గో రక్షణ పర్యావరణ పరిరక్షణ - ఎస్‌. గురుమూర్తి

ఎస్‌. గురుమూర్తి ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌, మేధావి, సామాజికవేత్త. ఆయన ప్రస్తుత ప్రభుత్వం గురించి, గోసంరక్షణ గురించి వ్యక్తీకరించిన అభిప్రాయాలను కింద ఇస్తున్నాం. 
ప్రస్తుతం దేశంలో గోవు గురించి బాగా చర్చ జరుగుతోంది. ప్రజల ఆహారపు అలవాట్లలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఎంతవరకూ సబబు?
ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం లేదు. ఇప్పుడు పశువుల్ని కాపాడుకోకపోతే పదేళ్ళ తరువాత పాలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 
గోమాంస భక్షణను ప్రోత్సహిస్తే పర్యావరణం నాశనమవుతుంది. ప్యారిస్‌ పర్యావరణ సదస్సులో సోమవారాన్ని మాంసరహిత దినంగా పాటించాలని అన్ని దేశాలు ఎందుకనుకున్నాయి? ఎందుకంటే మాంసం పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. శాకాహారం కంటే మాంసాహారానికి 48శాతం ఎక్కువ నీరు కావాలి. తాము తీసుకునే మాంసాతతరంలో సగం తగ్గించుకోవాలని చైనా తమ ప్రజానీకాన్ని కోరుతోంది. పశుసంపద నష్టమైనప్పుడు, వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించవచ్చును. మన దేశంలో గోవు అన్ని జంతువుల వంటిది కాదు. రాజ్యాంగం ప్రకారం గోవు, గోసంతతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాజ్యాంగంలోని 48వ అధికరణం అటువంటి బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతోంది. ఆవు మూత్రం, పేడ నేలను సారవంతం చేస్తాయి కాబట్టి ముసలివైపోయిన, ఆర్థికంగా నిరుపయోగమైన ఆవులను కూడా పరిరక్షించాల్సిందేనని 2005లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి పనికిరాని ఆవు అంటూ లేదని కోర్టు పేర్కొంది. ప్రజలకు మేలు చేయడం కోసం 48వ అధికరణం ఆహారాన్ని ఎంచుకునే ప్రజల వ్యక్తిగత హక్కును కూడా పక్కకు పెడుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ రోజున అనేక దేశాలు పర్యావరణ పరిరక్షణ కోసం పశుమాంస వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి. మనదేశంలోనే మొత్తం 29 రాష్ట్రాల్లో 18 ఇప్పటికే గోవధను నిషేధించాయి. ఈ నిషేధం చాలామటుకు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే అమలులోకి వచ్చింది. గోవు మతపరమైన విషయం ఎలా అవుతుంది? చట్టం ఒక్కటే చెపుతోంది. మార్కెట్‌లో బహిరంగంగా పశువుల్ని అమ్మడానికి వీలులేదు. ప్రైవేటుగా కొనుక్కోండి. తినండి. నిజానికి పాశ్చాత్య దేశాలు గోమాంసంపై 50% పన్ను విధించాలను కుంటున్నాయి.అలా మాంసం ప్రజలకు అందకుండా చేయాలనుకుంటున్నాయి. కానీ మన దేశంలో అలాంటిదేమీ జరగలేదు కదా.
అవినీతిరహిత ప్రభుత్వాన్ని నడపడం నరేంద్ర మోడీ సాధించిన అతిపెద్ద ఘనత అని మీరు అనుకుంటున్నారా?
అవును. అది ప్రధానమైన ఘనత. అవినీతిరహిత వ్యవస్థ లేనిదే మోడీ ఏమీ సాధించలేరు. అలాంటి అవినీతి లేని ప్రభుత్వాన్ని నడపడం మన దేశంలో అసాధ్యమనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కానీ అది అసాధ్యం కాదని మోడీ చూపించారు. పెడదా రిలో పోతున్న రాజకీయాలను మార్చి నిజాయితీతో కూడిన నిర్ణయాలను తీసుకునే ప్రక్రియను ప్రారం భించడానికి కొంత సమయం పట్టింది. ఆయన స్వయంగా 75మంది సంయుక్త కార్యదర్శులను ఎంపిక చేసి నియమించారు. ఇది ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేదు. ఇక్కడే పరిపాలనా వ్యవస్థలో మంచి, చెడు ప్రారంభమవుతాయి.