గ్రామీణ క్షేత్రానికి పెద్దపీట వేసిన తొలి బడ్జెట్‌

ఫిబ్రవరి 1వ తేదీ నాడు కేంద్ర ఆర్థిక మంత్రి 2గంటల ప్రసంగంతో 2017-18 సం|| బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ఉంచారు.ఆ బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎంతో ఆశపెట్టుకుని ఎదురుచూసారు. ఎందుకంటే పెద్దనోట్ల రద్దు తరువాత జరుగుతున్న పరిణామలను దృష్టిలో పెట్టుకుని ఎంతోకొంత మేలు తమకు జరిగే విధంగా ఉంటుందని ఆశిం చారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఆ ఆశలను నీరు గార్చకుండా చిగురింపచేసే విధంగానే బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ సారి ప్రతిపాదించిన బడ్జెట్‌ సంస్కరణల బడ్జెట్‌ అని అనవచ్చు. 
 
 
దేశ ఆర్థిక రంగాన్ని సరియైన గాడిలో తీసుకోవాడానికి గత సం|| (2016-17) బడ్జెట్‌ కొంత ప్రయత్నం చేయగా మరికొంత ప్రయత్నం ఈ సం|| (2017-18) బడ్జెట్‌లో మనకు కనబడుతుంది. బహుశా 2018-19 సం|| బడ్జెట్‌ వరకు దేశ ఆర్థిక వ్యవస్థ రూపరేఖలపై స్పష్టత వస్తుందని అనిపిస్తుంది. దానికి కొంత కారణం మారుతున్న పన్నుల చరిత్ర పరోక్ష పన్నులకు సంబంధించి విప్లవాత్మకమైనవిగా వస్తున్న జిఎస్‌టీ (వస్తు సేవల పన్ను) విధానం ఈ సంవత్సరం అమలులో రానున్నది. అది అమలులోకి వస్తే పన్నుల నొప్పి తెలియకుండానే ప్రజల నుంచి పన్నులను పిండి మరీ వసూలు చేయబడుతాయి. దాంతో ప్రభుత్వానికి సరైన ఆదాయం గట్టిగానే వచ్చెటట్లు ఉన్నవి. అందుకే ఈ సారి పన్నులకు సంబంధించిన మార్పులు ఎక్కడా చేయలేదు. ఈ విషయంలో రాబోవు బడ్జెట్‌లో స్పష్టత కనబడుతుంది. 'జిఎస్‌టి'ని పటిష్టంగా అమలు చేస్తూ దేశంలో క్రమంగా ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఎత్తివేసే దిశలో ముందుకు వెళ్లి దేశంలో ఇన్‌కమ్‌ట్యాక్స్‌ చెల్లింపు విషయంలో జరుగుతున్న అవకతవకలను తొలగిస్తారని మనం ఆశించవచ్చు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఒక సంస్కరణ బడ్జెట్‌ అని ప్రధాన బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను వీలినం చేయటం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను, క్యాపిటల్‌ రెవెన్యూ పద్దులగా మార్చడం విప్లవాత్మకం అని చెప్పవచ్చు. ఈ సారి బడ్జెట్‌లో దేశం ఆర్థికంగా ఎదగాలంటే ఉత్పత్తి రంగంలో మౌలిక వసతులను వికసింప చేసి పటిష్టం చేయటం, కావలసిన శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. దేశం ఎదగలంటే అట్లాగే చిన్న మధ్య తరహ పరిశ్రమలను స్థాపిస్తూ ప్రతిభ కలిగిన వారిని ఆ దిశలో ప్రొత్సహించటం ఎంతో అవసరం. అట్లాగే దేశంలో అన్ని రంగాలలో ఎవరికి వారు స్వతంత్రంగా ఎదిగేందుకు తగిన ప్రొత్సహం ఇవ్వటం ఆర్థిక పటిష్టతకు తొలి అడుగు అని చెప్పవచ్చు. అది రాబోవు సంవత్సరానికి మరింత స్పష్టంగా కనబడుతుందని ఆశిద్దాం. ఈ సంవత్సరం బడ్జెట్‌ 10అంశాల చుట్టూ తిరిగింది.
1. రైతులు 2. గ్రామీణ భారతం 3. యువత, 4. పేద,వెనుకబడిన వర్గాలు, 5. మౌలిక సదుపాయలు, 6. ఆర్థిక రంగం, 7.డిజిటల్‌ ఎకానమి, 8. పబ్లిక్‌ సర్వీస్‌ 9. పన్నుల నిర్వహణ, 10. రాజకీయ పార్టీల విరాళాల సంస్కరణ.
