కుటుంబ స్వామ్యంతో సతమతమవుతున్న కాంగ్రెస్‌


దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టం కావాలంటే అధికారపక్షము-ప్రతిపక్షం బాధ్యత యుతంగా వ్యవహరించాలి. పాలన సక్రమంగా నడవటంలో ఇద్దరిదీ కీలక పాత్రే, అట్లా ప్రజాస్వామ్యంపై విశ్వాసం పాలనకు మూలాధారం. ప్రజాస్వామ్యం పార్టీలో కూడా ఉండాలి. భారతదేశంలో దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉంది? అంటే ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేం కాని కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కంటే కుటుంబ స్వామ్యం ఎక్కువగా ఉన్నది. గాంధీ పేరు మీద నెహ్రూ కుటుంబంపై కాంగ్రెస్ పునాదులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము నెహ్రూ కుటుంబానికే చెందిన వ్యక్తిని కాక మరెవ్వరిని ఊహించలేకపోతున్నారు. కుటుంబం చేస్తున్న తప్పులు కాస్తూ మాట్లాడుతుంటారు. తాజాగా మధ్య మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ (నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పత్రిక గనుక దానికి రుణాన్ని పార్టీ సమకూర్చటము, పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఉన్న సోనియా, రాహుల్ పత్రికను ప్రచురించే సంస్థలో వాటా కలిగి ఉండటం పూర్తిగా సక్రమమేనని అన్నారు. సోనియా, రాహుల్ ఒకవేళ పార్టీలో బాధ్యత నుండి ప్రక్కకు తప్పుకుంటే క్రొత్తగా వచ్చే పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేర్లకు వాటాలు బదిలీ అవుతాయా? ప్రశ్నకు సూటిగా చిదంబరం సమాధానం చెప్పలేదు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖంగా పాల్గొని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారటం పార్టీకి నష్టమేకాని అంతకన్నా ఎక్కువగా దేశానికి నష్టము. దేశం నష్టపోయిన ఫర్వాలేదు నెహ్రూ కుటుంబము నష్టపడకూడదు అని కాంగ్రెస్లోని మేధావుల ఆలోచనలు. ఇవి ఎంతో ఆక్షేపించదగింది. ఇది ఈనాటి కాంగ్రెస్ దుస్థితి.