మాతృభాషలోనే ప్రాథమిక విద్య


ఒకే దేశానికి, ధర్మానికి చెందిన వారము మనంఅనే భావన ప్రజలను ఏకం చేస్తుంది. దేశభక్తిని ప్రోది చేస్తుంది. ప్రజలను ఏకత్రాటిపైకి తెచ్చేశక్తి మాతృభాషకు కూడా ఉన్నది. సంస్కృతం మూలంగా గల భారతీయ భాషలన్నీ సుమధురంగా సుసంపన్నంగా వెలుగొందుతున్నాయి. ఐతే లార్డ్ బాచింగ్టన్ మెకాలే కారణంగా భారతీయులూ` భారతీయ భాషలూ ఆంగ్లభాషకిబలిఅయిపోయాయి. ప్రజలలో ఆంగ్ల వ్యామోహం ` స్వభాష పట్ల ఈసడింపు నానాటికి పెరుగుతూ మన విద్యా వ్యవస్థను అతలాకుతం చేసింది. ఒకప్పుడు విద్యాబోధన మాతృభాష ద్వారానే జరిగేది, కాని నేడు తెలుగు మాధ్య మంలో చదువుకునే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. నిజానికి మాతృ భాష ద్వారా జరిగే విద్యాబోధన సర్వోత్కృష్టం అని మెధావులూ, భాషా శాస్త్రవేత్తలూ ఎప్పటి నుంచో ఘోషిస్తున్నారు. నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన యంగ్ లైవ్స్ అనే ఒక బృందంమాతృభా షలో విద్యాబోధనఅనే అంశంపై విస్తృతంగా ఒక అధ్యయనం చేశారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రాంతాలలో గ్రామీణ పట్టణ స్థాయిలో 233 పాఠశాలలు పర్యటించి 915 మంది విద్యార్థులతో సంభాషించి ఆంగ్ల తెలుగు మాధ్యమాలలో చదివే విద్యార్థుల అవగాహనా సామర్థ్యం పరిశీలించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను బయటపెట్టారు.
ప్రాథమిక విద్య ఆంగ్లంలో చదువుకున్న వారికంటే తెలుగులో చదివిన విద్యార్థుల ప్రతిభాపాటవాలు అధికంగా ఉన్నట్లు తెలిసింది. తెలుగులో చదివిన పిల్లలు త్వరగా విషయాన్ని గ్రహిస్తారు. మాతృభాషలోపట్టుసాధిస్తే ఇతర భాషలు నేర్చుకోవటం తేలిక గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలున్నప్పటికీ, తెలుగులో చదివిన వారు ఎక్కువగా రాణిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల, ప్రాథమిక విద్య (ఒకటి నుండి ఐదో తరగతి వరకు) బోధనా భాష తెలుగులోనే ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తింప జేయాలని ఆదేశించింది. ఆంగ్లము నేర్పటం కూడా  ఉంటుంది. అంతేకాకుండా ఇటువంటి నిర్ణయం అఖిల భారతీయ స్థాయిలో కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం ముదావహం, శ్లాఘనీయం. మంచి నిర్ణయం త్వరలోనే ఆచరణలోకి వస్తుందని ఆశిద్దాం!