ఎం. సి. జయదేవ్‌ జీ

18, ఫిబ్రవరి 1932న జన్మించిన మైసూర్‌ చెన్నబసప్ప జయదేవ్‌ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత న్యాయవాద విద్య అభ్యసిస్తున్నప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్వయంసేవక్‌గా మారారు.
చదువు పూర్తయిన తరువాత జయదేవ్‌ బెంగళూరులోని ప్రముఖ హిందుస్థాన్‌ గ్యారేజ్‌ మోటార్స్‌లో కొన్ని సంవత్సరాలు పనిచేశారు. 1960లో బెంగళూరు మహానగర్‌ కార్యవాహగా బాధ్యతలు స్వీకరించిన జయదేవ్‌జీ 1975వరకూ చక్కగా నిర్వర్తించారు. బెంగళూరు మహానగర్‌లో ఎక్కువకాలం కార్యవాహ బాధ్యతలు నిర్వర్తించినవారిలో వారు కూడా ఒకరు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న జయదేవ్‌జీ జైలుశిక్ష అనుభవించారు. జ్యేష్ట ప్రచారక్‌ యాదవ్‌రావ్‌ జోషితోపాటు 1977లో జైలు నుండి విడుదలయ్యారు. 
కర్ణాటకలోనే ప్రముఖ సేవా సంస్థగా మన్ననలు పొందిన 'రాష్ట్రోత్థాన పరిషత్‌'కు 1965లో జయదేవ్‌జీ ఊపిరిపోశారు. వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ఆయన 31 ఏళ్ళపాటు ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ కాలంలోనే రాష్ట్రోత్థాన పరిషత్‌ విద్య, ఆర్యోగం, సాహిత్యం, సేవ మొదలైన అనేక రంగాల్లో ఎన్నో వినూత్నమైన ప్రాజెక్టులు చేపట్టింది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాలను వివరించే భారత - భారతి పుస్తక మాల ఆ ప్రాజెక్ట్‌ల్లో ఒకటి. ఈ పుస్తకమాల కన్నడ సాహిత్య రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది.
అలాగే రాష్ట్రోత్థాన పరిషత్‌ నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం రాష్ట్రంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటి. రాష్ట్రో త్థాన ప్రచురణ విభాగం కూడా రాష్ట్రంలోనేకాక జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించింది.
1995లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ అయినప్పటి నుండి జయదేవ్‌జీ వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో సహక్షేత్ర ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన 2004లో క్షేత్ర (కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలు) ప్రచారక్‌ అయ్యారు. 2012లో అఖిలభారత కార్యకారిణి సభ్యుల య్యారు. గిరిజనల సంక్షేమం కోసం పనిచేసే వనవాసీ కళ్యాణాశ్రమ వంటి సామాజిక సంస్థలకు జయదేవ్‌జీ మార్గదర్శనం లభించింది. మిథిక్‌ సొసైటీ, అనాథ శిశు నివాస, ఆబాలాశ్రమ, గోఖలే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ మొదలైన సంస్థల్లో ఆయన చురుకుగా పాల్గొ న్నారు. అత్యంత కార్యనిర్వహణ కుశలత కలిగిన జయదేవ్‌జీ సామాజిక సేవ, విద్య, రాజకీయ, సినిమా, వ్యాపార, ఆరోగ్య, సాహిత్య రంగాల్లో అనేక మంది ప్రముఖులతో కలిసి పనిచేశారు.