కాశ్మీర్‌లో రాళ్ళు విసిరేది కిరాయి మూకలే

జమ్ము-కాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని ఒక గుర్తు తెలియని చోటు రాళ్ళు విసిరే కిరాయి మూకలు ఒక పత్రికా విలేకరితో ముఖా ముఖి సంభాషణ జరిపారు. హిజ్‌బుల్‌ తీవ్రవాద నేత బుర్హాన్‌ వాని మరణం తరువాత జరిగిన అల్లర్లు, అశాంతి వెనుక ఎవరున్నారన్న వాస్తవాలపై భయంకరమైన సత్యం ఆ సంభాషణలో బయటపడింది. 
జాకీర్‌ అహ్మద్‌ భట్‌, ఫరూక్‌ అహ్మద్‌ లోన్‌, వాసిమ్‌ అహ్మద్‌ ఖాన్‌, ముస్తాఖ్‌ వీరి మరియు ఇబ్రహీం ఖాన్‌ కొన్ని సంచలన విషయాలను ఒప్పుకున్నారు. ఈ పనులు చెయ్యడానికి వాళ్ళకి వాళ్ళ నాయకులు జీతాలు ఇవ్వడం, భద్రతా దళాలు , అధికారులపై, పలు ప్రాంతాలలో ఆస్తులపై వీళ్ళు జరిపిన భయం కరమైన దాడులు మొదలైన విషయాలను చెప్పారు. భద్రతాదళాలపై దాడులు చెయ్యడానికి ఏమైనా డబ్బులు చెల్లించారా అన్న ప్రశ్నకు భట్‌ ''నెలకి 5,000/- నుండి 7,000 వేతనం, కొన్ని సార్లు షూస్‌'' అంటూ సమాధానమిచ్చాడు. పెట్రోల్‌ బాంబులు తయారీ చెయ్యడంలో భట్‌ సిద్ధహస్తుడు. గత సంవత్సరంలో జరిగిన పలు రాళ్ళు రువ్వే నిరసనలలో భట్‌ నిందితుడు కూడా. భద్రతా దళాలపై దాడులు చెయ్యడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న విషయంపై మాట్లాడేటపుడు ఎలాంటి అపరాధభావం లేదన్నట్టు నిస్సంకోచంగా మాట్లాడాడు. ''మేము జమ్ము-కాశ్మీర్‌ రక్షణదళాలు, ఎంఎల్‌ఏలు, ప్రభుత్వ వాహనాలపై రాళ్ళు విసురుతాము.'' కానీ తనకి డబ్బులు సమకూర్చే వ్యక్తుల వివరాలు బహిర్గతపర్చడానికి మాత్రం నిరాకరించాడు. ''మేము చావడానికి అయినా సిద్ధం కాని వాళ్ళ పేర్లు చెప్పం. ఇది మా జీవన భ్రుతి సమస్య'' అని పేర్కొన్నాడు.