ఉదారవాద మేధావుల భేద తంత్రాన్ని వమ్ము చేయాలి

ఈ మధ్య కాలంలో గోరక్షకుల పేరుతో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని దేశమంతా మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, హిందువులు ఉన్మాదులుగా మారుతున్నారని కొందరు మేధావులు పని గట్టుకొని దేశ విదేశాలలో ప్రచారం చేస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలను ఆసరాగా చేసుకుని ఉదారవాద మేధావులు హిందుమతోన్మాదులు దేశమంతా యోజనాబద్ధంగా దాడులు చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపిస్తున్నదని, ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే మైనార్టీలపై దాడులు, హిందూ మతోన్మాదం అని పదే పదే ప్రచారం చేస్తున్నారు. 
వారికి హిందుత్వంపై ప్రచారం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్‌ బాధ్యతలు స్వీకరించటం కూడా సాకుగా దొరికింది. ఆత్మహత్యా సదృశంగా వ్యవహరిస్తున్న ఈ ఉదారవాద మేధావులు ఎవరి మేలు కోరి ఈ పనులు చేస్తున్నారు? వారి ప్రచారం కారణంగా మేలు ఎవరికి జరుగుతోందో తెలియదుగాని పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో ఉండేవారికి భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదని, వాళ్లపై దాడులు జరుగుతున్నాయని, వారిని రక్షించాలని, ఆ దాడులకు హిందుత్వమే కారణమని వ్యాసాలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్‌ వాళ్లకైతే ఈ మేధావుల పోకడ చాలా సంబరంగా ఉంది. ఎందుకంటే తాము గాలిలో చేస్తున్న దుష్ప్రచారానికి అడుగడుగున బలం చేకూర్చేందుకు ఈ మేధావుల ప్రచారాన్ని చూపించి తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇదంతా ఈ దేశ గౌరవాలకు భంగం కలిగించే ప్రయత్నం. వాస్తవంగా ఏం జరుగుతుందో అందరికి తెలుసు.
యోగి ఆదిత్యనాధ్‌ అధికారం స్వీకరించిన వెంటనే కబేళాలపై దాడులు ప్రారంభమైనాయని, భారత్‌లో ముస్లింలు అధికంగా నివాసించే ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఈ దాడులు నిజంగా మైనార్టీలపై దాడులని అంటున్నారు. కబేళాలు నడిపించే వారిలో అత్యధికులు ముస్లింలు. అందుకే వారిని వేధించే ప్రయత్నం చేస్తున్నారు. లైసెన్సు లేని కబేళాలపై మాత్రమే దాడులు చేస్తున్నమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి సాకుగా చెబుతున్నారని వాళ్లు వాదన చేస్తున్నారు. ఈ దాడుల సందేశం ఏమిటంటే చట్టం మిమ్మలను రక్షించదు గాక రక్షించదు అని మైనార్టీలను హెచ్చరించడమేనంటూ విపరీత ప్రచారం చేస్తున్నారు. భారత్‌ తప్పు చేస్తున్నదని అమెరికాలోని కొందరు మేధావులు పదే పదే చెబుతున్నారు. ప్రాచీన హిందువులు మానవ సేవే మాధవ సేవ అని విశ్వసించారు. జీవ హింసను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే అహింస సిద్ధాంతం. కాని హిందువులు ఈ రోజు హింసోన్మాద దాడులు చేస్తున్నారని అంటున్నారు. ఈ మధ్య రాజస్థాన్‌లో గోవులను అక్రమంగా తరలిస్తున్న ఒక ముస్లింను కొందరు యువకులు అతి దారుణంగా చంపి వేస్తే రాజ్య వ్యవస్థ మౌనం వహించిందని ఆరోపిస్తున్నారు.
హింస ఎవరు చేసిన తీవ్రంగా ఖండించ వల్సిందే. దానిని ఆరికట్టేందుకు ఈ దేశంలో చట్టం ఉన్నది. చట్టం ప్రకారం తీసుకునే చర్యలు తీసుకుంటు న్నారు. రాజస్థాన్‌లో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఇక్కడ గమనించవల్సిన విషయం ఏమిటంటే ఈ దాడులను పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌, కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్నాయని వారి ప్రచారం. ఈ మధ్య ఉత్తరప్రదేశ్‌లో మాంసం లేక ఒక రెస్టారెంట్‌ నాలుగు గంటల పాటు మూసివేస్తే అది జాతీయ వార్త అయిపోయింది. ఇదీ వారి తీరు.
ఈ దేశంలో, ప్రపంచంలో హింసోన్మాదులు ఎవరు? ఎవరి చరిత్ర రక్తసిక్తమైందో అందరికీ తెలుసు. ఇస్లాం, క్రైస్తవం, కమ్యునిజం ఈ దేశంలో పారించిన రక్తపుటేరులు జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది. ఈ మధ్య ఛత్తీస్‌ఘడ్‌లో సిఆర్‌ఫిఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు మాటు వేసి భోజనానికై కూర్చుంటున్న సమయంలో దాడి చేసి 25మందిని పొట్టన పెట్టుకున్నారు.
ఈ సంఘటనపై సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి మాట్లాడుతూ ''అంతర్గత భద్రతపై కేంద్రం దృష్టి పెట్టకపోవడం ఇటువంటి దారుణాలకు కారణం. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి'' అని అన్నారు. కేరళలో సీపీఎం పార్టీ కార్యకర్తలు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలను దారుణంగా చంపుతున్నారు. హింసోన్మాదంతో ఊగిపోతున్న తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకోలేని ఏచూరే దానికి బాధ్యత వహిస్తారా అని ఎవరైనా ప్రశ్నిస్తే? హింసాకాండను అదుపు చేయడం ప్రభుత్వయంత్రాంగపు పని. ఇన్నీ తెలిసి కూడా అంతర్జాతీయంగా భారత్‌ గౌరవానికి భంగం కల్గిస్తున్న ఈ ఉదారవాద మేధావులను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ దుష్ప్రచారం ఒక భేద తంత్రం. ఈ తంత్రాన్ని హిందూ సమాజం జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని వమ్ము చేయాలి. ఈ దిశలో హిందూ సమాజం ఆలోచించి రాబోవు రోజులలో ఇటువంటి ప్రచారాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.