నీటి సమస్యకు సమాధానం జల సంరక్షణే

3290 లక్షల హెక్టార్‌ల వ్యవసాయ క్షేత్రం కలిగిన భారతదేశం ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద దేశం. ప్రకృతి మనకు వివిధ రకాలైన సారవంతమైన మట్టి ఇచ్చింది. ఇందులో వివిధ రకాలైన జీవజాలం మనుగడ సాగిస్తోంది. వివిధ పంటలకు అనుకూలంగా వాతావరణం ఉండడంవల్ల వ్యవసాయ ఉత్పత్తి కూడా బాగా ఉంటుంది. కానీ మారుతున్న వాతావరణ పరిస్తితుల్లో మన అవసరాలు తీరే అవకాశం ఉందా? వాతావరణ కాలుష్యం, తరుగుతున్న అడవులు, తగ్గుతున్న వర్షపాతం పెద్ద సవాళ్ళు గా నిలుస్తున్నాయి. 
జనాభా పెరుగుదల, పెరుగుతున్న అవసరాలు దృష్ట్యా వ్యవసాయంలో అనేక మార్పులు అవసరమయ్యాయి. అతి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని ఇచ్చే పద్ధతులు ఇప్పుడు చాలా అవసరం. నేడు దేశంలో కురుస్తున్న వర్షంలో కేవలం 29 శాతం మాత్రమే వినియోగమవుతోంది. మిగిలినదంతా వృధాగా పోతోంది. గత 10 ఏళ్ళ వర్షపాతపు తీరును పరిశీలిస్తే ప్రతి సంవత్సరం 92 శాతం వర్షం కుండపోత వాన రూపంలోనే పడుతున్నదని తేలింది. అది కూడా జూన్‌ నుండి సెప్టెంబర్‌ మధ్యలోనే కురుస్తోంది. ఈ వాన నీటిని నిల్వ ఉంచుకునే అవకాశం ఏదీ లేనందున ఈ నీరు నేలలోని సారవంతమైన పదార్థాలన్నింటినీ తీసుకుని నదుల్లో లేదా సముద్రంలో కలిసిపోతోంది. దీనివల్ల ఖరీఫ్‌లో వేసిన పంటకు కూడా సరైన తడి అందడం లేదు. వర్షాధారిత ప్రాంతాల్లో భూసారం క్షీణించడంవల్ల పంటలు పండడం లేదు.
'పొలంలో నీళ్ళు పొలంలో, గ్రామంలో నీరు గ్రామంలో' అనే సంకల్పంతో ప్రజాఉద్యమం సాగినప్పుడే నీటి సమస్యను ఎదుర్కొనగలుగుతాం. దీనికోసం జల నిర్వహణపై పరిశోధన, పరంపరాగత జల వనరులను పరిరక్షించుకోవడం కోసం యుద్ధప్రాతిపదికన ప్రయత్నం చేయాలి. వర్షం ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వనరు. దానిని సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడే గ్రామీణ వికాసం సాధ్యపడుతుంది. ఏ దేశపు ఆర్థిక వ్యవస్థకైనా వ్యవసాయమే వెన్నెముక. సరైన భూమి, జలవసతి లేకపోతే వ్యవసాయ ప్రగతి సాధ్యపడదు. భూసారాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మొక్కలకు మంచి పోషక విలువలు అందుతాయి.
నీటి సమస్య కారణాలు
ఎత్తుపల్లాలున్న భూమివల్ల భూక్షయం జరిగింది. మరోవైపు వినియోగవాద సంస్కృతివల్ల అడవుల నరికివేత జరిగింది. వన్యప్రాణుల అస్తిత్వం కూడా సంకటంలో పడింది. నగరీకరణ, పారిశ్రామికీకరణవల్ల జలం, అడవులు, భూమిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది కేంద్రీయ భూమి, జల సంరక్షణ అనుసంధానం మరియు ప్రశిక్షణ సంస&థ, కోటా సేకరించిన సమాచారం ప్రకారం జొన్న, సోయాబీన్‌, పల్లీలు, గోధుమలు, ఆవాలు, శెనగలు (ఒక కిలోకు) పండించడానికి అవసరమైన నీరు వరుసగా 926, 1700, 2141, 856,1929,999 లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ నీరు తగినంత లభించకపోవడంవల్ల పంట దిగుబడి బాగా తగ్గిపోతోంది.
జల సంరక్షణ, భూ సంరక్షణ
జల సంరక్షణకు కొండ ప్రాంతాలు, మైదానాలు, బీడు భూములు, బంజరుభూములకు వేరువేరు పద్ధతులు రూపొందించాలి. పర్వత ప్రాంతాల్లో 10 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు ఉన్న గుంతలను తవ్వి పలు ప్రయోజనాలు కలిగిన పంటలను, మొక్కలను నాటడంవల్ల భూక్షయాన్ని అరికట్టవచ్చును. అలాగే కిందికి పారే నీరు ఆ గుంతలలో నిల్వ ఉంటుంది. అది క్రమంగా భూమిలోకి ఇంకుతుంది.
