దుష్టుల‌పాలిటి భ‌ద్ర‌కాళి భ‌న్వ‌రీదేవి..
ఇప్పుడున్న స‌మాజంలో మ‌హిళ‌ల‌పై అనేక‌ర‌కాలైన అన్యాయాలు జ‌రుగుతున్నాయి. త‌ప్పెవ‌రిదైనా స‌రే స్త్రీని గౌర‌వంగా చూడ‌వ‌లిసిన మ‌న‌దేశంలో ఇలాంటి ప‌నులు జ‌రుగుతుండ‌డం నిజంగా శోచ‌నీయం. బాల్య‌వివాహాలు రూపుమాపినా ఇంకా అనేక చోట్ల కొన‌సాగుతూనే ఉన్నాయి. వాట‌న్నింటికీ అడ్డుక‌ట్టవేసేది మాత్రం మ‌గువలంతా సంఘ‌టితంగా ఉన్న‌ప్ప‌డే..ఈవిష‌యాన్ని గుర్తించి కాబోలు భ‌న్వ‌రీదేవి. బాలిక‌లకి చిన్న‌త‌నంలోనే వివాహాలు, లైంగిక వేదింపుల‌పై త‌న పోరాటాన్ని జ‌రుపుతూనే ఉంది. అందుకోసం త‌నుఎన్నో క‌ష్టాల‌ని ఎదుర్కుంది..ఇంత‌కీ ఆమె ఎవ‌రు, ఏం చేసింది, ఎలాంటి క‌ష్టాలు ఆమెను వెంబ‌డించాయో ఆమె గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం! మ‌న‌మూ ఆమె నుంచి స్పూర్తి పొందుదాం!
రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ మహిళాభివృద్ధి ప్రాజెక్టులో ఓ క్షేత్రస్థాయి ఉద్యోగి భన్వరీదేవి. తన ఉద్యోగంలో భాగంగా నీటి కొరత, నిరక్షరాస్యత, ఆరోగ్యం వంటి అంశాలపై ఉన్న సమస్యలను గ్రామస్తులతో చర్చించి వాట‌న్నింటికీ ప‌రిష్కార మార్గాల‌ని క‌నుక్కునేది. గ్రామ‌స్థుల‌తో క‌లిసి ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించేది. 1992లో ఓసారి ఒక బాల్య‌వివాహంలో ఆమె వ‌ద్ద‌ని పోరాటం సాగించింది. అప్ప‌టి నుంచి గ్రామ‌స్థుల నుంచి ఆమెపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఎదురైంది. అక్ర‌మంగా సాగుతున్న బాల్య‌వివాహాల‌ను అడ్డుకోవ‌డంలో అయినా త‌ను వెర‌వ‌లేదు. ఈక్ర‌మంలో చాలాసార్లు ఆమెను గ్రామ‌స్థులు కొట్టారు. ఇలా అడ్డుకుంటున్నందుకు గానూ కొంద‌రు దుర్మార్గులు ఆమెపై అత్యాచారానికి కూడా పాల్ప‌డ్డారు. అయినా స‌రే త‌న జీవితం ఏమైనా ప‌ర్లేదు ముందు ముందు భావిత‌రానికి అవ‌స‌ర‌మ‌య్యే అమ్మాయిల ర‌క్ష‌ణే ముఖ్య‌మ‌ని అనుకుంది.
ఎన్నో ఒత్తిడిలు..
అలా ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ‌డం వ‌ల్ల ఆమె తీవ్ర‌మైన అనారోగ్యానికి గురికావ‌ల్సి వ‌చ్చింది. ఈ విష‌యంపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి సుదీర్ఘ‌కాలం పాటు కోర్టులో వాదించింది. ఆ క్ర‌మంలో డాక్ట‌ర్లు, పోలీసులు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌లోని కొంత‌మంది నుంచి ఆమె ఆనేక ఛీత్కారాల‌ను కూడా ఎదుర్కుంది. ఎందుకంటే ఆమెపై జ‌రిగిన పైశాచిక దాడిని ఓ మ‌హిళ‌గా అందరినీ ఎదురించి బ‌య‌ట‌కి వ‌చ్చి చెప్పుకోవ‌డాన్ని అక్క‌డి వాళ్లెవ‌రూ స‌మ‌ర్థించ‌లేదు. దీంతో ఆమెను ఆ ఊరి నుంచి బ‌హిష్క‌రించారు కూడా. అయినా స‌రే ఆమె భ‌య‌ప‌డ‌క త‌న‌పోరాటాన్ని కొన‌సాగించింది. భ‌న్వ‌రీ కేసు సృష్టించిన సంచ‌ల‌నంతో  రాజ‌స్థాన్‌రాష్ట్రంలోని యావ‌త్ మ‌హిళ‌లు అప్ర‌మ‌త్తం అయ్యారు. త‌న‌కు అండ‌గా నిలిచారు. త‌న‌కోసం ఒక మ‌హిళా ఉద్య‌మ‌మే చెల‌రేగింది. ఆమెను స్పూర్తిగా తీసుకుని త‌మ‌పై జరుగుతున్న దాడుల‌ను చెప్పుకోవ‌డానికి మ‌రింత మంది మ‌హిళ‌లు ధైర్యంగా న్యాయం కోసం ముందుకు వ‌చ్చారు.
ఆమెకు మాత్రం న్యాయం జ‌ర‌గ‌లేదు
ఇంత‌మందికి స్పూర్తి క‌లిగించిన భ‌న్వ‌రీదేవికి మాత్రం న్యాయం మాత్రం జ‌ర‌గ‌లేదు. అప్ప‌డున్న కొన్ని లోటుపాట్ల వ‌ల్ల నిందుతులు చాలా సుల‌భంగా కేసు నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డ్డారు. భ‌న్వ‌రీదేవి క‌లిగించిన స్పూర్తికిగానూ 1994 సంవ‌త్స‌రంలో నీర్జాభానోత్ మెమొరియ‌ల్ అవార్డును ఇవ్వ‌డం జ‌రిగింది. కొన్ని మ‌హిళా సంఘాలు, స్వ‌చ్చంద సంస్థ‌లు ముందుకొచ్చి విశాఖ అనే స‌మూహాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి దాడులు జ‌రుగ‌తున్న‌మ‌హిళ‌ల‌కు మేం భ‌రోసాగా ఉన్నాం అని వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా సుప్రింకోర్టు వ‌ర‌కూ వెళ్లారు. ఈ ఉద్యమ‌మే ఉద్యోగాల్లో మ‌హిళ‌లు లైంగిక వేధింపుల‌కు గురికాకుండా ఉండేలా 2013లో చ‌ట్టానికి నాంది ప‌లికింది.
అక్క‌డి మహిళలంతా ఒక్కో సామాజిక పరిస్థితి, ఆర్థిక స్థితిగతుల నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ వీళ్లందరిలో ఉన్న ఒకే ల‌క్ష‌ణం మాత్రం ధైర్యం. అదే అక్క‌డ శ‌క్తిని క‌లిగించింది.  వాళ్లు అందరిలానే పరిస్థితులకు లొంగిపోయి నలుగురూ నడిచే దారిలో నడిచి ఉండొచ్చు, కానీ త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఎదుర్కొని ఇత‌రుల‌కోసం పోరాడారు.