దేశ హితం కన్నా ప్రాణం ముఖ్యం కాదు

'ప్రాణలైనా అర్పిస్తాం....సాధిస్తాం' అనే నినాదాలు మనం తరుచు వింటూ ఉంటాం. ఐతే నిజంగానే ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచిన ఒక వీరకిశోరం మన మధ్యనే ఉన్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీనివాసు గ్రేహౌండ్స్‌ విభాగంలో ఒక కానిస్టేబుల్‌ ఇప్పుడు తెలంగాణ కౌంటర్‌ ఇంటలిజెంటు శాఖలో పని చేస్తున్నాడు. హజ్రత్‌ హజీ మొహ్మద్‌ ఆలమ్‌ జీద్‌ అఫ్రీదీ ఒక ఇస్లామిక్‌ తీవ్రాది. 
బెంగుళూరు బాంబు ప్రేలుళ్లకు బాధ్యుడు. ఇతను ఒక మహిళను వెంటబెట్టుకుని బైకు మీద వెళుతున్నప్పుడు చూచిన శ్రీనివాస్‌ వెంబడించాడు. వారి మధ్య జరిగిన పెనుగులాటలో శ్రీనివాస్‌ కడుపులో కత్తి దిగింది. అయినప్పటికీ తీవ్రవాదిని పట్టుకుని బంధించే వరకు శ్రీనివాస్‌ విశ్రమించలేదు. శ్రీనివాస్‌ ధైర్య సాహసాలకు మెచ్చి అతడికి ప్రభుత్వం శౌర్యచక్ర పురస్కారం ఇచ్చింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ ఒక కార్యక్రమంలో శ్రీనివాస్‌కు ప్రదానం చేశారు.


వైదేహి సేవా సమితి 24వ వార్షికోత్సవం

వైదేహి సేవా సమితి 24వ వార్షికోత్సవం 30-04-2017 న జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులు, విశేష అతిథులుగా ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రిజిస్ట్రార్‌ జుడీషియల్‌ శ్రీవెంకటేశ్వర్‌ రెడ్డి, తెలంగాణ శాసన సభ బిజెపిపక్ష నేత శ్రీ కిషన్‌ రెడ్డి విచ్చేశారు. వీరితోపాటు నాగార్జున కన్‌ స్ట్రక్షన్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ నారాయణ రాజు అల్లూరి, మానేపల్లి జ్యూవెలరి అధినేత శ్రీ.మానేపల్లి రామరావు, తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ యూనియన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డా. కిరణ్మయి, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ డా.అన్నదానం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ముగ్గురుతో మొదలైన ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 96మంది ఉన్నారు. అందులో 34మందికి పెళ్లిళ్ళు జరిపించింది. వైదేహి సేవా సమితి కార్యదర్శి శ్రీ.కొండూరు బాలకష్ణయ్య గారు వైదేహి సేవా సమితి నివేదికను సమర్పించారు. దాదాపు 1200 మంది కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. బాలికలను ఆశీర్వదించారు. వైదేహి ఆశ్రమ అధ్యక్షులు శ్రీ ప్రకాశ్‌ రావు గారు వందన సమర్పణ చేశారు.

విస్తృతంగా వేద విద్య

మానవ జాతికి జ్ఞానాన్ని ప్రసాదించినది వేదం. వెయ్యి సంవత్సరాలుగా వేద విద్య నిర్లక్ష్యానికి, అనాదరణకు గురయ్యంది.వేద జ్ఞానాన్ని ప్రాచుర్యాన్ని కలిగించే పనిని చేపట్టింది విశ్వహిందు పరిషత్తు. పుణె నగరంలోని మహర్షి వేద విజ్ఞాన ప్రతిష్టాన్‌తో కలిసి 27 వేద పాఠశాలలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నది.ఇప్పటికే మణిపూర్‌, కొల్‌కత్తా, జమ్మూ, అమరావతి, పుష్కర్‌లలో వేద పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇవి కాక ఇంకొక 10వేద విద్యాలయాలు స్థాపించడానికి విశ్వ హిందు పరిషత్తు ఏర్పాట్లు చేస్తోంది. ఉన్నత స్థాయి వసతులు కలిగి, నాణ్యమైన విద్యబోధన జరిగే ఈ పాఠశాలలో 20-25 స్థానాల కోసం 400 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ విద్య పూర్తిగా ఉచితం. ప్రతి విద్యార్థి కోసం నెలకు రూ. 4,000లు ఖర్చవుతుంది. విద్య పూర్తిగా చేయడానికి 7సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే వెయ్యి మంది బ్రహ్మచారుల (విద్యార్థులు) వేదం అభ్యసిస్తున్నారు. పరిషత్తు చేపట్టిన బృహత్‌కార్యం విజయవంతం కావాలని ప్రార్థిద్దాం.

కర్ణాటక సంఘటన తీవ్రవాద చర్యేనని తేల్చిన ఎన్‌ఐఎ

గత ఏడాది అక్టోబర్‌ 16న బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రుద్రేష్‌ హత్య ప్రజలను, ముఖ్యంగా ఒక సంస్థ సభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు కొద్దిమంది ప్రణాళికాబద్ధంగా పాల్పడిన చర్య అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) పేర్కొంది. ముఖ్యంగా భారత్‌లో ఇస్లాం ఖలీఫత్‌ (రాజ్యం) ఏర్పరచాలన్న ఉద్దేశ్యంతో పనిచేసేవారే ఈ హత్యకు పాల్పడ్డారని ఛార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ఈ హత్యకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై నేరారోపణ చేసింది. వారంతా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు చెందినవారే. 'ఒక వర్గానికి చెందిన ప్రజల్లో భయాన్ని కలిగించేందుకు ఐదుగురు వ్యక్తులు రుద్రేష్‌ను హత్య చేశారని ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశాం' అని ఎన్‌ఐఎ ఒక ప్రకటనలో వెల్లడించింది. కుట్రదారులు సంఘటనకు ముందు సెప్టెంబర్‌ నెలలో స్థానిక అక్సా మసీదు, చోటా చార్మినార్‌ దగ్గర సమావేశమై పథకం రచించారని ఎన్‌ఐఎ తన ప్రకటనలో పేర్కొంది. విజయదశమి ఉత్సవం తరువాత ఇళ్ళకు వెళ్ళే ఇద్దరు గణవేషధారీ (యూనీఫాంలో ఉన్న) స్వయంసేవకుల్ని హత్య చేయాలని, ఆ విధంగా ఒక వర్గంలో భయోత్పాతాలు సృష్టించాలన్నది వారి పథకం. 'కాఫిర్‌ (ముస్లిమేతరులు)లను హతమార్చి జిహాద్‌ను సాగించడం ద్వారా ఇస్లాం రాజ్యాన్ని ఏర్పరచాలి' అనే సిద్ధాంతానికి ప్రేరేపితులై కుట్రదారులు ఈ చర్యకు పాల్పడ్డారని తమ విచారణలో తేలినట్లు ఎన్‌ఐఎ స్పష్టం చేసింది.