భారతీయ విలువలతోనే అభివృద్ధి

ఈ దేశాన్ని తిరిగి వైభవోపేతం చేయాలంటే అసలు దీని మూల తత్వాన్ని తెలుసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ మోహన్‌భాగవత్‌ అన్నారు. భావూసాహెబ్‌ భుస్కుటే ప్రజా ట్రస్ట్‌ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌ భాగవత్‌ దేశమంటే ప్రజలు, నీటి వనరులు, అడవులు, భూమి, జంతువులు మొదలైనవని, ఇవన్నీ సక్రమంగా, సురక్షితంగా ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. 
అయితే ఆ అభివృద్ధి కూడా దేశపు మూల తత్వం, సంస్కృతికి అనుగుణంగా ఉండాలని, అదే నిజమైన అభివృద్ధి అని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశపు సంస్కృతి నీరు, అడవుల చుట్టూ అల్లుకుందని, ఈ దేశపు మూలాలు గ్రామాల్లో ఉన్నాయని కనుక నీటి వనురులు, ఆడవులు, గ్రామాల్ని అభివృద్ధి చేసుకుంటే దేశం ప్రగతి సాధిస్తుందని మోహన్‌భాగవత్‌ అన్నారు. వ్యవసాయాభివృద్ధి అవసరాన్ని గురించి మాట్లాడుతూ మన వ్యక్తిగత జీవితాల్లో 'యమ', 'నియమాల'ను పాటించినట్లే వ్యవసాయ రంగంలో కూడా ఐదు సూత్రాల్ని పాటించాలని మోహన్‌జీ సూచించారు. పరిశుభ్రత, సంతృప్తి, సత్ప్రవర్తన, స్వాధ్యాయం, తపస్సు అనే ఐదు పాటించాలన్నారు.
పరిశుభ్రత అంటే గ్రామాన్ని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. వ్యవసాయంలో నూతన పద్ధతులు, సాంకేతిక విధానాలు, భారతీయ పద్ధతులను తెలుసుకుని ఉపయోగించడమే స్వాధ్యాయం. రైతు తన భూమిని దైవంగా పూజించాలి. అదే తపస్సు. వీటన్నింటినీ సంతృప్తి కరమైన, నిండైన మనస్సుతో చేయాలి.
అభివృద్ధి పేరుతో అరణ్యాల నరికివేత, జల వనరులు, వాతావరణ కాలుష్యం జరుగుతోందని, దానిని అరికట్టాలని మోహన్‌జీ అన్నారు. భారతీయ విలువలే ఈ సమస్యకు పరిష్కారమన్నారు. ఎందుకంటే భారతీయ విలువల ప్రకారం అభివృద్ది అంటే ఎవరికీ హాని చేయనిది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో భూమికి ఏమాత్రం హాని జరగదు.