శ్రీరామనవమి

శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధనవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నం అభిజిత్‌ ముహూర్తంలో మధ్యాహ్నం 12గం||ల వేళ త్రేతాయుగంలో జన్మించాడు. పదునాలుగు సంవ త్సరాల అరణ్యవాసం, రావణ సంహారంతర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్త్తుడైనాడు. ఈ సంఘటన రోజునే (చైత్ర శుద్ధ నవమి) రాముల కళ్యాణం కూడా జరిగింది. దేశంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖసంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల నమ్మకం. మహాత్మాగాంధీ కూడా స్వాతంత్య్రానంతరం భారతదేశంలో రామరాజ్యంగా విలసిల్లాలని భావించారు.

 శ్రీరామ నవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన వంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు.
శ్రీరాముని చరిత్ర అయిన రామయణం భారతీయ వాజ్మయంలో ఆది కావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి ఆదికవిగాను సుప్రసిద్ధులు. అన్ని భారతీయ భాషలలో, అన్ని ప్రాంతాలలో ఈ కావ్యం చాలా ఆదరణీయం. ఇండోనేషియా, థాయ్‌ లాండ్‌, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్‌ దేశాలలో కూడా రామయణగాధ ప్రచారంలో ఉంది.
24000 శ్లోకములతో కూడిన రామయణంలో తండ్రి కొడుకులు, భార్య భర్తలు, అన్నదమ్ములు, యజమాని, సేవకులు, మిత్రులు, రాజ్యప్రజల మధ్య ఆదర్శవంతమైన సంబంధాలను శ్రీరాముడు ఆచరించి చూపించాడు. శ్రీరామనవమి సందర్భంగా ఇళ్లలో, దేవాలయంలో సీతరాముల విగ్రహలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుం టారు. బెల్లం మరియు మిరియాలతో తయారు చేసిన పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.