హిందువులు అతివాదులు అనే ప్రచారాన్ని త్రిప్పికొట్టాలి

2010 నుంచి ఇప్పటివరకు గో సంబంధిత దాడులలో 28మంది హత్య చేయబడ్డారని నివేదికలు తెలుపుతున్నాయి. గత మూడేళ్లలో 32చోట్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దానిలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. 50మంది గాయపడ్డారు. జూన్‌ 20వ తేదిన నరేంద్రమోది ఈ అంశంపై మాట్లాడారు. గో భక్తి పేరుతో మనుషులను చంపటం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అంగీకారం కాదన్నారు. 
శాంతిభద్రతలను కాపాడటం రాష్ట్రాల పని. రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సక్రమంగా వ్యవహరించటం లేదు? ఆసలు ఇటువంటి దాడులకు ప్రేరేపకులు ఎవరు? సంస్థలా; వ్యక్తులలో అతి ఆలోచనలా? దాడులు జరుగుతున్న ప్రదేశాలు చూస్తుంటే సుదూరంలో ఉండే గ్రామాలు ఉంటున్నాయి. ఈ విషయాలన్నింటిని వివరంగా అధ్యయనం చేయాలి. అది చేయకుండా ఇటువంటి వారిని కట్టడి చేయడానికి సహకరించకుండా ఈ దాడులన్నీ ముస్లింలను, దళితులను లక్ష్యం చేసుకుని సంఘ ప్రేరేపిత మూకలు చేస్తున్నారని వామపక్షం వాళ్ల, ఉదారవాదులు పనిగట్టుకుని దేశంలో, విదేశాలలో ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇవి ప్రారంభమైనాయి అనే వాదనను అందరిదృష్టికి తీసుకుని వెళ్లటానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా గడిచిన బుధవారం దేశ వ్యాప్తంగా 12పెద్ద నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ కార్యక్రమంలో ఉదారవాద మేధావులు, వామపక్ష వాదులు, మావోయిస్టు మేధావులు పాల్గొన్నారు. భాగ్యనగరంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. పనిలో పనిగా సాగరిక ఘోష్‌ తన ట్విట్టర్‌లో '' రోజున మళ్లీ హిందుత్వం, మానవ హక్కుల అంశాలన్నిటి పునర్‌నిర్వచనం జరగాలి'' అని రాసింది.
ఇక్కడ రెండు విషయాల గురించి ఆలోచించాలి
1. గో సంరక్షణ అనే అంశానికి సంబంధించిన అన్ని అంశాలను పరీశిలించాలి. దానిపై ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ఉన్న చట్టాలు ఏమి చెబుతున్నాయి? మాంసం ఎగుమతులపై కేంద్రం చేసిన నిర్ణయాలు ఏమిటి? ఎందుకంటే దేశంలో లక్షలమంది మైనార్టీల, నిమ్న వర్గాలు మాంసవిక్రయంపైన తోళ్ల పరిశ్రమలపైన ఆధారపడి బ్రతుకుతున్నారు. వాళ్ల బ్రతుకులను బజారున పడేస్తున్నారని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. దేశంలో 2.5బిలియన్ల మంది ఈ పరిశ్రమలపై బ్రతుకుతున్నారు. ఇదంతా సంఘ పరివార్‌ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్నదని వారి వాదన.
ఈ వాదనలు, సంఘటనలు చూస్తున్నప్పుడు గోరక్షకుల పేరుతో పని చేస్తున్న వారు; ఇతరులా? లేక సంఘాన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనం చేసేందుకు చేస్తున్న కుట్రలా అన్నది ఆలోచించాలి. కొద్ది రోజులలో వాస్తవాలు తప్పకుండా వెలుగు చూస్తాయి.
ఈ దేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలపై ముమ్మర దాడులు జరగలేదు. హిందువులు అతివాదులుగా మారుతున్న రని నిరూపించేందుకు గడచిన కొద్ది సంవత్సరాలుగా దేశంలో విశేషంగా ప్రయత్నం జరుగుతున్నది. ఇస్లాంలో ఉన్నట్లు హిందువులలో కూడా ఉగ్రవాదులు ఉన్నారని నిరూపించేందుకు ఒక దశాబ్ద కాలంగా ప్రయత్నం జరుగుతున్నదని, దానికి జోడింపుగా గో రక్షకులను చేర్చటం జరుగుతున్నది. ఇటువంటి కుట్రలను భగ్నం చేయాలి. దేశంలో శాంతిని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి. హిందువులు అతి వాదులు అనే ప్రచారాన్ని త్రిప్పికొట్టాలి.