సహకార ఉద్యమం నేటి అవసరం

సహకారం అంటే కలిసి మెలసి పని చేయడం. మన దేశంలోని ఉమ్మడి కుటుంబాలు సహకారానికి చక్కని ఉదాహరణ. సహకారం అనగానే ఆర్థిక క్షేత్రంలో సహాయం చేసుకోవడం అనే అర్థం కూడా వస్తుంది. మనకు అవసరమైన వస్తువులన్నీ పరస్పర సహకారం ద్వారానే లభిస్తాయి. నేటి యుగంలో సహకారం, సహాయం లేకుండా ఏ పని ముందుకు సాగదు. మన ప్రగతి దీనిపైనే ఆధారపడి ఉంది. తోటివారి నుంచి సహాయం ఎలా తీసుకుంటామో అలాగే వారికి కూడా సహాయపడతాం. సహకారం ఒక ఆలోచనా పద్దతి, అలాగే విశిష్టమైన కార్యపద్దతి కూడా. సమాన అవసరాలు కలిగిన వ్యక్తులు సహకార భావనతో సమానత్వం, సామూహిక తత్వంతో కలిసి పనిచేస్తారు, అందుకు ప్రతిఫలాన్ని కూడా కలిసి పొందుతారు. 

సహకార సంస్థలు ఆమోదం పొందిన పద్దతులలో తమ సభ్యుల ద్వారా వారి అభివృద్ది కోసం నిరంతరం కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. సమాజానికిగానీ, సంస్థ సభ్యులకు గానీ నష్టం కలిగించే ఎలాంటి కార్యాన్ని అవి చేపట్టవు. ప్రతి ఏడాది వచ్చిన లాభాల్లో కొంత సమాజ కార్యానికి కేటాయించడమేకాక అందుకు తగిన కార్యక్రమాలు కూడా చేపట్టాలి. నేటి పరిస్థితుల్లో అభివృద్దిచెందు తున్న దేశాలతోపాటు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అనేక కుటుంబాలు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇది 1930నాటి నుంచి కనిపిస్తున్న చిత్రం. 2008 తరువాత దీని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా కనిపిస్తున్న ఆర్థిక అసంతులనం ఇందుకు ఉదాహరణ. ఒక వైపు సంపద, సంపన్నుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు పేదరికం, బీదవారి సంఖ్య కూడా పెరుగుతోంది. పేదవారు అలాగే ఉండిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 200 కోట్లు ఉంటే అందులో యువత సంఖ్య 40 కోట్లు ఉంటుంది. సహకార ఉద్యమం 200 సంవత్సరాల నుంచి సాగుతోంది. దీనివల్ల సత్పలితాలు రైతులు, శ్రామికులు, పేద వర్గాలలో బాగా కనిపిస్తున్నాయి.
సహకార విధానం వ్యక్తుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది. వ్యక్తుల మధ్య పరస్పర సహాయ సహకారాలను పెంపొందించే పద్ధతి ఇందులో ఉంది. ఉత్పత్తి వ్యవస్థ కానీ, మార్కెట్‌కానీ, సేవ లేదా ఆరోగ్య రంగంకానీ ఏ రంగమైనా అందులో సహకారతను పెంపొందించడానికి ప్రశిక్షణ కూడా ఇందులో లభిస్తుంది. మారుతున్న పరిస్థితుల్లో సహకార ఉద్యమం పెద్దగా ఫలితాలనివ్వలేదనే అపోహ ఉంది. కానీ ఈ భ్రమ తొలగిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే సహకార ఆధారిత స్వాభిమాన, సమైక్య, ఆర్థిక వికాసం సాధ్యపడుతుందని ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సహకార రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. 2008లో జరిగిన ఆర్థిక సర్వే ప్రకారం ఆర్థిక సమస్యలు, అసమానతలను తొలగించడంలో సహకార రంగం చూపుతున్న ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థ చూపలేకపోయిందని తేలింది. ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరమని స్పష్టమైంది. ఏదైనా ప్రజా సంస్థని తీసుకుంటే సహకార సంస్థలు ఆర్థిక సమానత, వికాసం తీసుకువచ్చినట్లు మరే సంస్థ చేయలేకపోయిందని తేలుతుంది.
సహకార పెట్టుబడి అంటే సామాజిక పెట్టుబడి అని, ఇది ఆర్థిక వ్యవస్థపై మరింత మంచి ప్రభావాన్ని చూపుతుందని నిపుణుల అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో సహకార పెట్టుబడి అవసరం చాలా ఉంది. కాబట్టి అటువంటి పెట్టుబడిని పెంచేందుకు సమాజాన్ని ప్రోత్సహించాలి. ఆర్థిక సమస్యలన్నింటికీ సహకార నమూనా మాత్రమే పరిష్కారం చూపగలుగుతుందని ప్రపంచానికి అనుభవపూర్వకంగా తెలుస్తోంది. త్వరిత, సమాన, వికేంద్రీకృత, స్వయంపోషక, స్నేహ, సహాయపూర్వక సహకారత మన దేశానికే కాక ప్రపంచం మొత్తంలో ఆర్థిక ప్రగతికి చాలా అవసరం. భారతదేశపు ఆర్థిక వికాసం కోసం ఇది నమూనా మాత్రమే కాక ఆదర్శ కార్యక్రమం కూడా అవుతుంది. అయితే సహకార పెట్టుబడి నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా ఆలోచించాలి. అలాగే విశిష్టమైన అకౌంటింగ్‌ పద్దతిని కూడా పాటించాలి. సహకారిత శిక్షణ సంస్థ, ప్రశిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం కూడా జరగాలి. సహకారాన్ని పెంపొందించడానికి తగిన ఆర్థిక వాతావరణాన్ని కూడా రూపొందించాలి.
నేడు ప్రపంచం ఆర్థిక చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. దారి కోసం వెతుకుతోంది. అమెరికా, యూరప్‌ ఆర్థిక సంక్షోభం మనను పెద్దగా ప్రభావితం చేయలేదు. అయితే పాశ్చాత్య ఆర్థిక విధానాలు ఏమాత్రం పనికిరావని, వాటిని తిరిగి అమలు చేయాలని చూస్తే ఈసారి మరింత పెద్ద సమస్య ఎదురవుతుందని స్పష్టమవుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరి కనీస అవసరాలు తీరాలి. అందులో ఎవరికీ, ఎలాంటి సందేహం ఉండదు, లేదు. ఈ విషయంలో ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ సంస్కృతి , సభ్యతల వైపు చూస్తోంది. - డా. యతీష్‌ జైన్‌