ఇక విజయమే విజయం...

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌కార్యవాహ (జనరల్‌ సెక్రెటరీ) శ్రీ సురేష్‌జీ (భయ్యాజీ) జోషి స్వాగతోపన్యాసంతో అఖిలభారతీయ ప్రతినిధి సభ ప్రారంభమైంది. సభ మాతా అమృతానందమయి, ఇతర స్వామీజీలకు శ్రద్ధాపూర్వక ప్రణామాలు సమర్పించింది.
సర్‌కార్యవాహ వార్షిక నివేదిక సమర్పిం చారు. ఇటీవల దివంగతులైన జ్యేష్ట కార్య కర్తలకు నివాళులతో నివేదిక ప్రారంభ మైంది. పూర్వం అఖిలభారత సేవాప్రముఖ్‌ గా ఉన్న శ్రీ సూర్యనారాయణ రావుకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే దక్షిణ - పూర్వ క్షేత్ర ప్రచారక్‌గా పనిచేసిన, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్‌లలో సంఘకార్యాన్ని విస్తరింపచేసిన శ్రీ రాంభావు హల్దేకర్‌కి కూడా నివాళులర్పించారు. కేరళలో కమ్యూనిస్టు హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. సరిహద్దు ఘర్షణల్లో ప్రాణత్యాగం చేసినవారికి, రాజకీయ దాడుల్లో చనిపోయినవారికి కూడా అ.భా.ప్ర.స నివాళులర్పించింది.
 కార్యస్థితి
శిక్షణ కార్యక్రమాలు : సంఘ శిక్షావర్గ 93 స్థలాల్లో జరిగింది. వీటిలో మొత్తం 2621 మంది పాల్గొని శిక్షణ పొందారు. అలాగే 1059 ప్రాథమిక శిక్షావర్గలు జరిగాయి. ఈ ఏడురోజుల శిక్షణ కార్యక్రమంలో 1,04,256 మంది స్వయంసేవకులు శిక్షణ పొందారు.
శాఖల నివేదిక : 5-6 సంవత్సరాలుగా దేశమంతటా సంఘశాఖల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం శాఖల సంఖ్య 57233కు చేరుకుంది. ఇవి 36693 స్థలాల్లో నడుస్తున్నాయి. సాప్తాహిక్‌ మిలన్‌ (వారానికి ఒకసారి), సంఘ మండలి కూడా కలుపుకుంటే మొత్తం 59136 స్థలాల్లో సంఘ పని జరుగుతోంది. తెలంగాణాలో 1495 స్థలాల్లో 2302 శాఖలు, 370 సాప్తాహిక్‌ మిలన్‌లు జరుగుతున్నాయి.
సేవా కార్యక్రమాలు ః దేశ వ్యాప్తంగా స్వయంసేవకులు 1,70,700 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణాలు 1108 కార్యక్రమాలు జరుగుతున్నాయి.
గత సంవత్సరపు విశేషాలు :
సామాజిక సమరసత ప్రయత్నాలు
హిందువులందరికీ దేవాలయ ప్రవేశం, ఒకే స్మశానం, ఒకేచోట నీరు పట్టుకునే వ్యవస్థ ఉండేట్లుగా ప్రయత్నించాలని 2015 విజయదశమి సందేశంలో సర్‌ సంఘచాలక్‌జీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందు కు అనుగుణంగా తెలంగాణాలో కార్యకర్తలు 10 జిల్లాల్లో విస్తృత సర్వే చేపట్టారు. 527గ్రామాల్లో సర్వే పూర్తి చేసి వివరాలు నమోదు చేశారు. ఇప్ప టికీ వివక్ష ఉన్నటువంటి గ్రామాల్లో సమస్యని పరిష్క రించే దిశగా గ్రామపెద్దలతో మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో కొందరు సామూహిక స్మశానవాటిక కోసం తమ భూముల్ని కూడా ఇవ్వడం విశేషం. అయితే ఈ విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.
- మధ్యభారత్‌లోని మురైనాలో సమరసత కార్యశాలలు (వర్క్‌షాప్‌) నిర్వహించారు.
వీటిలో 333 గ్రామాలకు చెందిన 3623మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే 99 నగర మురికివాడలకు చెందిన 1706మంది కార్యకర్తలు కూడా అసమానతలు, వివక్ష తొలగించి సామాజిక సమరసత సాధించేందుకు కృషి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో : రాష్ట్రంలోని అన్ని మురికివాడల్లో సంఘ శాఖలు ప్రారంభించ డానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రస్తుతం 851 వాడల్లో 602 శాఖలు నడుస్తున్నాయి. అలాగే ఎస్‌సి, ఎస్టీ విద్యార్థులకు చెందిన 400 హాస్టళ్ళలో సర్వే కూడా చేశారు.
మహాకోసల సామాజిక సమరసత సమ్మేళనం : జనవరి, 2017లో వివిధ ప్రదేశాల్లో సమ్మేళనాలు జరిగాయి. 180 బ్లాక్‌లకు చెందిన 4157 గ్రామాల నుంచి 5500 మహిళలు, 1,35,700 పురుషులు ఈ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. సమ్మేళనాల్లో 80 సామాజిక కులాలు, వర్గాలకు చెందిన వారితోపాటు 470మంది సాధువులు కూడా ఉన్నారు.
బేతుల్‌లో విరాట్‌ హిందూ సమ్మేళనం
మధ్యభారత్‌లోని బేతుల్‌ జిల్లా గిరిజన ప్రాంతం. ఇందులో ప్రజలు అనేక సవాళ్ళు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్ళను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని
స్థానికుల్లో కలిగించేందుకు విరాట్‌ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది.
