బ్రహ్మపుత్రా నదిని అడ్డుకోచూస్తున్న చైనా

భారత్‌ పొరుగు దేశమైన చైనా ఎప్పుడు భారత్‌ను రెచ్చగొట్టేందుకు, ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నం చేస్తుంది. తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తల్లో తెలుస్తున్నది. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్‌లోని మానస సరోవర్‌లో పుట్టిన బ్రహ్మపుత్రా నది మన
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ప్రవహిస్తుంటుంది. ఆ బ్రహ్మపుత్రా నది జలాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆసియాలో అన్ని రంగాలలో తనకు పోటీగా వస్తున్న భారత్‌పై అక్కసు వెళ్లగట్టడానికే ఈ ప్రయత్నం చేస్తున్నదా? మానస సరోవర్‌ సమీపంలో కైలాస పర్వతం దిగువన పుట్టే ఈ నది అక్కడ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బంగాళఖాతంలో కలుస్తుంది. మొత్తం 2900 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది పరివాహాక ప్రాంతమంతా అత్యంత సారవంత మైనది. సగటున సెకనుకు 19300 గణపు మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఆ నది ఒకొక్కచోట అత్యధి కంగా పదికిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. భారత్‌ చైనా మధ్య జల ఒప్పందాలు ఏవీ లేవు. 2013 అక్టోబర్‌లో మాత్రం సరిహద్దు నదుల విషయమై సహకారం బలపరుచుకునేలా రెండు దేశాలు అవగాహన పత్రంపై సంతకం చేశాయి. బ్రహ్మపుత్రా నదిమీద ఇప్పటికే ఒక ప్రాజెక్టు చైనా నిర్మించి ఉంది. మరో మూడు ప్రాజెక్టులు నిర్మాణం చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీని కారణంగా భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గత మార్చిలో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకువెళ్ళింది కానీ చైనా స్పందన ఏమీ లేదు.