ఏకశః సంపత ఆంతర్యం

మన స్వయంసేవకులలో ఒకరైన శ్రీనానాజీ దేశ్‌ముఖ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లా నుంచి లోక్‌సభకు ఎన్నిక య్యారు. ఆయన గోండా జిల్లా ప్రజల ఆర్థికాభివృద్ధికి ఒక పథకం తయారు చేశారు. ఆ పథకం ప్రారంభోత్సావానికి అప్పటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డిని ఆహ్వానించారు. వారితో పాటు నన్ను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ ఉత్సవం ప్రత్యేకత ఏమంటే, ఆ రోజు భోజనాల సమయంలో రాష్ట్రపతికి ఇటువైపున నేలపైన పట్టాలపై ఒక రైతు, అటువైపు మరో పేద రైతు, వారి ప్రక్కన నేను- ఆ ప్రకారంగానే పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు కూర్చోవాలి.ఆ విధంగా విస్తర్లలో భోజనం వడ్డన చేశారు. అక్కడి అలవాటు ననుసరించి చిన్నచిన్న మట్టి పిడతలతో పప్పుకూర, మంచినీళ్లు ఇచ్చారు. అందరూ కలిసి భోజనం చేసారు. అట్లా రాష్ట్రపతిని అలా భోజనం చేయడానికి ఆహ్వానించే చొరవ, చనువు ఒక్క సంఘ స్వయంసేవకులకు తప్ప మరెవరికీ ఉండదేమో! స్వయం సేవకులకు అలా భోజనం చేయటం సంఘ శిబిరాలలో అలవాటే గదా!
ఏకశఃసంపత మనకు ఒక లాంఛనం కాదు. కేవలం ఒక ఆజ్ఞ కాదు. అంతా ఒకే వరుసలో నిలవటం అనే సమతాభావన, సోదర భావన, ఏకతా భావన దాని వెనక ఉంది. సంఘస్థాన్‌ శిబిరాల్లో, శిక్షావర్గల్లో, మనమంతా ఒకటిగా ఉంటూ, ఆ ఏకత్వం వ్యక్తిలోనూ, కుటుంబంలోనూ సమాజంలోనూ ఆచరణలోకి రావాలి. ఏ కులం వ్యక్తి మీ ఇంటికి వచ్చినా మీరు సహపంక్తి భోజనం చేయగలగాలి. మనం పొందిన సంస్కారాలు ఈ విధంగా ఆచరణకు రావాలి.
- శ్రీ బాళా సాహెబ్‌ దేవరస్‌, తృతీయ సర్‌సంఘ్‌చాలకులు