శౌర్యవంతురాలు

ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని భావించే దేశం మనది. కానీ అలాంటి దేశంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావమో లేక ప్రజలో పెరుగుతున్న విలాసవంతమైన జీవన విధానం వల్లనో కానీ ఆడపిల్లను అంగడి బొమ్మల్లా అమ్మేసే పరిస్థితులు నెలకొన్నాయి. బలవంతంగా కొందరిని, భయపెట్టి కొందరిని అక్రమంగా అమ్మేస్తున్నారు. హ్యుమన్ ట్రాఫికింగ్ అంటే అమాయకపు బాలికల్ని బలవంతంగా ఉద్యోగాలిప్పిస్తామనో లేక మరో విధంగానో మభ్యపెట్టి వ్యభిచార గృహాలకు, విదేశాలకు తరలించి వారిని సెక్స్వర్కర్లుగా వాడుకోవడం జరుగుతోంది. ఇప్పడు దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయింది. అమానవీయంగా సాగుతున్నది మహిళ  అక్రమ రవాణా కాండ.
పూర్వం సీతాదేవిని అక్రమంగా రావణుడు ఎత్తుకుపోయినందుకు రావణ సంహారం జరిగింది. కానీ ఇప్పడు అలాంటి రావణాసురులు ఎందరో పుట్టుకొస్తున్నారు. అలాంటి రాక్షసులకు బలవుతున్న ఒక్కొక్క అమ్మాయి జీవితం చూస్తుంటే కరుకు గుండె సైతం కన్నీళ్లు పెట్టక మానదు. అలాంటి రాక్షసులను ఎదుర్కోవాలంటే ధైర్యసాహసాలు అక్కర్లేదు. తెగించే తెగువ, పట్టుదల ఉంటే చాలని నిరూపిస్తుంది శౌర్య. ఇప్పడు బెంగాల్లో ఈమె పేరు చెప్తే చాలు ఆడపిల్లకు కొండంత భరోసా. గుండెనిండా ధైర్యం.  ఎందరో ఆడపిల్లకు ఊపిరిని అందిస్తుంది బెంగాల్ నిప్పుకణిక.
చిన్నప్పటి నుంచే
తను పుట్టినప్పడే  తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది తను పెద్దయ్యాక శౌర్యవంతురాలవుతానని అందుకే ఆమెకు రంగుశౌర్య అనే పేరు పెట్టారు. ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్ హిల్స్ పానిఘట్టలో పుట్టారామె.గ్రాడ్యుయేషన్ దాకా చదివారు. సామాజిక కార్యకర్త అయిన ఈమెకు చిన్నప్పటి నుంచే సేవాగుణం ఎక్కువ. చిన్నప్పడే విరాళాలు సేకరించి స్కూళ్లో పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిచ్చేది, ఫీజు కట్టేది. అలా సేవా గుణం ఉగ్గుపాలతో పాటే పెరిగి పెద్దదయింది. ఎక్కడ అన్యాయం జరిగినా సహించేవారు కాదు. ముఖ్యంగా ఆడపిల్లను అంగడి బొమ్మల్లా అమ్మేస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ ఆమెను కదిలించింది.
మొదటిసారిగా..
ఒకసారి ఢల్లీకి చెందిన వ్యాపార వేత్త ఇంట్లో బాండెడ్ లేబర్గా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న 13 సంవత్సరాల బాలికను శౌర్య మరికొంత మందితో కలిసి రక్షించారు. అప్పడు అమ్మాయి అనుభవించిన క్షోభను గురించి విని చలించిపోయింది. అంతే తన లక్ష్యమేమిటో నిర్థారించుకుంది. 2004లో మొదలైన ఉద్యమం అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిర్వఘ్నంగా సమస్యపై పోరాడుతూ ఉద్యమాన్ని సాగిస్తోంది శౌర్య. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ట్రాఫికింగ్ ముఠా చెర నుంచి వందలాది మంది బాలికలకు, మహిళలకు విముక్తి కల్పించారు. సిక్కిం, నార్త్ బెంగాల్, అస్సాం, నేపాల్ నుంచి ట్రాఫికింగ్ ముఠాలు తరలిస్తున్న500 మంది చిన్నారులను కాపాడారు. బాధితులంతా 18 ఏళ్ల లోపు బాలికలే. ఆడపిల్లను కట్టు బానిసుగా విక్రయించడం, వారి అవయవాలను అమ్ముకోవడం లాంటి వికృత చేష్టలకు ప్పాడుతున్న ముఠా భరతం పట్టారు.
ఎన్జీవో నీడలో...
సిలిగుడిలోని కాంచన్ జంగా ఉద్ధార్ కేంద్రం అనే ఎన్జీవో ద్వారా ఆడపిల్లకు రంగు శౌర్య నీడనిస్తున్నారు. ట్రాఫికింగ్ చెర నుంచి రక్షించి అక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్నందుకు గానూ శౌర్యను బెదిరించిన వాళ్లూ లేకపోలేదు. మాఫియా బ్లాక్ మెయిల్ చేసింది. గూండాలు వార్నింగ్ ఇచ్చారు. తమకు అడ్డురావొద్దని డబ్బు ఎర చూపారు. కానీ శౌర్య వాటికి బెదరలేదు. హ్యూమన్ ట్రాఫికింగ్ను ధైర్యంగా ఎదుర్కొంది. అయితే ఇప్పటి దాకా మనం చూసిన హ్యుమన్ ట్రాఫికింగ్ చాలా చిన్నదేనని అంటోంది ఈమె. ఉత్తర బెంగాల్ తేయాకు తోట నుంచి అమాయక ఆడపిల్లలను గల్ప్్ దేశాలకు అమ్మేస్తున్నా రు. ముఠా అంతు చూడటమే తన తరువాత లక్ష్యం అని అందుకోసం ఎంత కష్టమైన భరిస్తానని చెబుతోంది శౌర్య.
నిజంగానే శౌర్య అందిస్తున్న స్పూర్తి ప్రతి యువతికీ, మహిళలకు ఆదర్శమే. కేవలం హ్యుమన్ ట్రాఫికింగ్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో రకాల ఆపదుల నుంచి మగువని  మతం ముసుగులో ముంచెత్తడానికి పొంచి చూస్తున్నాయి. ఎంతో ఆందోళన కలిగిస్తున్న ఇలాంటి సమస్య గురించి తెలుసుకొని మనమే  కాదు మన  చుట్టూ ఉన్నవాళ్లకు కూడా తెలియచేసి చైతన్యవంతుల్ని చేద్దాం . అమాయకపు ఆడపిల్లలను కాపాడుదాం.