సంప్రదాయానికి ప్ర‌తీక ఉగాది..మ‌న తెలుగు సంప్ర‌దాయానికి అద్దం ప‌డుతూ ప్ర‌కృతిని మ‌న ముంగిట‌కు తెచ్చే పండుగే ఉగాది.   " మాసానాం మార్గశిర్షీహం..రుతూనాం కుసుమాక‌ర అని భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ చెప్పాడు. అంటే అన్నీ మాసాల‌లోకెల్లా మార్గశిర మాసం ఉత్త‌మ‌మైన‌ది. రుతువుల్లోకెల్లా వ‌సంత రుతువు ఉత్త‌మ‌మైన‌ది అని అర్థం. మ‌నం జ‌రుపుకునే పండుగ‌ల‌న్నీ కూడా రుతువుల‌పై, తెలుగు మాసాల‌పై ఆధార‌డే ఉంటాయి. ఉగాది పండుగ వ‌సంత‌రుతువులో వ‌స్తుంది. ఆ రోజుల్లో ప్రకృతి అత్యంత రమణియంగా ఉంటుంది. అప్పుడ‌ప్పుడే చెట్ల‌కు విక‌సిస్తున్న‌ చిగురులు.. పక్షుల కిల కిలారావాలు.. మామిడి చిగుళ్ళును ఆస్వాదించిన కోకిలల ఆలాప‌నలు..అలా పరవశించిన ప్రకృతి ఒడిలో అందరూ ఉగాది సంబరాలు జరుపుకొంటారు.  ఉగాది పండుగ రావడంతో తెలుగిళ్ళు కళ కళలాడుతుంటాయి.ఎవరెన్ని కష్టాల్లో ఉన్నప్ప‌టికీ ఆ రోజున మాత్రం ఆనందంగా గడుపుతారు.ఎందుకంటే ... సంవత్సరం ప్రారంభం రోజున ఎలా ఉంటె... సంవత్సరం అంతా అలానే ఉంటారనేది నమ్మకం
చైత్రమాసి జగద్భ్రహ్మ సపరః పదమే అహని
వత్సరాదౌ వసంతాదౌ రసరాదేఁ తధైవచ. 
సంస్కత శ్లోకం యుగాది (యుగ+ఆది)అనే పదం ఉగాది గా ఎలా మారిందో విడమరచి చెబుతుంది. అలాగే ఉగాది అనే ప‌దంలో ఉగ అంటే న‌క్ష‌త్ర గ‌మ‌న‌మ‌ని అర్థం. ఆది అంటే తొలి అని అర్థం. అంటే న‌క్ష‌త్ర గ‌మ‌నం ప్రారంభ‌మైన రోజు అనికూడా అర్థం వ‌స్తుంది. అంటే సృష్టి ఆరంభ‌మైనదే ఉగాది రోజున అని అర్థం. యుగం అన్న ప‌దానికి ద్వ‌యం లేదా జంట అనే అర్థాలున్నాయి. అలా ఉత్త‌రాయ‌ణ‌, ద‌క్షిణాయ‌నాల‌ను క‌లిసి యుగం(సంవ‌త్స‌రం) అవుతుంది.  ఈ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది. ఈ యుగాది శబ్దానికి ప్రతిరూపమే ఉగాది అని నిర్ణయసింధు అనే గ్రంథంలో ఉంది. కొత్త‌జీవితానికి నాందిగా జ‌రుపుకునే ఈ పండుగ చైత్ర శుద్ద పాడ్యమి రోజున వస్తుంది.

పురాణాల ప్ర‌కారం 
మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈజగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయవేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేశాడన్నది పెద్దల భావన. అంతేకాదు వసంత రుతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్తజీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిశషిక్తుడైన దినం కారణంగా ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో కథ ఉంది. ఈ కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని ఒక పురాణ గాధ కూడ ఉంది. అలాగే పన్నెడో మాసమైన చైత్రంలో నవమి దినం నాడు శ్రీరాముడు జన్మించాడని చెప్పబడింది. కావున ఆ కాలంలో వైశాఖమాసం నుంచి క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందని కూడా ప్రతీతి. ఇది ఉగాది ప్రాముఖ్యం తెలియజేస్తుంది.
