శ్రీగురుభ్యోన్నమః

శంకం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్ర భాష్య కృతౌ వందే భాగవతౌ పునః పునః
(భగవంతుడు శివుడు, విష్ణువు, వ్యాసుడు, శంకరాచార్యులను నేను పూజిస్తాను. వేదాంత సూత్రాలు వ్రాసిన వ్యాసునికి, వ్యాఖ్యానాలు వ్రాసిన శంకరాచార్యులకు పదేవదే నమస్కరిస్తాను.)
గురుపౌర్ణమి(ఆషాఢశుద్ధ పౌర్ణమి) నాడు ఈ గురుపరంపరకు నమస్కరిస్తూ అవిచ్ఛన్నంగా వస్తున్న భారతీయ నాగరకత గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటాం. గురు-శిష్య వ్యవస్థ ప్రాముఖ్యతను మరోసారి గ్రహిస్తాం. గురువు అంటే మనలోని అజ్డానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు. 
ముఖ్యంగా మానవజీవిత పర మార్థం ఏమిటి? దానిని సాధించడానికి ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి అనే అవగాహన కలిగించేవాడు గురువు. మావన జీవిత లక్ష్యమైన మోక్షసాధన(పరమాత్మను తెలుసుకోవడం) ఎలా సాధ్యపడుతుందో చెప్పి, అందుకు వివిధ మార్గాలను చూపించినది వేదం. ఆ వేదజ్ఞానాన్ని మనకు అందిస్తాడు కాబట్టి గురువు భగవంతుడితో సమానం అన్నారు.
వేదాలను విభజించి, వాటిని లోకంలో ప్రచారం చేయడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసినవాడు కృష్ణద్వైపాయన వ్యాసమహర్షి. వ్యాసుని కాలానికి అంటే నేటికి సుమారు 5000 ఏళ్ల క్రితం వేద విజ్ఞానమంతా ఒకటిగా ఉండేది. అపారమైన ఈ విజ్ఞానరాశిని ఆకళింపు చేసుకోవడంకానీ, ప్రచారం చేయడం కానీ క్రమంగా కష్టమైంది. దానితో ఆ వేద రాశిని నాలుగు భాగాలుగా విభజించాడు వ్యాసమహర్షి. ఆ భాగాలే ఋగ్‌, యజు, సామ, అధర్వణాలు. ఒక్కొక్కటి ఒకొక్క వేదంగా పేరు పడింది. ఒక్కో వేదంలో సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం (ఉపనిషత్తు) అనే భాగాలు ఉంటాయి. అలాగే ప్రతి వేదానికి కొన్ని ఉపశాఖలు ఉన్నాయి. ఋగ్వేదంలో 21, యజుర్వేదం 101, సామవేదం 1000, అథర్వణవేదంలో 9 శాఖలు ఉన్నాయి. ఇలా వేద విజ్ఞానాన్ని వర్గీకరించిన వ్యాసమహర్షి ఆ జ్ఞాన ప్రచారానికి కూడా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తన శిష్యులైన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఒక్కొక్క వేదాన్ని బోధించి, వారి ద్వారా ఆ వేద ప్రచారాన్ని సాగించాడు. ఋగ్వే దాన్ని పైల మహర్షికి, యజుర్వేదం వైశంపాయ నుడికి, సామవేదాన్ని జైమినికి, అథర్వణవేదం సుమంతుడికి బోధించాడు. వీరు నలుగురు తమ శిష్యులకు బోధించారు. అలా వేదజ్ఞానం తరతరాలుగా గురువు నుంచి శిష్యునికి వస్తూ ఇప్పటికీ నిలబడి ఉంది. ఇలా విశ్వానికి మూలమైన వేదజ్ఞానాన్ని వర్గీకరించి, నిలబెట్టిన వ్యాసుడు మానవజాతికి మహోపకారం చేశాడు. ఆ మహర్షి చేసిన ఈ మహోపకారానికి కృతజ్ఞతగా ప్రతి ఏటా వేదవ్యాసుడిని స్మరించుకోవడం, పూజించడం ఆచారంగా వస్తోంది. అలాగే వేదవ్యాసుడు ఏర్పాటు చేసిన గురుశిష్యపరంపరను కొనసాగిస్తూ ప్రతి గురువును వ్యాసునిగా భావించి గౌరవించడం జరుగుతోంది. మానవ ప్రగతికి మూలమైన వేదాన్ని అనుసరించడంలో ఎలాంటి ఏమరపాటు ఉండకూడదని గురుపౌర్ణమిరోజు గుర్తు చేసుకుంటాం.
వేద వ్యాసుని నుంచి ప్రారంభమైన ఈ గురుశిష్య పరంపర సనాతన హిందూ ధర్మానికి చెందిన అన్ని మతాల్లోనూ కనిపిస్తుంది. బౌద్ధ, జైన మొదలైన మతాల్లో కూడా గురుపూజ పద్ధతి ఉంది. బౌద్ధమతాన్ని స్థాపించిన గౌతమ బుద్దుడు జ్ఞానాన్ని పొందిన తరువాత సారనాధ్‌కు వెళ్ళి అక్కడ తన ఐదుగురు శిష్యులకు జ్ఞానబోధ చేశారు. అలా గురుశిష్యపరంపరను ప్రారంభించారు. బుద్ధుడు తన శిష్యులకు మొట్టమొదట చేసిన జ్ఞానబోధను ధర్మచక్ర ప్రవర్తన సుత్త అంటారు. ఇది కూడా సరిగ్గా ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు జరిగింది. ఇలా బౌద్ధ మత ప్రచారం ఐదుగురితో ప్రారంభ మైంది. ఆ తరువాత బుద్ధుని శిష్యుల (సంఘం) సంఖ్య క్రమంగా 60కి పెరిగింది. వీరందరినీ అర్హంతులు అంటారు. బౌద్ధ ప్రచారానికై వీరందరినీ బుద్ధుడు నలువైపులకూ పంపాడు.
జైనమతంలో కూడా గురుశిష్యపరంపర కనిపిస్తుంది. 24వ తీర్థంకరుడైన మహావీరుడు జ్ఞానాన్ని పొందిన తరువాత సరిగా ఇదే రోజున గౌతమ స్వామిని(ఈయననే ఇంద్రభూతి గౌతముడు అని కూడా అంటారు) తన శిష్యునిగా ఎంచుకుని ఆయనకి జ్ఞానబోధ చేశారు. అందుకనే జైనులు కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమిగా పాటిస్తారు. ఈ సందర్భంగా గురుపూజ చేస్తారు.
ప్రాచీనంగా వస్తున్న ఈ గురుపూజ సంప్రదా యాన్నే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కూడా అనుసరించింది. పరమపవిత్ర భగవాధ్వజాన్నే (కాషాయధ్వజం) గురువుగా భావించి ప్రతిఏటా గురుపూజ చేసే పద్దతిని డాక్టర్జీ ప్రవేశపెట్టారు.