జల్లికట్టు జగడం వెనుక దాగిన నిజాలు

ఇటీవల జలిలకట్టుపై పెద్ద జగడమే జరిగింది. పశుహింసను ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు గగ్గోలు పెడితే, గ్రామీణ సంస్కృతికి ఈ క్రీడ అద్దంపడుతుందని చాలామంది సమర్థించారు. సుప్రీంకోర్టు నిషేధాన్ని తొలగించి జల్లికట్టుకు అనుమతినివ్వాలని వేలాదిమంది ఉద్యమించారు. చివరికి కేంద్రం జోక్యంతో ఆర్డినెన్స్‌ ద్వారా జల్లికట్టు కథ సుఖాంతమైంది. కొన్ని వారాలపాటు దేశప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ మొత్తం ప్రహసనంలో కొన్ని ఆందోళన కలిగించే, ప్రమాదకర ధోరణులు కూడా బయటపడ్డాయి. 

వినాయక నిమజ్జనం, దీపావళి టపాకా యలు, రంగురంగుల హోళీ, కృష్ణాష్టమి ఉట్లు కొట్టే పండుగ, జల్లికట్టు...ఇలా పండుగ, ఉత్సవం ఏదైనా 'పర్యావరణ పరిరక్షకులు', 'మేధావులు', 'జంతు ప్రేమికులు' మాత్రం ఆగ్రహంతో ఊగిపోతారు. ఇవన్నీ పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఏర్పరచినవేనని, వాటి వల్ల నష్టమే తప్ప లాభమేమీ లేదని వాదిస్తారు. వాటిని పూర్తిగా నిషేధిస్తే తప్ప ఈ ప్రపంచం సుఖంగా, శాంతిగా బతకలేదని నొక్కి చెపుతారు. అందుకోసం ఊరేగింపులు, ఉద్యమాలు నిర్వహిస్తారు.