‘దీప’పు వెలుగులుపురుషుల‌తో పాటు మ‌హిళ‌లు కూడా అన్ని రంగాల‌లో ముందంజ‌లో ఉన్న కాల‌మిది. రాజ‌కీయం, చ‌దువు మొద‌లు ఆట‌ల వ‌ర‌కూ అన్ని రంగాల‌లో స్త్రీలు విజ‌యాల‌ను సాధిస్తూనే ఉన్నారు. అన్ని క్రీడలతో పోలిస్తే జిమ్నాస్టిక్స్ కాస్త విభిన్నంగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ, కంట్రోల్, స్ట్రెంగ్త్. ఈ మూడింటి కలయికే జిమ్నాస్టిక్స్. అవన్నీ పక్కన పెడితే లయబద్ధంగా జిమ్నాస్ట్‌ల రింగ్‌లో కదులుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అందుకోసం శరీరాన్ని విల్లులా వంచాలి. దీనికోసం చిన్నప్పటి నుంచే కఠోర శ్రమ అవసరం. అందుకే చాలామంది చిన్నవయసులోనే జిమ్నాస్టిక్స్‌ వైపు దృష్టిసారిస్తారు. అలాంటి విభిన్న‌మైన క్రీడ‌లో శ్ర‌మ‌తో, ప‌ట్టుద‌ల‌తో, త‌న అనుభ‌వాన్ని, నేర్పును, నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించి రియో ఒలంపిక్స్‌కు అర్హ‌త సాధించింది దీపాక‌ర్మాక‌ర్‌. 
భారత క్రీడారంగంలో సరికొత్త చరిత్రకు తెర‌లేపింది దీపా. జిమ్నాస్ట్ విభాగంలో ఓ మహిళా క్రీడాకారిణి భారత్ తరఫున ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి భార‌తీయ మ‌హిళ దీపానే. రష్యా, చైనాలాంటి దేశాల్లో మంచి వసతులు, శిక్షణ కారణంగా అక్కడి క్రీడాకారులు రాణిస్తారు. కానీ భారత్‌లాంటి దేశాల్లో ఇలాంటి విభాగాన్ని ఎవరూ ఎంచుకోరు. అందుకు కారణం సరైన వసతులు లేకపోవడమే. కాని దీప మాత్రం చాలా రిస్క్ తీసుకుని ఈ విభాగాన్ని ఎంచుకుని చరిత్ర సృష్టించింది. రియోలో జరిగిన అర్హత పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచి ఆగస్టులో జరిగే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయింది. 
ఎన్నో అడ్డంకులు 
జిమ్నాస్టిక్‌లో నిల‌దొక్కుకోవాలంటే చాలా శ్ర‌మ ప‌డాల్సి ఉంటుంది. చిన్న‌ప్ప‌టి నుంచి శిక్ష‌ణ ఉంటే త‌ప్ప ఈ క్రీడ‌లో రాణించ‌డం క‌ష్టం. అందుకే దీప చిన్న‌వయ‌సు నుంచే త‌న క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి క‌ఠోర శ్ర‌మ చేసింది. ఇందులో ఎన్నో అవాంత‌రాలు. దానికి ఆమెకున్న లోపం కూడా తోడ‌వ‌డంతో చాలా పెద్ద ఇబ్బందినే ఎదుర్కుంది. దీప పాదం అందిరిలా ఎత్తు ఒంపుల మాదిరిగా కాకుండా స‌మాంతరంగా ఉంటుంది. అది పెద్ద లోపం కాక‌పోయినా జిమ్మాస్టిక్ క్రీడ‌లో రాణించాలంటే అది క‌ష్ట‌మే ఎందుకంటే స‌మాంత‌రంగా ఉన్న పాదం ఈ ఆట ఆడ‌డానికి స‌హ‌క‌రించ‌దు. జంప్ చేసే స‌మ‌యంలో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే కోచ్‌, త‌ల్లిదండ్రుల ప్రోత్సామంతో దీప తీవ్రంగా శ్ర‌మించి అందులోని మెల‌కువ‌ల‌ను నేర్చుకుంది.
ప‌థ‌కాలు.. ప్ర‌శంస‌లు 
చిన్న‌వయ‌సులోనే జిమ్నాస్టిక్ కెరీర్‌ను ప్రారంభించిన దీపా అనేక విజ‌యాల‌ను సాధించింది. త‌న ప‌ద్నాలుగు సంవ‌త్స‌రాల వ‌య‌సులో 2007వ సంవ‌త్స‌రంలో నిర్వ‌హించిన జూనియ‌ర్‌నేష‌న‌ల్స్‌లో విజ‌యం సాధించింది. 2011లో వాల్ట్‌, బీమ్‌, బ్యాలెన్స్‌, ప్లోర్‌, అన్ ఈవెన్ బార్స్ వంటి ఐదు విభావాగాల్లో ఐదు స్వ‌ర్ణ‌ప‌త‌కాలు సాధించి దేశం చూపును త‌న‌వైపుకు త‌ప్పుకుంది. 2015జూన్‌లో హిరోషిమాలో జ‌రిగిన ఆసియా చాంపియ‌న్ షిప్ ఆర్టిస్ట‌క్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది. 2007 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అనేక ర‌కాల పోటీల్లో 67 స్వ‌ర్ణ ప‌త‌కాలతో స‌హా మొత్తం 77 ప‌త‌కాలు గెలుచుకుంది. 2014 గ్లాస్కోలో జ‌రిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం సాధించింది. ప్రొడునోవా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ వాల్ట్‌లో అరుదైన ఘ‌న‌త సాధించింది. ప్ర‌పంచంలో కేవ‌లం ఐదుగురు మ‌హిళా జిమ్నాస్టులు మాత్ర‌మే సాధించిన అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది.
త‌ను సాధించిన ఈ విజ‌యాల‌కు త‌న కోచ్ త‌ల్లిదండ్రులు మాత్ర‌మే కాదు టీమిండియా క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ ప్ర‌శంస‌లు కూడా ఓ కార‌ణ‌మేన‌ట‌! కామ‌న్వెల్త్ గేమ్స్‌లో ప‌త‌కాలు సాధించిన భార‌త బృందానికి ఏర్పాటు చేసిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో దీప‌పై స‌చిన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. దీప‌లాంటి క్రీడాకారిణిని చూస్తుంటే గ‌ర్వంగా ఉంద‌ని స‌చిన్ అన్నాడు. ఈ వ్యాఖ్య‌లు ఆమెలో అంతులేని ఆత్మ‌విశ్వాసాన్ని నింపాయ‌ని చెప్తోంది దీప‌. త‌న శ్ర‌మ‌తో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీప.. రియోలో కూడా మెడల్ సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కోరుకుందాం!
- ల‌తాక‌మ‌లం