పన్వేల్కు చెందిన అరిబ్ ఫయ్యాజ్ మజీద్ (23) ఇంజినీరింగ్ విద్య పూర్తిచేశాడు. 2014మేలో నలుగురు స్నేహితులతో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అక్కడ ఆత్మాహుతి దళసభ్యుడిగా శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆగస్టులో మోసుల్ నగరంలో సైనిక దళాలపైకి పేలుడు పదార్థాల వాహనంతో ఆత్మాహుతి దాడికి దిగాల్సి ఉండగా.. వైమానిక దాడుల్లో వాహనం నాశనమైంది. తర్వాత సెప్టెంబర్లో రేబియాలో కుర్దిష్ సైనిక శిబి రంపై అదేతరహా దాడికోసం వాహనంతో దూసుకెళ్తుండగా కుర్ద్ సైనికులు వాహనంపైకి  కాలుపులు జరిపి నిలువరించారు. అరిబ్ గాయపడగా, ఐఎస్ఐఎస్ ఫైటర్లు కాపాడారు. మూడోసారి ఇరాక్ టలాల్హువాలో పేలుడు పదార్థాలు నింపిన కారుతో వెళ్తుండగా వైమానిక దాడి జరిగి విఫలమైంది. మూడుసార్లు ఆత్మాహుతి దాడులకు యత్నించినా విఫలమైనట్లు విచారణాధికారులకు తెలిపారు. గత నవంబర్లో భారత్ తిరిగొచ్చాక అతనిని కస్టడీలోకి తీసుకొని భద్రతా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. విచారణలో ఐఎస్ఐఎస్ ఆకృత్యాలు వెళ్ళడించాడు. బందీలుగా పట్టుకున్న మహిళల్ని ఐఎస్ఐఎస్ లైంగిక బానిసలుగా ఉపయోగించుకుంటోందనీ, వాటిని ఇంటరాగేషన్ నివేదిక నుంచి తొలగించాలని నిర్ణయించామని అరిబ్ను ప్రశ్నించిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఐఎస్ఐఎస్కు నియామకాలు చేసిపెట్టే మహిళ భారత్ నుంచి మరింతమందిని ఆకర్షించేందుకు తన ఫేస్బుక్ ఖాతాను ఉపయోగించుకునేందుకు చేసిన యత్నానికి సంబంధించిన ఉదంతాన్నీ విచారణలో అరిబ్ వెల్లడించారు.