శ్రావణ పౌర్ణమి

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా పవిత్ర మైనదిగా భావిస్తారు. ఈ రోజు చాలా విశిష్టత కలిగినది. దేశ వ్యాప్తంగా ఈ రోజు 'రాఖీ పౌర్ణమి'గా రక్షా బంధన్‌ జరుపుకుంటారు. 'జంధ్యాల పౌర్ణమి' పేరుతో ఈ రోజు యజ్ఞోపవీతధారణ చేస్తుంటారు. వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తుం టారు.తమిళనాడు, కేరళలలో జంధ్యం ధరించడాన్ని 'అవని అనిట్టం', కర్నాటకలో 'ఉపకర్మ' పేరుతో ఈ రోజున నిర్వహిస్తారు. 
శ్రావణ పౌర్ణమిని మహారాష్ట్రలో 'వారియల్‌ పూర్ణిమ', గుజరాత్‌లో 'అక్షర పూర్ణిమ', మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, బీహర్‌లో 'కజూరి పూర్ణిమ' పేరుతో జరుపుకుంటారు. ఈ రోజున సప్త ఋషులు మరియు అరుంధతి నక్షత్రాన్ని పూజించటం ఆనవాయితి. ప్రసిద్ధమైన అమరనాథ్‌ యాత్ర ఈ రోజులలో వస్తుంది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శాఖలలో ''రక్షాబంధన్‌'' ఉత్సవాన్ని జరుపుకుంటారు. సమాజంలో వర్గ, జాతి, కులం, లాంటి అనేక భేదభావాలను తొలగించి సమానత, సమరసతాయుక్త సమాజాన్ని రూపొందించాలనేది సంఘ ప్రయత్నం. వెనుకబడిన ఉపేక్షిత బస్తీలకు వెళ్లి అక్కడి వారికి రక్షకట్టి, స్నేహసూత్రంతో బందించి జాతీయ జీవన స్రవంతిలో సక్రియులను చేసే ప్రయత్నం ఈ రోజు చేయాలి. స్వయం సేవకులు కూడా ఒకరికొకరు రక్ష కట్టుకుని సమాజంలో పరస్పరం ఆత్మీయత, సురక్షా, సమరసతా భావనలను జాగృతం చేసి దేశాన్ని సంఘటితం చేయాలి. దేశానికి, ధర్మానికి, సమాజానికి ప్రతీక అయిన భగవాధ్వజానికి రక్షకట్టి దాన్ని రక్షించే భారం మనం వహించాలి.