అఖిలభారతీయ ప్రతినిధి సభలో పూజ్య అమ్మ ప్రసంగం.. సంక్షిప్తంగా..

ఈ మహా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోకరమైన విషయం. మొట్టమొదటగా మీ అందరితో వ్యక్తిగతంగా కలిసి, కొద్ది సమయం గడపగలిగినందుకు అమ్మ ఆనందంతోపాటు కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎందుకంటే ఏ భారతమాత ఒడిలో సనాతన హిందూ ధర్మం వర్థిల్లుతోందో ఆ తల్లి సేవలో మీరంతా నిరంతరం నిమగ్నమై ఉంటారు. భరతభూమి ఆధ్యాత్మిక భూమి. 'వసుధైవకుటుంబకం' (వసుథ అంతా ఒక కుటుంబం) అనే ఉపదేశాన్ని ఇచ్చింది. 
ఆధ్యాత్మిక సంస్కృతికి చెందిన ఉన్నతమైన మంత్రం ఈ భూమి నుంచే పుట్టింది. ఇది ఎంతటి ప్రేరణదాయి, జ్ఞానభూమి అంటే సమస్త ప్రపంచపు కళ్ళను తెరిపించింది. ఆ ఉజ్వల ప్రకాశం ఎప్పుడైతే మనందరి మనస్సులకు వ్యాపిస్తుందో అప్పుడు భారత్‌ జాగృతమవుతుంది. ఎప్పుడు భారత్‌ జాగృతమవుతుందో అప్పుడు విశ్వం జాగృతమవుతుంది. ఎందుకంటే భారత్‌ అంటే కేవలం ఒక భూభాగం కాదు. దీని ఆత్మ, శక్తి, ప్రతిభ ఎంత గొప్పవంటే దీనికి సరిసమానమైన భూమి మరొకటి లేదు. సర్వవ్యాపి అయిన పరమాత్ముని అపరోక్ష అనుభూతిని పొందిన ఋషుల సంకల్పశక్తి కూడా ఈ భూమికి లభించింది. ఆ సంకల్పం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు సర్వ ప్రపంచం నుంచి మనకు సహాయం అందుతుంది. కానీ అలాగని మనం నిర్లక్ష్యంగా, నిర్లిప్త వైఖరితో వ్యవహరించకూడదు. నిత్యజాగరూకులమై పని చేస్తూ ఉండాలి.