సమ్మేళనానికి ముందు జలసంరక్షణ, గ్రామాలలో పరిశుభ్రత, సమరసతా సమావేశాలు, ఆరోగ్య శిబిరాలు, గోపూజ, యువసమ్మేళనాలు మొదలైనవి నిర్వహించారు. జిల్లా మొత్తం నుంచి 1,00,000 మంది విరాట్‌ హిందూ సమ్మేళనంలో పాల్గొన్నారు.
గ్రామ సంగమం : ఉజ్జయినిలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్‌సంఘచాలక్‌జీ పాల్గొన్నారు. సమ్మేళనంలో పాల్గొనేందుకు గ్రామాలకు ఐదు రకాల అర్హతలు నిర్ణయించడం జరిగింది. జైవిక వ్యవసాయం, పశుపోషణ, సామాజిక సమరసత, పరిశుభ్రత, మద్యనిషేధం వంటి ఐదు అంశాల్లో కార్యక్రమాల్ని చేపట్టిన గ్రామాల ఎంపిక జరిగింది. అలా ఎంపికైన 609 గ్రామాలకు చెందిన ప్రతినిధులు సమ్మేళనంలో పాల్గొన్నారు.
నిర్మల్‌ వారీ : మహారాష్ట్రలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వేలాదిమంది భక్తులు పండరిపూర్‌కు వస్తుంటారు. దీనితో అక్కడ పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించం కోసం ఈసారి స్వయంసేవకులు, స్థానికులు, పాలనాయంత్రాంగం సహాయంతో 8లక్షల భక్తులకు సరిపోయే విధంగా 700 మరుగుదొడ్లను నిర్మించారు. 15రోజులపాటు జరిగిన నిర్మాణ కార్యక్రమంలో 375మంది స్వయంసేవకులు కూడా పాల్గొన్నారు. స్వయంసేవకులు తీసుకున్న చొరవను గ్రామస్థులేకాక, భక్తులు కూడా ప్రశంసించారు.
సామాజిక రక్షాబంధన్‌ కార్యక్రమం
రక్షాబంధన్‌ ఉత్సవ సందర్భంగా పూనాలో స్వయంసేవకులు 45 టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాన్ని సేకరించారు. మొత్తం 217 సేకరణ కేంద్రాల ద్వారా 60 సామాజిక సంస్థలు, 15000మంది కార్యకర్తలు ఈ వ్యర్థాన్ని సేకరించారు.
ఆందోళన కలిగించే అంశాలు
హింస ద్వారా హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు దేశంలో ఎక్కువయ్యాయని అఖిలభారతీయ ప్రతినిధి సభ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇతర సిద్ధాంతాలకు చెందిన వారు రాజకీయ హింసకు పాల్పడుతున్నారు. కొన్ని సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
చాలా ఏళ్ళుగా వామపక్ష హింసతో అట్టుడికిన పశ్చిమబెంగాల్‌లో వామప్షపార్టీలు అధికారం కోల్పోయిన తరువాత మంచి మార్పు వస్తుందని అంతా ఆశించారు. కానీ ప్రభుత్వం మారిన తరువాత హిందూ సమాజంపై దాడులు పెరిగాయి. అధికారంలో ఉన్నవారు అనుసరిస్తున్న ముస్లిం సంతుష్టీకరణ, పాలనా యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించడంవల్ల ప్రజలకు మళ్ళీ పాతరోజులు గుర్తుకువస్తున్నాయి. అధికారపక్ష శాసన సభ్యుల పాత్ర, వ్యవహారశైలి సందేహాస్పదంగా ఉంది.
కేరళలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వామపక్ష ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జాతీయవాద సంస్థలపై దాడులు పెరిగిపోయాయి. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, యువత అని చూడకుండా అందరిపై అమానుషమైన దాడులు జరుగుతున్నాయి. పంటలు తగులబెట్టడం, పరిశ్రమలు, ఇళ్ళు ధ్వంసం చేయడం నిత్యకృత్యాల య్యాయి. కేరళలో సిపిఎం హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా జరిగిన 583 కార్యక్రమాల్లో 3.7 లక్షలమంది పాల్గొన్నారు. వారిలో 3,700మంది మహిళలు ఉన్నారు.రెండు రాష్ట్రప్రభుత్వాలు తక్షణమే ఈ దాడుల్ని ఆపేందుకు కఠినమైన చర్యలు చేపట్టాలి. శాంతి, సామరస్యం నెలకొనేవిధంగా చూడాలి.
ప్రశంస
తీవ్రవాదుల ఏరివేత కోసం సైన్యం నిర్వహించిన మెరుపుదాడులు భారత ప్రభుత్వపు దృఢ వైఖరిని తెలుపుతున్నాయి. అలాగే ప్రభుత్వం నకిలీ నోట్లు, నల్లధనాన్ని నిరోధించేందుకై అమలు చేసిన నోట్ల రద్దు వల్ల కొంత ఇబ్బంది కలిగినా సహనంతో భరించిన ప్రజల ధోరణిని అఖిలభారతీయ ప్రతినిధి సభ ప్రశంసిస్తోంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో సామర్ధ్యాన్ని కూడా ప్రశంసిస్తోంది. సామాజిక జీవనంలో కష్టనష్టాలు, ఎగుడు దిగుళ్ళు తప్పవు. కానీ వీటన్నింటినీ తట్టుకుని దృఢనిశ్చయంతో ముందుకుసాగి విజయం సాధించగలమనే నమ్మకం పుష్కలంగా ఉంది.