ప్రతిక్రియాత్మక జాతీయ వాదానికి తెరలేపుతున్న పాశ్చాత్య దేశాలు

వలసల దేశమైన అమెరికాలో అక్రమవలసలు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్రమ వలస దారులను తిరిగివాళ్ళ దేశాలకు పంపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంపు ధృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా కనబడుతున్నది. అమెరికా అమెరికన్లదే అనే నినాదం అమెరికాలో జోరుగా విస్తరిస్తున్నది. దానితో ఉన్మాద చర్యలు కూడా ప్రారంభమైనాయి. గత వారం అమెరికా కాన్సాస్‌ నగర శివారు ఓలత్‌ లోని బార్‌లో శ్రీనివాస్‌ కూచిభొట్లను చంపిన విష యాన్ని పత్రికలలో చూశాం. ఎట్టకేలకు దానిని విద్వేష నేరంగానే పరిగణిస్తూ దర్యాప్తులు జరుపుతున్నట్లు ఎఫ్‌.బి.ఐ. ప్రకటించింది.

 అమెరికా అధ్యక్షుడు ఎట్టకేలకు కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో నోరు తెరచి ''ఇటీవల యూదుల సామాజిక కేంద్రాలు; సమాధులపై దాడు లు జరిగాయి. గత వారం తెలుగు ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్‌పై కాల్పులు విద్వేష పూరితమైనవి. విద్వేషం, దుర్మార్గం ఏ రూపంలో ఉన్నా ముక్త కంఠంతో ఖండించాలి'' అన్నారు. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత అమెరికా ప్రభుత్వం పైనే ఉంది. ట్రంపు ఆలోచనా విధానాలపై జరుగుతున్న ప్రచారం చివరకు జాతుల మధ్య విభేదాలు, విద్వేషాలు నిర్మాణం చేస్తాయా? ఇటువంటి పరిస్థితులవల్ల చాలా చిక్కు సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంపు ఆచితూచి వ్యవహరించవలసి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. 9.4 కోట్ల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లేవని, 4.3 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మ్రగ్గుతున్నారని ట్రంపు చెప్పారు. ఈ పరిస్థితులు చక్కదిద్దే చర్యలు తీసుకుంటానని అన్నారు. ఒకప్రక్క అమెరికాలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటుంటే మరోప్రక్క పాశ్చాత్య దేశాలైన ఇంగ్లండు, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలలో ట్రంపు విధానాలను అనుసరించే సూచనలు కనబడుతున్నాయి. దానికి రెండు ప్రధాన కారణాలు. 1. ప్రపంచీకరణ దుష్పలితాలు, దానిలో క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు. 2. ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదం సృష్టిస్తున్న బీభత్సం. ఈ రెండింటి ప్రభావంతో ఆ దేశాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా ముస్లింలు విపరీతంగా వలస పోతున్నారు. ఈ వలసలతో ఇరు ఆ దేశాలను ముంచెత్తుతున్నారు. దానితో ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లండు దేశాలలో జనాభాలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం పొంచిఉన్నది. దానితో అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. దానితో ఆయా దేశాలు ఆత్మరక్షణలోపడి ప్రతిక్రియాత్మక జాతీయవాదానికి తెరలేపుతున్నాయి. దాని పరిణామాలు తీవ్రంగానే ఉండేట్లుగా కనబడు తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పాశ్చాత్య దేశాలైన ఇంగ్లండు, ఫ్రాన్స్‌, జర్మనీలలో ఈ మధ్యనే ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగుల లేమి కనబడుతున్నది. దానిని ఆసరాగా తీసుకొని అమెరికా బాటలో ఆ దేశాలు కూడా నడిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచీకరణ, ఇస్లామిక్‌ సామ్రాజ్య వాదం. ఐరోపా యూనియన్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో ప్రచారం జోరు అందుకున్నది. జర్మనీ లోనైతే ఆల్టర్‌నేటర్‌ ఫర్‌ జర్మనీ అనే పార్టీ ప్రారంభమై ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఐరోపా యూనియన్‌ను, యూరో కరెన్సీని వ్యతిరేకించడం, గ్రీసు దేశానికి సహాయం అందించరాదని, శరణార్థులను తమ దేశంలోకి రానివ్వరాదని ఆ పార్టీ ప్రజలలో ప్రచారం చేస్తున్నది. ఇంగ్లండు, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలలో ముస్లిం జనాభా కూడా విపరీతంగా పెరుగుతున్నది. ఐరోపా ఖండంలో 1990 సం.ముస్లిం జనాభా 4% ఉంటే 2010 నాటికి అది 6% పెరిగింది.
2030 నాటికి 8% చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్‌ దేశంలో ఈ రోజున 47 లక్షల మంది ముస్లింలు ఉన్నారని అంచనా. అది ఆ దేశ జనాభాలో 7.5%. ఇట్లా సమస్యలు తలెత్తేవిధంగా తమ జాతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారు. జాతుల మధ్య విద్వేషం నిర్మాణమయ్యే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి ఆందోళనకర పరిణామాలు.
పాశ్చాత్య దేశాలకు, అమెరికాకు ముస్లింలతో ఏ సమస్యలు ఉంటాయో ఇప్పుడిప్పుడే అర్థమవు తున్నట్లుగా కనపడుతున్నది. ఈ సమస్యను భారత్‌ వందల సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నది. అప్పుడ ప్పుడు భారత్‌తో జరిగే గొడవలను ఆసరాగా తీసు కొని భారత్‌లో హిందూ మతతత్త్వశక్తులు బలపడు తున్నాయని, ముస్లింలను అణచివేస్తున్నాయని ప్రచారం చేసేవారు. ఉగ్రవాద తండాలకు శిక్షణ ఇస్తే వాళ్ళు దాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌కు వత్తాసు పలికేవారు. ఇప్పుడు సమస్య వాళ్ళవరకు వచ్చేసరికి మాటల ధోరణి మారిపోతున్నది. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పాశ్చాత్య దేశాలకే కాదు, ప్రపంచం మొత్తానికి సంబంధించిన సమస్య అని గుర్తించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పని చేయాలి. అంతేకాదు, జాత్యహంకారాన్ని రెచ్చగొట్టి సమస్యలను మరింత జటిలం చేయరాదు. ఈ పరిణామాలు భారతదేశానికి కూడా ఒక గుణపాఠం. ఈ సమయంలో భారత్‌తో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది.