‘‘టీఆర్‌ఎస్తో మజ్లిస్‌ లోపాయికారీ ఒప్పందం’’రాబోయే  హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే దిశగా అధికార టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పావులు కదుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్తో సఖ్యత కొనసాగిస్తున్న మజ్లిస్ నేతలు.. గ్రేటర్లో పాగా వేయడానికి ఆచితూచి అడుగు వేస్తున్నారు. మేయర్ పీఠంపై కన్నేసిన పార్టీలు వ్యూహాత్మకంగాముందుకెళ్తున్నాయి.
గత ఎన్నికల్లో 43 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకున్న మజ్లిస్ సారి కనీసం 79 స్థానాల్లో గెలుపొందాలని భావిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలో గ్రేటర్ హైదరాబాద్ను 200 డివిజన్లకు విస్తరించాలని భావించగా.. మజ్లిస్ నేతల ఒత్తిడితో మళ్లీ 150 డివిజన్లకు టీఆర్ఎస్ పాలకులు కుదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. 200 డివిజన్లతో ఎన్నికలు జరిగితే టీడీపీ, బీజేపీలకు అనుకూలంగా మారుతుందని గ్రహించిన మజ్లిస్.. టీఆర్ఎస్ సర్కార్పై ఒత్తిడి చేసి గతంలో ఉన్నట్టుగా 150 డివిజన్లకే పరిమితం చేసిందని చెబుతున్నారు. అలాగే, టీడీపీ, బీజేపీలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను తలా తోకా లేకుండా విభజించారని, దీని వెనక మజ్లిస్ నేత హస్తం ఉందని పార్టీ నేతలే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మజ్లిస్ ఆధిపత్యం కొనసాగుతున్న పాతబస్తీలో టీడీపీ, బీజేపీలకు అనుకూలంగా ఉన్న డివిజన్లను పునర్విభజనలో భాగంగా అదృశ్యం చేశారని విమర్శిస్తున్నారు. తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికే పాతనగరంలోని మునిసిపల్ డివిజన్ల సంఖ్యలో పెద్దగా తేడా రాకుండా మజ్లిస్ జాగ్రత్త పడిందని వివరిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారడంతో మజ్లిస్ నేత సూచన మేరకే అధికార టీఆర్ఎస్ మార్పులు-చేర్పులు చేస్తోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయినా, మజ్లిస్ నేతల రాజకీయ ప్రకటనల జోలికి వెళ్లకుండా చాప కింద నీరులా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పాతనగరంలోని ఏడు శాసనసభా స్థానాల్లో మరో పార్టీకి అవకాశం లేకుండా మజ్లిస్ ఆధిపత్యం కొనసాగుతున్నందున జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్, సనతనగర్, రాజేంద్రనగర్, కుతుబుల్లాపూర్ ప్రాంతాల్లోని దళితులు, బీసీల మద్దతుతో మరిన్ని సీట్లను దక్కించుకోవడానికి మజ్లిస్ నేతలు వ్యూహాలను రచిస్తున్నారు.
మరోవైపు వార్డు విభజన, ఓట్ల తొలగింపు మజ్లిస్ ప్రాభల్యం ఉన్న పాతబస్తీలో జరగలేదు. ఒక్క ఓటు కూడా తొలగించటానికి అధికారులు సాహసించలేదు.
టీఆర్ఎస్తో మజ్లిస్పార్టీ లోపాయికార ఒప్పందమే దీనికి కారణమని జగమెరిగిన సత్యం. మొత్తం 24 నియోజకవర్గాల్లో మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 7 నియోజకవర్గాలు మినహా లక్ష సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. విషయంపై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాలుకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అధికార పక్షానికి ఎలక్షన్ కమిషన్ కూడా  సహాయం చేస్తోందని అన్ని వర్గాలూ విమర్శిం చాయి. నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. విషయంపై అటు ఉన్నత న్యాయస్థానం కూడా తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.