ఈ సారి బడ్జెట్‌ సేద్య అనుబంధ రంగాలకు గ్రామీణ అభివృద్ధికి గత సంవత్సరం కన్న 24% పెంచటం ఎంతో పేర్కొనదగినది. దాంతో వ్యవసాయ రంగానికి తగినంత ప్రాధాన్యత
ఇచ్చినట్టు స్పష్టమవుతున్నది. గ్రామీణ ప్రారతం కొలుకునేటందుకు మరిన్నీ చర్యలు, మరింత విశ్వా సం కలిగించటం ఎంతో అవసరం. భారత దేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. వ్యవసాయంతో ముడిపడి అనేక వృత్తులు ఉన్నాయి. అవన్నీ సరైన గాడిలో పడి ముందుకు పోతేనే గ్రామీణ క్షేత్రం బాగుపడుతుంది. ఒకప్పుడు పట్టణాలు, గ్రామీణ క్షేత్రంపై ఆదారపడి ఉండెవి. గ్రామాలు సర్వతంత్ర, స్వతంత్రంగా ఆర్థికంగా శక్తి కలిగి ఉండేవి. ఆ స్థితికి మళ్లీ చేరుకోవాలంటే గ్రామ స్వరాజ్యం రావాలని గాంధీజి ప్రకటించారు. కాని స్వతంత్య్రం వచ్చిన తరువాత అత్యంత నిర్లక్ష్యానికి గురైంది గ్రామీణక్షేత్రం. ఆ క్షేత్రాన్ని పటిష్టం చేయడానికి వ్యవసాయం దానితో ముడిపడి ఉండే వృత్తులకు పెద్దపీట వేసి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసిన అవసరం ఎంతో ఉన్నది. రాబోవు సంవత్సరంలో ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుకుందాం.నగదు రహిత భారత్‌కు ప్రొత్సహించే చర్యలు ఈసారి బడ్జెట్‌లో మనకు కనబడుతాయి. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నల్ల ధనాన్ని వేలికి తీయడం అక్రమ ధనాన్ని స్వాధీనం చేసుకోవాడానికి తగిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దానికి కొనసాగింపే ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన నగదు రహిత భారతం. ఈ సారి బడ్జెట్‌లో రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహరాలు సంస్కరణలకు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలకు తెరలేపింది. రాజకీయ పార్టీల విరాళాలపై పారదర్శకత సాధించాటానికి కొన్ని కఠిన చర్యలు ప్రవేశ పెట్టింది. ఏ పార్టీ అయినా 2000రూపాయల వరకు నగదు విరాళంగా తీసుకోవచ్చును. అంతకంటే ఎక్కువ అయితే చెక్కుల రూపంలో లేదా ఆన్‌లైన్‌ చెల్లింపులు ఉండవచ్చు. ఎవరైనా తమ పేరును, తమ సంస్థ పేరును వెల్లడించకుండా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలి అనుకుంటే 'ఆర్‌బీఐ' జారీ చేసే 'బెరర్‌ బాండ్‌'లను కొనుగోలు చేసి తమకు నచ్చిన పార్టీలకు ఇవ్వవచ్చు. ఈ దిశలో ఇది ఒక పెద్ద అడుగు అనవచ్చు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన అనేక సంస్థలకు విధించే పన్ను భారంపై ఈసారి బడ్జెట్‌లో స్పష్టీికరణ చేయటం ఒక పెద్ద విశేషం. ఈసారి బడ్జెట్‌లో విద్య, వ్యవసాయం, సామాజిక, రంగంలో ఎంతో ప్రాధాన్యత కనబడుతోంది. దేశాన్ని స్వచ్ఛ భారత్‌, నగదు రహిత భారత్‌, దోపీడీ విముక్తి భారత నిర్మాణం చేయాటానికి ఈ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నలు మెచ్చుకోదగినవే కాని దేశ ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యవంతంగా నైతికంగా ఉంచాలంటే వ్యసన ముక్తి భారత్‌ను నిర్మాణం చేయటం ఎంతో అవసరం. మద్యం, గుట్కా, తదితర వ్యసనాల నుంచి ప్రజలను తప్పించేందుకు చేయవలసిన కఠిన నిర్ణయాలు తీసుకుంటే దేశం సమగ్రంగా ఆరోగ్యవంతమైన భారత్‌గా నిర్మాణం అవుతుంది. ఆ దిశలో కేంద్రం రాబోయే రోజుల్లో బడ్జెట్‌ ప్రతిపాదించినప్పుడు సముచిత నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం.