వ్యష్టి నుండి సమిష్టికి సాగే నిరంతర యాత్రే హిందూ సంస్కృతి

ప్రపంచంలోని మిగతా దేశాల్లో చట్టానిదే ప్రధాన పాత్ర. కానీ మన దేశపు సామాజిక జీవనం ధర్మం ఆధారంగా సాగుతుంది. సృష్టి నియమాలను అర్థం చేసుకోవడంలో విఫలమైన పాశ్చాత్య ప్రపంచం సమాజ వ్యవస్థకు చట్టాన్నే ఆధారం చేసుకుంది. కానీ అది కృత్రిమమైన వ్యవస్థ. మన ఇళ్ళలో వెలిగించే దీపాల గురించి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ ఇదే విషయాన్ని చెప్పారు. నూనె గింజలు పండించి, వాటి నుండి నూనె తీసి, దానిని ప్రమిదలో వేసి వత్తి వెలిగిస్తే అప్పుడు వెలుగు వస్తుంది. 
ఇలాగే చట్టం ఆధారంగా సాగే సామాజిక జీవనంలో కూడా ప్రతి విషయం ఇంత క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉంటుంది. కానీ సూర్యకాంతిని పొందడానికి ఇంత కష్టం అవసరం లేదు. కేవలం కళ్ళు తెరుచుకుని, ఇంటిలో కిటికీలు, తలుపులు తెరిస్తే చాలు. భారతదేశపు ధర్మప్రకాశం ఇలాంటిదని రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అంటారు.
భారతదేశంలో ధర్మం లేదా కర్తవ్యం అనేది అధికారాన్ని సూచించే శబ్దం కాదు.ఇక్కడి సమాజ వ్యవస్థకు ఆధారం కర్తవ్య భావనే. ఈ భావనకు మూలం భగవద్గీతలోని 'బీజ మామ సర్వ భూతానాం విద్ధి పార్థ సనాతనం' అనే వాక్యం. దీని అర్థం 'నేను (భగవంతుడు) సర్వజీవులలోని సనాతన బీజం(మూలం)'. అంటే సర్వప్రాణులు ఆ పరమేశ్వరుడి అంశమని అర్థం. అంటే పరస్పర ఆధారిత వ్యవస్థలోని అంగాలు. అంతేకానీ స్వతంత్ర ప్రాణులు కాదు. 'అనేక కర్తవ్యాలు, ఋణాలతో పుడుతున్నాను. నా జన్మ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ఆ ప్రయోజనాలు ఈ వ్యవస్థ ద్వారానే పూర్తవుతాయి. కాబట్టి నా గురించి నేను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు.' ఈ ఆలోచనా ధోరణినే మనం ధర్మం అన్నాం. ధర్మం అంటే కేవలం మతం కాదు.
మన దేశంలో కర్తవ్యం, అధికారం మధ్య మౌలికమైన తేడా ఏమీ లేదు. కేవలం ఆలోచనలో తేడా. కొందరు కర్తవ్యమని చేస్తారు, మరికొందరు అధికారమని భావిస్తారు. కొందరు 'ఈశావాస్యమిదం సర్వం' అని, మరికొందరు 'పరస్పరోపగ్రహో జీవనం' అని భావిస్తారు. ధర్మానికి అనేక రూపాలు ఉన్నాయి. కాబట్టి దానిని పాటించాలంటే సామూహిక భావన అవసరం. పితృధర్మాన్ని పాటించాలంటే పుత్రుడు-తండ్రి ఉండాలి. అలాగే మాతృధర్మం, సమాజధర్మం. ఇటువంటి ధార్మికభావనే మన సమాజానికి ఆధారం. అంతేకానీ సమాజం అంటే కేవలం మానవ సమూహం కాదు. ప్రతి వ్యక్తి తన అస్తిత్వాన్ని గుర్తించినప్పటికీ, సామూహిక ప్రయోజనాలకోసం వ్యక్తిగత లాభాలను పక్కన పెట్టి దానికోసం పనిచేయడమే సామాజిక జీవనం. మానవుడు సంఘజీవి అన్నది అందుకే. కాబట్టి 'బడితె ఉన్నవాడిదే బర్రె' అనే సిద్ధాంతం, ఆలోచన సమాజ జీవనానికి సరిపోదు. అటువంటి ధోరణి పెరిగితే అప్పుడు అది మానవ సమాజం కాకుండా పశువుల గుంపు అవుతుంది.
మన పూర్వీకులు సర్వ సృష్టిలో భగవంతుడిని దర్శించారు. ఈ దృష్టికోణమే మన వ్యక్తిగత, కుటుంబ, సమాజ చింతనలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే గ్రహాలకు కూడా సంబంధాలను ఏర్పరచుకున్నాం. అంగారక గ్రహం భూమికి పుత్రుడని, శని సూర్యపుత్రుడని ఇలా అశ్వని మొదలు రేవతి వరకు అన్ని నక్షత్రాలకూ కూడా మానవ సంబంధాలను ఏర్పరచుకున్నాం. అంతేకాదు మర్రి, రావి, తులసి మొదలైన చెట్లను పవిత్రమైనవిగా భావిస్తాం. అలాగే అన్ని జంతువులపట్ల కూడా ఆదరభావనాన్ని కలిగిఉంటాం. భారతీయ సంస్కృతిలో గృహస్థు పంచయజ్ఞాలను నిర్వహించాలి. దేవయజ్ఞం అంటే ప్రకృతి చక్రానికి అనుగుణంగా జీవనం సాగించడం. అంటే చుట్టుపక్కల ఉన్న చెరువులు, చెట్లు, జంతువులను పరిరక్షించడం. ఋషి యజ్ఞం అంటే ఋషులు మనకు ప్రసాదించిన జ్ఞానాన్ని నిలిపి ఉంచడం, దాని ప్రకారం జీవనం సాగించడం. పితృయజ్ఞం ద్వారా పూర్వజులపట్ల కృతజ్ఞత వ్యక్తం చేయాలి. మనుష్య యజ్ఞం ద్వారా అతిధులను ఆదరించాలి. ఇలా హిందూ ధర్మంలో వ్యక్తి ఐదు యజ్ఞాలను చేయాలి.
ఇలా సర్వసృష్టిపట్ల తన కర్తవ్యాన్ని గుర్తించి వ్యక్తి వ్యవహరించాలి. అలా జీవిస్తూ చివరికి వానప్రస్థాన్ని స్వీకరించి క్రమంగా ఈశ్వరప్రాప్తి పొందుతాడు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారతీయ సంస్కృతే పరిష్కారాలు చూపగలుగుతుందని దీనినిబట్టి తెలు స్తోంది. ఆర్థిక శోషణ, పర్యావరణ కాలుష్యం, తీవ్రవాదం మొదలైన సమస్యలకు చట్టం ఆధారంగా పరిష్కారాలు లభించవు. ప్రకృతి సహజమైన జీవనశైలికి దూరం కావడమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. ప్రపంచం తిరిగి ప్రకృతికి అనుకూలమైన జీవనశైలిని అనుసరించనంతవరకూ ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. నేడు హిందూజీవన విధానం మాత్రమే అటువంటి ప్రకృతి అనుకూలమైన జీవనశైలి. ఇది సర్వజీవజాలపు సంక్షేమాన్ని కాంక్షిస్తుంది. కాబట్టి హిందూ ధర్మం సూచించిన విధంగా మన జీవనాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి. మన సాంస్కృతిక మూల్యాలపట్ల గౌరవభావాన్ని కలిగిఉండాలి.
- నరేంద్ర జైన్‌