ఎలా చేసుకోవాలంటే!
 ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలనేది కూడా మన పెద్దలు సవివరంగా చెప్పారు. బ్ర‌హ్మ‌ ముహూర్తంలో లేచి.. అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఆ తర్వాత పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ రాయాలి.  గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. పూజా మందిరాన్ని, ఇంటివాకిలిని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమ ధరించాలి. సంప్ర‌దాయ‌క‌మైన దుస్తులు ధ‌రించాలి. పూజలో పసుపు రంగు పువ్వులు వాడితే మంచిద‌ని చెబుతారు. ఈఉగాది రోజున శ్రీరాముడిని స్మరిస్తే శుభఫలితాలుంటాయి. శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే.. మంచి జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయట.
ష‌డ్రుచులే జీవిత పాఠాలు
ఏ పండుగకి లేని ఓ విశేషం ఈ పండుగ‌కి ఉంది. అదే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు ఉగాది పచ్చడి ప్రతీక. ప‌చ్చ‌డిలో ఉండే ఒక్కో పదార్ధం ఒక్కో భావానికీ, అనుభవానికి ప్రతీక. బెల్లం.... మనలోని ఆనందానికి సంకేతం. మామిడికాయలోని పులుపు మనకు ఎదురయ్యే కొత్త సవాళ్ళకు ప్రతీక. జీవితంలోని ఉత్సాహానికీ, రుచికీ ప్రతీకగా ఉప్పు నిలుస్తుంది. వేప పువ్వులోని చేదు... మనకు బాధ కలిగించే అనుభవాలైతే....  చింతపండులోని పులుపు.. ఏవిషయంలో అయినా నేర్పుగా వ్యవహరించే మన తత్వానికి ప్రతీక. మన సహనాన్ని పరీక్షించే పరిస్థితులకు కారం ప్రతీకగా నిలుస్తుంది. ఉగాది రోజున దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడి తీసుకోవడం తెలుగునాట ఓ సంప్రదాయంగా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ముతైదువులకు ఉగాది పచ్చడి పెట్టి  తాంబూలం ఇచ్చే ఆనవాయితీ కూడా ఉంది.
పంచాంగ శ్ర‌వ‌ణం
ఈ రోజుల్లో... నిత్య వ్యవహారాల కోసం ఇంగ్లీషు క్యాలెండర్  ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృ దేవతారాధన వంటి విషయాలు తెలుసుకోవాలంటే... పంచాంగం చూడడం తప్పనిసరి. ఇంతటి విశిష్టమైన పంచాంగం ప్రతి ఏటా... ఉగాదితో ఆరంభమై... మరుసటి ఏడాది ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగాన్ని ఉగాది రోజున వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాది విధుల్లో ఒకటి.  పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. పంచాంగంలో చెడుగా ఉంద‌ని ఆ సంవ‌త్స‌రం అంతా చెడు జ‌రుగుతుంద‌ని అనుకుంటే పొర‌పాటే..కేవ‌లం చెడు జ‌ర‌వ‌చ్చుకాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పెద్ద‌లు చెప్పే హెచ్చ‌రిక మాత్ర‌మే! ఇంత ప్రాముఖ్య‌త క‌లిగిన పండుగ నేడు వెల‌వెల‌బోతుంది. ఎలాంటి ప్రాశ‌స్త్యంలేని జ‌న‌వ‌రి 1నే సంవ‌త్స‌రాదిగా చెప్పుకుంటూ పాశ్చాత్య సంస్కృతి ప్ర‌భావంలో ప‌డి మ‌న అస‌లైన పండుగ ఉగాదిని విస్మ‌రిస్తున్నాం!!
- విజేత ద‌హ‌గాం