హితవచనం

ప్రేరణ ఇవ్వటమే అసలైన పని. నిజంగా ప్రేరణ కలిగించే శక్తి ఉన్న మాటను పలికించే అది వండిన ఎముకలలో జీవాన్ని నింపుతుంది. ప్రేరణాదాయమైన బ్రతుకు బ్రతికితే అది వేలకొద్ది కార్యకర్తలను తయారు చేస్తుంది. ''ఇంతకు 'జాతి' అంటే ఏమిటి? మాతృభూమి అంటే ఏమిటి? అది ఒక భూ ఖండం కాదు. అది ఒక రూపకాలంకారం కాదు. బుద్ధిజనితమైన కల్పన కాదు. అది ఒక మహత్తరశక్తి... రండి. జనని ఆహ్వానం ఆలకించండి. మన హృదయవాసినిగా తప స్వరూపం ఆవిష్కరించి, ఆరాధనలు అందుకోడానికి జనని నిరీక్షిస్తోంది. మనలో దైవాంశను తమస్సు కప్పివేసింది.
 కనుక ఆమె నిశ్చేతనంగా వ్యధ చెందుతున్నది. తమను ఆదుకోవలసిందని తన సంతానం అర్థించటం లేదని జనని వేదన చెందుతోంది. జనని మీలో మెదలుతున్నదని గుర్తించి స్వార్థమనే ముసుగులను చీల్చండి. చుట్టూ వెలసిన అలసత్వపు గోడలు కూలద్రోయండి. మీకు తోచిన విధంగా మాతృ సేవకు తరలి రండి. ప్రతి వ్యక్తి తన సామర్థ్యానికి అనుగుణంగా శరీరాన్ని, బుద్ధి బలాన్నీ, వాక్కునూ, ధనాన్నీ, ప్రార్థనలనీ, ఆరాధనలనీ ఎవరికి చేతనైనది వారు జననికి సమర్పించాలి. వెనుకకుతగ్గవద్దు. ఆమె పిలుపును వినికూడా ముందుకు రానివారిపై జనని ఆగ్రహించ గలదు. ఆమె ఆవిర్భావానికి లేశమైనా పాటుపడిన వారికి సముజ్వల, సుందర, ప్రసన్నవదనంతో జనని ప్రత్యక్షం కాగలదు.''
- శ్రీ అరవిందులు