హద్దు మీరిన చైనా - సరిహద్దు దాటిన నిర్ణయాలు

మొదటినుంచీ అరుణాచల్‌ప్రదేశ్‌పై కన్నేసిన చైనా.. కొత్త కొత్త వ్యూహాలకు తెరతీస్తోంది. కొద్ది కాలంగా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. భారత్‌అభ్యంతరాలను తోసిరాజని కవ్వింపు చర్యల కు పాల్పడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ తమ దేశంలోని దక్షిణ టిబెట్‌లో భాగమని పాతపాటే పాడుతోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు కీలక ప్రాంతాల పేర్లను ఏకపక్షంగా మార్చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల పేర్లను మార్చేసింది డ్రాగన్‌ కంట్రీ చైనా. దలైలా మా, టిబెట్‌ప్రజలతో అనుబంధం ఉన్న ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. 
ఇవన్నీ వ్యూహాత్మక కీలక ప్రదేశాలు. మత్స్య పరిశ్రమ, వ్యవసాయం, జలవిద్యుత్‌కు చాలా అనుకూలమైన ప్రాంతాలు. పచ్చగా ఉండే అరుణాచల్‌ధాన్యాగారం లాంటిదని చైనా మేధావులు భావిస్తూ ఉంటారు. టిబెట్‌లోని విద్యుత్‌, ఆహార సమస్యలను ఈ ప్రాంతం తీర్చు తుందని డ్రాగన్‌కంట్రీ లెక్కలేసుకుంటోంది. 1980 నుంచి ఈ కోణంలో బాగా ద ష్టిపెట్టారు. ఇటీవల బౌద్ధ మతగురువు దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ను సందర్శించడంపై అసం తప్తిని భారత్‌కు తెలియజేయడానికే పేర్లు మార్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
తవాంగ్‌శివారులో ఉన్న గులింగ్‌గొంపా అనే ప్రాంతానికి వొగ్యయిన్‌లింగ్‌ అనే పేరు పెట్టింది చైనా. ఇది ఆరో దలైలామా జన్మస్థలం. ఎగువ సుబన్సిరి జిల్లాలోని దపొరిజో పట్టణాన్ని మిల-రిగా మార్చింది. సుబన్సిరి నది పక్కన ఈ పట్టణం ఉంది. బ్రహ్మపుత్రకు ఉపనది అయిన సుబన్సిరి అరుణాచల్‌లో ప్రముఖ నది. టిబెటన్లు భారతదేశానికి రావాలంటే తొలుత ఈ పట్టణంలోనే అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ఏళ్లపాటు ఇరుదేశాలూ సైన్యాలను మోహరించలేదు.
భారత ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి మెచుకా అనే ప్రాంతం పేరును మైన్‌క్యూకాగా మార్చింది. పశ్చిమ సియాంగ్‌జిల్లాలో ఉన్న ఈ పట్టణం చాలా వ్యూహాత్మక ప్రదేశం. భారీగా సైన్య బలగాలు ఉన్నాయిక్కడ. భారత వాయుసేన ఇక్కడ అడ్వాన్స్‌డ్‌ల్యాండింగ్‌గ్రౌండ్‌ను నిర్వహిస్తోంది. బుమ్లా అనే ప్రాంతాన్ని బుమోలాగా మార్చేసింది చైనా. ఈ పట్టణం నుంచే దలైలామా తన పర్యటన ప్రారంభించారు. 1962లో చైనా బలగాలు దీనిని ఆక్రమించుకోగా భారత దళాలు వారిని తరిమికొట్టాయి. నమక చు అనే ప్రాంతాన్ని నమ్కాపుబ్‌-రి గా మార్చింది చైనా. ఇక్కడ జలవిద్యుత్‌శక్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. కియోడెంగార్బో-రిగా మరో ప్రాంతం పేరునూ మార్చేసింది.
అయితే.. అరుణాచల్‌ ప్రదేశ్‌తమ దేశంలో అంతర్గత భాగమని, దీన్ని ఎవరూ వేరు చేయలేరని భారత్‌ స్పష్టం చేసింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చైనాకు సూచించింది. చైనా వ్యవహారాల్లో తమ దేశం తలదూర్చడం లేదని, అలాగే చైనా కూడా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు దలైలామా పర్యటన సందఠంగా చెప్పారు. మరోవైపు.. ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రం ఆధారంగా చైనా విషయంలో మనమూ అలాగే చేయాలనేది విదేశీవ్యవహారాల నిపుణుల వాదన. ఇతర దేశాల ప్రాంతాలను తమవని చెప్పుకోవడానికి చైనా ఇలా పేర్లను మార్చుతూ ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలోని దీవులకు కూడా ఇలాగే పేర్లుపెట్టింది. దీనికి ప్రతిగా చైనా ఆక్రమణలో ఉన్న ఆక్సాయిచిన్‌, మానస సరోవర్‌లోని ప్రాంతాలకు కూడా చైనా పెట్టిన పేర్లను మార్చితే బాగుంటుదని సూచిస్తున్నారు.
- హంసిని సహస్ర సాత్విక