అతనికి తన తల్లిని చూడడము ఆదే ఆఖరిసారి

ఆ రోజు డిశంబరు 18, 1927. ఒక నడివయస్కు రాలైన స్త్రీ గోరఖ్‌పూర్‌ కేంద్ర కారాగారము ప్రధాన ద్వారము వద్ద వేచియున్నది. ఆవిడ ముఖము ఎంతో కాంతివంతముగానూ ఏదో ఆందోళన కలిగి యున్నట్లుగా యున్నది. కారాగారములోనికి వెళ్ల డానికి వచ్చే పిలుపు కోసమై ఆవిడ వేచియున్నది. ఇంతలోగా ఆవిడ భర్త కూడా అక్కడికి వచ్చారు. ఆయన తన భార్య తన కన్నా ముందే అక్కడ వుండడం చూసి ఆశ్చర్య చకితుడయినాడు. అంతలోనే అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. అతను వారి బంధువు కాదు. కాని ఆ జంటను తను లోపలికి పంపిస్తారని అప్పుడు వారితో కలిసి లోపలికి వెళ్లాలని అక్కడికి వచ్చాడు. జైలు అధికారులు ఆ భార్యాభర్తలను లోనికి పిలిచారు. 


ఆ యువకుడు కూడా వారిని అనుసరించాడు. కాపలాదారుడు ''నువ్వెవరు?'' అంటూ అతనిని అడ్డగించాడు. ''అతనిని పంపించు సోదరా అతడు మా చెల్లెలి కొడుకు'' అని ఆవిడ ధఢ స్వరముతో చెప్పింది. కాపలాదారుడు అంగీకరించాడు. మర్నాడు తన చావును ఎదుర్కొనబోతున్న ఒక స్వతంత్ర సేనానిని చూడడానికి ఆ ముగ్గురు ఆ కారాగారానికి వచ్చారు. గొలుసులతో కట్టబడిన ఒక స్వతంత్ర సేనానిని తీసికొని వచ్చారు. అతనికి తన తల్లిని చూడడము ఆదే ఆఖరిసారి మరియు తన తల్లిని అమ్మా అని పిలవడము అదే ఆఖరి సారే. ఆ మాట తలచుకోగానే అతనికి దుఃఖము వెల్లువై పొంగింది. అతనికి నోట మాట రాలేదు, కన్నీరు చెక్కళ్ల మీద ధారగా కారింది. అతని తల్లి ధఢ స్వరముతో ఇలా అన్నది ''నా కొడుకు ఒక గొప్ప నాయకుడని అనుకున్నాను. బ్రిటిష్‌ ప్రభుత్వము నా కొడుకు పేరు వింటేనే వణికిపోతుందని అనుకు న్నాను కానీ నా కొడుకు చావుగురించి భయపడతాడని అనుకో లేదు. నువ్వు ఏడుస్తూ చావదల్చుకొంటే ఇటువంటి కార్యకలాపాలు ఎందుకు చేశావు?'' ఆ తల్లి ధఢత్వానికి అధికారులు ఆశ్చర్యపో యారు.ఆ స్వతంత్ర సేనాని ఇలా అన్నాడు ''అమ్మా! ఈ కన్నీళ్ళు మరణానికి భయపడి కాదు, ఎంతో ధైర్యవంతురాలైన నా తల్లిని చూసి'' అని చెప్పాడు. ఆ ధైర్యశాలి అయిన తల్లి యొక్క ధైర్యవంతుడైన కొడుకు రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌.