భారతీయ సమాజంలో స్త్రీ పాత్ర

మన వేద, పురాణ, ఇతిహాసాలన్నీ స్త్రీని ఆదిపరాశక్తిగా కిర్తించాయి. సమాజాభివృద్ధిలో ఆమె పాత్ర గుర్తించి అభినందించాయి. అనాటి కాలం నుంచి ఈనాటివరకు సమాజంలో స్త్రీ తనపాత్రని నిరూపించుకుంటూనే ఉంది. భర్తకి మంచి భార్యగా, తనబిడ్డకి తల్లిగా, మొదటి గురువుగా ఇలా అనేక సందర్భాలలో ఇమిడిపోతూ విభిన్నమైన పాత్రలతో సంతానాన్ని తీర్చిదిద్దుతూ తద్వారా మంచి సమాజం ఏర్పడటానికి తనవంతు కృషి చేస్తోంది. (సంస్కారవంతమైన ప్రజలు మాత్రమే సంస్కారమైన సమాజాన్ని ఏర్పాటు చేయగలరు కదా!) ఇలా ఈమె నిర్వహించే బాధ్యతలు తనకెంతో ఉన్నతస్థానాన్ని ఏర్పరుస్తాయి. 
కుటుంబమైనా, గ్రామమైనా, రాష్ట్రమైనా, దేశమైనా సరే! స్త్రీని గౌరవిస్తెనె దాని గౌరవం ఇనుమడిస్తుంది. స్త్రీని అవమానించిన సమాజం బాగుపడలేదు. ఇదే సందర్భంలో స్త్రీ సైతం తన పాత్రను సరిగ్గా పోషిస్తూ అందరి మన్ననలను పొందాలి. ఉత్తమ వ్యక్తిత్వం, ఉన్నతమైన సంస్కారం, ఉజ్వలమైనశీలం కుటుంబానికే కాదు దేశానికే గర్వకారణమవుతుంది.
''సమ్రాజ్ఞీశ్వశురేభవ'' అంటూ వేదం స్త్రీకి కుటుంబపరంగా ఉన్నతమైన బాధ్యతలను అప్పజెప్పింది. ఓ వధూవు! నువ్వు నీ ఇంటి సామ్రాజ్యానికి మహారాణివై ఉత్తమమైన సంతానాన్ని లోకానికి అందించమని ఆదేశిస్తోంది. మెట్టినింటిలో స్త్రీ నిజంగా మకుటం లేని మహారాణి. వివాహమైన తరువాత తన భర్త కుటుంబాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దవలసిన స్థానంలో ఉంటుంది. గృహమనే ఈ సామ్రాజ్యాన్ని అహంకారంతో కాక ఆప్యాయతతో పాలించే అనురాగ దేవతే స్త్రీ మూర్తి. నడవడిలో నమ్రత, మాటలో ఆదరణ, చూపులో వినయం మహిళా లోకానికి వన్నెతెస్తాయి. అలాంటి ఉన్నతమైన భావాలతో ఉన్న స్త్రీ ఇంటికి ఇల్లాలైతే ''పాలుపొంగినట్టుగా'' ఆ కుటుంబం అన్ని విధాల అభ్యుదయపథంలో ప్రకాశిస్తుంది.
వేదాలలో స్త్రీ ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. వాటిని అనుసరించి ఆనాటి సమాజంలో మహిళ అపారమైన గౌరవం కలిగి ఉండేది. మగవాడు ఆచరించే ప్రతి ధర్మకార్యంలోను సమానమైన స్థానం స్త్రీది. దీనివల్ల సాన్నిహిత్యం పెరిగి స్నేహం దృఢమవుతోంది. అందుకే ఆమెకు అర్ధాంగి అనే పేరు సార్థకమైంది. ఆనాటి ఈ మహోన్నతభావనే ఈనాటికి స్త్రీలపై ఉత్తమమైన ప్రభావాన్ని చూపించి తన బాధ్యతలను అభ్యుదయ పథంలో ప్రకాశిస్తుంది.
అతి పవిత్రమైన వేదాలలో మంత్రద్రష్టలుగా స్త్రీలు ఉన్నారు. వారిని రుషీకలు అని అంటారు. రోమశ, గార్గి, ఘోష, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, అపాల, యమి, పౌలోమి లాంటి ప్రతిభావంతులైన వారు తమ విజ్ఞానంతో వేదమంత్రాలను దర్శించి లోకానికి అందించారు. మహామహులనదగ్గవారితో వేదవేదాంత విషయాలలో వాదించి గెలుపొందారు. పురాణాలలో అదితి భూదేవిగా, ప్రపంచానికి తల్లిగా చెప్పబడింది. తండ్రితొడల మీద కూర్చోవాలని ఆశపడ్డ ధ్రువుడికి ప్రేరణ కలిగించి శాశ్వతమైన ధృవపదం పొందేలా చేసింది సునీతి.
ఎంతమంది రక్తసంబంధీకులున్నా పోషించవలసింది సంతానమే. అలాగే లోకంలో సంతోషాన్ని పంచేది స్త్రీ మాత్రమే. అటువంటి స్త్రీ అవసరమైన సందర్భాలలో కఠినత్వాన్ని కూడా ప్రదర్శించవలసి రావచ్చు. అలాంటి పరిస్థితే వస్తే సత్యభామగా మారి చెడును రూపుమాపవచ్చు. రుద్రమదేవియై శత్రు సంహారము చేయవచ్చు. తన మాతృభూమి కబలించే మతమౌఢ్యులకు సమాధానంగా శివాజీని తీర్చిదిద్దిన జిజియాబాయిలా కొడుకుకు విద్యాబుద్దులను నేర్పవచ్చు. భర్త అయిన రామకృష్ణుల ఆశయానికి సహకరించిన శారదాదేవిలా ఎవరిపిల్లలైనా తనపిల్లలే అనే భావనతో దేశానికి మార్గదర్శనం చేసే మరో వివేకానందుడినే తయారుచేయవచ్చు.
చివరగా ''యత్రనార్యస్తుపూజ్యంతే రమంతే తత్రదేవతా.'' అన్న మనుప్మృతి ప్రకారం ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అటువంటి చోట దేవతలు (దేవతలు అనందానికి ప్రతీకలు కదా!) నివసిస్తారన్న వాక్యాన్ని పరమప్రమాణంగా స్వీకరించిన ఈ భారతీయ సమాజంలో అనాదిగా స్త్రీలు పూజింపబడుతూ, గౌరవింపబడుతూ, సమాజంలో వారి పాత్రను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పురాణకాలం నుంచి ఈనాటి వరకు ఎటువంటి సవాలునైనా స్వీకరిస్తూ తను దేనికీ తక్కువ కాదని నిరూపించుకుంటోంది మహిళ.