శ్రావణ వైభవం !


వేదాలు, పురాణాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. ముఖ్యంగా పూజాదికాలు నిర్వహించేందుకు అనువైనదిగా చెబుతారు. ఈ మాసంలో లక్ష్మిదేవిని, గౌరీదేవిని, శివకేశవులిరువురి నీ కొలువడం వల్ల జీవితంలో కష్టాలు తొలగి పోతాయని పండితులు చెబుతారు. శ్రావణ మాసం మహిళల ప్రత్యేకమైన మాసంగా చెప్పుకోవచ్చు. పేరంటాళ్లతో, చుట్టాలతో, పూజలు, వ్రతాలు నోములతో ఇల్లంతా రోజూ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. మరి ఆధ్యాత్మిక సంపదలనొసగే ఈ శ్రావణ మాస వైభవమేంటో చూద్దామా! 
ఈ మాసానికి శ్రావణం అనే పేరు ఎందుకంటే నవగ్రహాలలో ఒకటైన చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉన్నందున శ్రవణ మాసంగా పిలువబడుతోంది. అలాగే విష్ణుమూర్తి జన్మ నక్షత్రంగా శ్రవణ నక్షత్రాన్ని పేర్కొంటారు. శని దేవుడు అధిపతిగా కలిగిన రాశి మకర రాశి, శ్రవణా నక్షత్రాని మకర రాశి. కాబట్టి శని దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆధీనంలో ఉంటాడు. తిరుమల కొండల్లో కలియుగ దైవంగా కొలువై ఉన్న శ్రీవారిది కూడా శ్రవణా నక్షత్రం కావడం విశేషం. అందుకే ఈ మాసానికి అంతటి విశిష్టత ఉంది. కాబట్టి శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజా ఫలీకతమై ఉంటుంది. అందుకే కొత్త నోములు, వ్రతాలు, శుభకార్యాలను ఈ మాసంలో నిర్వహించుకుంటారు.
దేవీపూజలు : శ్రావణ మాసం అనగానే మొద ట గుర్తుకు వచ్చే వరలక్ష్మి, మంగళగౌరి వ్రతాలే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ వ్రతాలను నిర్వహిస్తారు. లక్ష్మిదేవిని సంపదకు ప్రతీకగా, ఆయురారోగ్యాలను నొసగే తల్లిగా కొలవడం వలన ఎక్కువ మంది మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. శ్రీమన్నారాయణుడికి ఇల్లాలైన లక్ష్మిదేవిని పూజించడం వల్ల ఆ శ్రీహరి సంతోషించి వరాలను కురిపిస్తాడు అనేది నిగూఢ భావం. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని ఎక్కువ మంది మహిళలు ఆచరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. శ్రావణ మంగళవారాలలో, శుక్రవారాలలో మహిళామణులు విశేషమైన పూజలను నిర్వహిస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఇక ఆ సంవత్సరమే పెళ్లయిన నూతన వధువు తన సౌభాగ్యం కోరి శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని పూజిస్తుంది. ఈ వ్రతాన్ని పెళ్లయిన ఏడాది నుంచి ఐదు సంవత్సరాల వరకు నిర్వహించాలని పెద్దలు చెబుతారు. ఈమాసంలో మహిళలు ఒకరింటికి మరొకరు వెళ్లడం వల్ల సామాజిక అనుబంధాలు బలపడుతాయి కూడా. కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాదు సమాజ స్థితిగతుల గురించి తెలుసుకునే సదవకాశం కూడా వారికి కలుగుతుంది.
హరిహరాదుల మాసం : ఈ మాసంలో ప్రతి శనివారం రోజున వేంకటేశ్వర స్వామిని ఆరాధించ డం వల్ల శనీశ్వర గ్రహ సంబంధింత బాధలు తొలిగిపోతాయి. ముఖ్యంగా వైఖానస ఆచారాన్ని పాటించే వాళ్ళు విష్ణు పూజలు చేస్తారు. మరోవైపు ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు నిర్వ హిస్తారు. శివమూటీలు అనే నోమును పట్టి శివుడికి ప్రతి సోమవారం జ్యోతులు వెలిగిస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన చంద్రశేఖరుడు కావడం. అంటే చంద్రుడిని శిరస్సున ధరించినవాడు అని. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనసుకు అధిపతి. మరి ఆ మనసు చంచలంగా ఉండకూడదు అంటే చంద్రుడు మనకు అనుకూలంగా ఉండాలి. అందుకు శివారాధన చేయడం ఉత్తమంగా భావిస్తారు. ఇది మాత్రమే కాకుండా శివ పరమాత్ముడు నిత్యం హరి నామస్మరణ చేస్తుం టారు. శ్రీ మహా విష్ణువుకి పరమేశ్వరుడంటే ఎంతో ప్రీతి. తనకు ఇష్టమైన వారిని ఆరాధించినప్పడు ఆ నారాయణుడు ఎంతో సంతోషిస్తాడు. శివుడు, పార్వతీ దేవి కలిస్తేనే పూర్ణరూపమని శివపురాణం చెబుతోంది. అందుకే శివుడుని, శక్తిని ఇరువురిలో ఎవరిని ఆరాధించిన పూర్ణ రూపాన్ని ఆరాధించినట్లే.
శ్రావణ మాసంలోని విశిష్టతలు..
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసం లో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. శ్రావణ పౌర్ణ మి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచి కగా రక్షబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారం భం చేస్తారు. కష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇలా ఈ మాసమంతా వేడుకలతో సందడిగా ఉంటుంది. వీటిలో అధిక ప్రాధాన్యం స్త్రీలకే ఉండడం చెప్పుకోదగిన విషయం.