స్వదేశీ సంకల్పం కావాలిదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం ఎవరు?
సారవంతమైన భూములు బంజరుగా మారడానికి కారణం ఎవరు?
కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడడానికి కారణం ఎవరు?
రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణం ఎవరు?
మన తెలివితేటలు ఎవరి చాకిరీకో ఖర్చయిపోవడానికి కారణం ఎవరు?
సాక్షాత్తు విదేశీ కంపెనీలు!

అవి మన దేశపు మార్కెట్లపై జరుపుతున్న మూకుమ్మడి దాడి. అమెరికా, చైనా మొదలైన దేశాలకు చెందిన కంపెనీలు తమ లాభాల కోసం మన దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. మనకు కావలసిన వస్తువులు, మనకు కావలసిన పద్ధతిలో ఇవ్వడం ఈ కంపెనీలు ఎప్పుడూ చేయవు. 
తమ దేశాలకు అనుకూలమైన పద్ధతిలోనే అవి వ్యవహరిస్తాయి. సూపర్‌ కంప్యూటర్‌, క్రయోజనిక్‌ ఇంజన్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ఎవ్పుడూ వెనకడుగు వేసే ఈ విదేశీ కంపెనీలు నాసిరకమైన, మనకు పనికిరాని వస్తువుల్ని మాత్రం గుమ్మరిస్తుంటాయి. 18వ శతాబ్దం వరకూ వస్తూత్పత్తిలో, ప్రపంచ వ్యాపారంలో అమెరికా, బ్రిటన్‌, చైనాలకు మించి 18శాతం వాటా కలిగిన భారతదేశం ఆ తరువాత క్రమంగా కిందికి దిగజారిపోయింది. ఈ దేశాలు మన మార్కెట్‌ను ఆక్రమించుకునేందుకు నిరంతరం ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టడంలో మన ప్రభుత్వాలు విఫలం కావడంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇటీవలి కాలంలో ఆర్థిక, సైనిక, రాజకీయ రంగాల్లో చైనా దుందుడు వైఖరి భారత్‌కు అనేక సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆసియాలోనేకాక ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరుపొందిన భారత్‌ను దెబ్బతీయడానికి చైనా అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా వ్యాపార రంగం, రక్షణ రంగంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. తమ వస్తువులను భారత్‌పై గుమ్మరించడం ద్వారా ఇక్కడి ఉత్పాదక రంగాన్ని దెబ్బతీయాలన్నది చైనా వ్యూహం. దానితోపాటు టెలికమ్యూనికేషన్‌, రక్షణ సామగ్రి రంగాలలో కూడా ప్రవేశించి భారత్‌ను వ్యూహాత్మకంగా నిలువరించాలని చైనా ప్రయత్నిస్తోంది. 2001 వరకూ భారత్‌, చైనాల వ్యాపారం సంవత్సరానికి 62 బిలియన్‌ డాలర్లు ఉంటే అది పదేళ్ళలో 84 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత్‌ నుండి చైనాకు ఎగుమతి చేసినది 1/3వంతు కాగా చైనా నుండి దిగుమతి అయినది 2/3వంతు ఉందంటే వ్యాపార రంగంలో చైనా పైచేయి ఎలాంటిదో అర్థమ వుతుంది. ముఖ్యంగా 2006 తరువాత చైనా భారత్‌కు దిగుమతులతో బాగా లాభపడింది. ఒకరకంగా చూస్తే నిరంతరం భారత్‌ను ఇరుకున పెట్టాలనుకున్న చైనా అదే భారత్‌వల్ల బాగు పడిందన్నమాట. వాణిజ్యశాఖ అంచనాల ప్రకారం చైనా నుండి 4.25 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులు వచ్చిపడుతున్నాయి. అధికారిక లెక్కలు ఇలాఉంటే అనధికారిక లెక్కల ప్రకారం వీటి విలువ 6లక్షల కోట్లకు పౖౖెనే ఉంటుంది. అదే భారత్‌ నుండి చైనాకు ఎగుమతులు మాత్రం 60వేల కోట్లను మించడం లేదు. చైనా వస్తువులు ముంచెత్తడంతో భారత్‌ లో 40 శాతం స్థానిక, కుటీర పరిశ్ర మలు మూత పడ్డాయి. తమిళనాడు లోని శివకాశి టపాకాయల పరిశ్రమ, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలీగఢ్‌ తాళాల తయారీ పరిశ్రమ, కర్ణాటక చన్నపట్టన బొమ్మల తయారీ పరిశ్రమ మొదలైనవి బాగా దెబ్బతిన్నాయి. అనేక లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆఖరుకు చైనా 'మాంజా'తో గాలిపటాలు తయారుచేసే వారు కూడా సంక్షోభంలో పడ్డారు.
భారత్‌ ప్రస్తుతం ప్రపంచం లోనే రెండవ అతి పెద్ద టెలికమ్యూనికేషన్‌ మార్కెట్‌.
అలాగే అత్యధిక ఇంటర్‌ నెట్‌ వినియోగదారులు ఉన్న దేశాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. అతి పెద్ద మార్కెట్‌ అవకా శాలను ఉపయోగించుకు నేందుకు చైనా పెద్ద ఎత్తున ఫోన్లను ఇక్కడకు దిగుమతి చేస్తోంది. విడి భాగాల రూపంలో వీటిని ఇక్కడకు పంపడం ద్వారా పన్ను భారం పడకుండా లాభాలు మాత్రం గడిస్తోంది.
ఒకవైపు ఆర్థికపరమైన దురాక్రమణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొడుతున్న చైనా మరోపక్క పాకిస్థాన్‌కు మద్దతునివ్వడం ద్వారా నేరుగా రక్షణ పరమైన సమస్యలు సృష్టిస్తోంది. గత పదేళ్ళలో ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ప్రవేశపెట్టిన తీవ్రవాద వ్యతిరేక తీర్మానాలన్నింటినీ చైనా వ్యతిరేకిస్తూ వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన మౌలానా మసూద్‌ అజర్‌, జకీ ఉర్‌ రెహమాన్‌, సయ్యద్‌ సలాఉద్దీన్‌ మొదలైన తీవ్రవాదులపై చర్యలు చేపట్టకుండా తన వీటో అధికారంతో అడ్డుపడింది. అలాగే న్యూక్లియర్‌ సరఫరా బృందంలో సభ్యత్వం రాకుండా చూసింది. అంతేకాదు ఇటీవల మానససరోవర్‌ యాత్రను అడ్డుకోవడం, సిక్కిం ప్రాంతంలో అక్రమంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా, ఇదేమిటని ప్రశ్నించిన భారత్‌ను బెదిరించడానికి ప్రయత్నించింది. 1962 యుద్ధాన్ని గుర్తు చేసింది. ఆ యుద్ధంలో చైనా 38,000 చ.కి.మీ భూభాగాన్ని ఆక్రమించింది.
చైనా సాగిస్తున్న ఆర్థిక, సైనిక, రాజకీయ దురాక్రమణను ఎదుర్కొనడానికి స్వదేశీ విధానమే సరైన పరిష్కారం. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులను (చైనా వస్తువుల్ని) బహిష్కరించడం ఇందుకు సరైన మార్గం. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి, గోసంతతిని పెంచి పోషించుకోవాలి. భారతీయ విద్య, యోగా, ఆయుర్వేదం మొదలైనవాటిని పెంపొందించుకోవాలి. అందుకు అంతా స్వదేశీ సంకల్పం తీసుకోవాలి.