ఏ కాలవల్లో నీటి ప్రవాహం తీవ్రంగా ఉంటుందో వాటిలో మేవియన్‌ పద్ధతి ద్వారా ప్రవాహవేగాన్ని తగ్గించి, భూక్షయాన్ని అరికట్టవచ్చును. చెక్‌డామ్‌ల ద్వారా కూడా నీటి నిల్వను పెంచుకోవచ్చును. బీడు భూమిలో వృక్షారోపణ, మందుమొక్కలు, పశువుల దాణాను పెంచడానికి ఉపయోగించవచ్చును.
భూమి, పంట నిర్వహణ
భూమి, పంట నిర్వహణలో భూసారం పరిరక్షించడం, ఎన్ని మొక్కలు వేయాలో నిర్ణయించుకోవడం, పంటనాటేకాలం, చీడపీడల నియంత్రణ మొదలైనవి ఉంటాయి. తగినంత మొక్కలను మాత్రమే పెట్టడంవల్ల భూసారం పరిరక్షింపబడుతుంది. ఎరువులు కూడా పంట దిగుబడికి, అలాగే భూసారాన్ని పెంచడానికి కూడా అవసరం. ఎండాకాలంలో భూమిని దున్నితే వర&షపు నీరును అలాంటి భూమి బాగా పీల్చుకుంటుంది. సమయానికి నాట్లు వేయడం కూడా భూసారాన్ని పరిరక్షించుకునేందుకు ఒక మార్గం.
చిత్రకూట్‌లో దీన్‌దయాళ్‌ పరిశోధన సంస్థ ఈ పద్ధతుల ద్వారా మంచి ఫలితాల్ని సాధించింది. ఈ ప్రాంతంలో పూర్తిగా అడవులపై ఆధారపడిన 20 గ్రామాల ప్రజలు ఇప్పుడు లాభదాయకమైన పంటల ద్వారా జీవనాన్ని సాగించగలుగుతున్నారు.
ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయిన 82 అడుగుల లోతున్న బావులు కూడా ఇప్పుడు కొద్దిపాటి వర్షంతోనే పుష్కలమైన జలంతో నీటికుండలుగా మారాయి. 5-6 అడుగుల తాడుతోనే చక్కగా నీరు తోడుకోగలిగిన పరిస్థితి ఏర్పడింది. సంవత్సరం మొత్తం తాగునీరు లభిస్తోంది.
ఈ ప్రాంతంలో 1996 నుండి 2012 మధ్యకాలంలో ప్రతి సంవత్సరం మే మాసంలో నీటిమట్టం 0.3 మిల్లీలీటరు, డిసెంబర్‌లో 0.80మి.లీ ఉండేది. 2003లో 3.09, 4.36మి.లీ ఉండగా, 2012 మే నాటికి 3.96, డిసెంబర్‌కి 4.58మి.లీ కి చేరింది. ఇలా నీటిమట్టం మేలో 3.00మి.లీ, డిసెంబర్‌లో 2.82మి.లీలకు పెరిగింది. దీనితో ఈ 20 గ్రామాల్లో పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. 1996లో వరి దిగుబడి హెక్టార్‌కు 10.35 క్వింటాల్‌ ఉంటే 2015లో 36.71 క్వింటాల్‌కు పెరిగింది. అలాగే కంది దిగుబడి 7.40 నుండి 11.30 క్వింటాల్‌కు, శెనగ 8.50 నుండి 15.55 క్వింటాళ్ళు, జొన్న 6.34 నుండి 12.45కు, గోధుమ 15.78 నుండి 34.50, ఆవాలు 5.17 నుండి 17.57క్వింటాళ్ళకు పెరిగింది.
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా వనవాసీ బాహుళ్య ప్రాంతంలో భూసారం పెరగడం, భూగర్భ జలాల మట్టం కూడా బాగా పెరిగింది. వ్యవసాయ భూమి కూడా విస్తరించింది. గ్రామస్థులు తమతమ భూముల్లోనే వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు. వారి జీవన ప్రమాణాలు బాగా మెరుగుపడ్డాయి. కాబట్టి సహజమైన, ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారానే జల, భూ సంరక్షణ సాధ్యపడుతుంది. వాటి ద్వారానే గ్రామీణల జీవనం మెరుగుపడుతుంది.
- డా. వేద్‌ప్రకాష్‌ సింగ్‌, దీన్‌దయాళ్‌ పరిశోధన సంస్థ, వ్యవసాయ విజ్ఞానకేంద్రం, సత్నా (మధ్యప్రదేశ్‌)