కొత్త జిల్లాలతో పరిపాలన ప్రజలకు చేరువవుతుందా?


తెలంగాణ ప్రాంతంలో విజయదశమి నుంచి కొత్త జిల్లాల ఆధారంగా పరిపాలన ప్రారంభం కాబోతుంది. జిల్లాల సంఖ్య ఇప్పటివరకు 27గా నిర్ణయించబడింది. దానికితోడు గద్వాల, సిరిసిల్లా, జనగాంలకు సీఎం సానుకూలంగా స్పందిస్తున్నారు అనే వార్త ఈ రోజు (అక్టోబర్‌3) పత్రికల్లోకి ఎక్కింది. ఇదే నిజమైతే తెలంగాణ 30 జిల్లాలుగా మారబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవటం అనేది అత్యంత అవసరం. 1) జిల్లాల విభజన చారిత్రక నేపథ్యానికి అనుకూలత ఉండవలసిన అవసరం ఉంది కానీ ఈ ఏర్పాటు అంతగా చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా కనబడటం లేదు. 2) ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి వరకు ఉన్న సమితులను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన కారణంగా పరిపాలన సౌలభ్యం పెరిగింది. కాని పరిపాలన అనేది పలుచన పడటం మాత్రం చాలా స్పష్టంగా కనబడింది.
ఈ రోజుకు కూడా ఆ మండల వ్యవస్థ పరిపాలన ఎంత పటిష్టంగా ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం ఎంత అవసరమో పరిపాలనను సుధృడంగా పలుచన కాకుండా చూడటం కూడా అంతే అవసరం. ఈ జిల్లాల ఏర్పాటు కారణంగా రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. దానితో పాటు ప్రజలకు రాజకీయ పరమైనటువంటి ఆశలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఎన్టీరామారావు పరిపాలన కాలంలో ప్రజల్లో చోటుచేసుకున్న రాజకీయపరమైనటువంటి ఆశలు మళ్లీ ఈ కొత్త జిల్లా సమయంలో కనబడవచ్చు అని అనిపిస్తున్నది.