అందరూ హిందూ బంధువులే..

అంటరానితనం హిందూ సమాజానికి ఒక శాపం. అంటరానితనం, ఎక్కువ తక్కువలు మొదలైన బేధభావాలతో హిందూ సమాజం చిన్నా భిన్నమైంది. ఆ కారణంగా చాలమంది హిందూ ధర్మాన్ని వదిలి విధర్మీయులుగా పోతున్నారు. అందుకని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సావర్కర్‌ సంకల్పించుకున్నారు.
సత్యాగ్రహం చేసి సావర్కార్‌ రత్నగిరిలోని విఠలేశ్వర దేవాలయంలో అంటరానివారికి ప్రవేశం కల్పించారు. రత్నగిరిలో పతితపావన మందిరాన్ని నిర్మించి దాని ప్రారంభోత్సవాన్ని శ్రీ శంకరాచార్యులచేత చేయించారు. 
అంటరానితనాన్ని మరిచిపోయి హిందువు లందరు ఒకచోట చేరి సహపంక్తి భోజనం చేయటానికి కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులందరు భేదభావం లేకుండా ఒకచోట కూర్చుండేటట్లుగా చేయమని ఉపాధ్యాయులను కోరేవారు. మన బంధువు ఒకవేళ అంటరానివాడిగా, చేయబడితే అతనిని దూరంచేసుకొని, 'శత్రువుగా మార్చుకోవద్దు' అని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించి చెప్పేవారు.
అంతేకాకుండ ఇతర మతాలలోనికి వెళ్లిన హిందువులను కూడా శుద్ధి కార్యక్రమాల ద్వారా తిరిగి హిందూధర్మంలోనికి తీసుకొచ్చేవారు. హిందూ ధర్మంలో వున్న అనేక మూఢ నమ్మకాలను తొలగించటానికి సావర్కార్‌ కృషి చేశారు. భారతీయ భాషలలోనికి చొచ్చుకుని పోయిన అనేక ఆంగ్లపదాలను, వాటి ప్రయోగాలను తొలగించే భాషాశుద్ధి కార్యక్రమాన్ని కూడా సావర్కర్‌ చేపట్టారు.